లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని ప్రతిభా గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బాలచంద్రుడు(17) అనే విద్యార్థి కళాశాల బయట ఉన్న రైతు పొలంలోని సంప్‌లో పడిపోయి మృతి చెందాడు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలచంద్రుడు ఉదయం కళాశాలకు వచ్చాడని.. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో కనిపించకుండా వెళ్లాడని తెలిపారు. సాయంత్రం 5గంటల సమయంలో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కళాశాల కాంపౌండ్ బయట పొలంలో ఉన్న సంప్‌లో పడి ఉండటం గమనించామన్నారు. కొన ఊపిరితో ఉన్న విద్యార్థిని పులివెందుల ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన తెలిపారు. కాగా ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల చుట్టూ భారీ ప్రహరీ ఉందని.. ప్రహరీ ఎక్కి వెళ్లి ఉంటే ఎవరూ గమనించలేదా.. విద్యార్థి కనిపించని విషయాన్ని సాయంత్రం వరకు తల్లిదండ్రులకు ఎందుకు తెలియజేయలేదు.. ఇలాంటి పలు అనుమానాలు వెంటాడుతున్నాయి.. మృతుడి స్వగ్రామం చింతకొమ్మదిన్నె మండలం ఆర్.కృష్ణాపురం కాగా.. అతని తండ్రి ఓబులేసు ప్రొద్దుటూరులోని యోగి వేమన యూనివర్సిటీ కాలేజిలో ల్యాబ్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంవల్లే విద్యార్థి మృతి చెందాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.