ర్యాగింగ్ రోగ్ గేమ్
ఒక స్టూడెంట్‌ని ఎవరైనా కొడితే మొత్తం స్టూడెంట్ ప్రపంచం తిరగబడుతుంది.
అదీ యూత్‌లో ఉన్న యూనిటీ.
ఒకరికోసం ఒకరు ప్రాణం కూడా ఖాతరు చేయకుండా ఫైట్ చేస్తారు.
మరి ఆ స్టూడెంట్సే... ఫ్రెషర్స్ మీద రెచ్చిపోతుంటే..!
కాపాడాల్సిన చేతులే గొంతు పిసికేస్తుంటే... ఏం చెయ్యాలి? పేరెంట్స్ ఏం చెయ్యాలి?
సీనియర్లను పేరెంట్స్ మందలించాలా? ఫ్రెషర్లకు పేరెంట్స్ ధైర్యం చెప్పాలా?
ర్యాగింగ్ ఆటగా మొదలైనా... క్రైమ్ గానే ఎండ్ అవుతుంది.
ర్యాగింగ్ ఈజ్ ఫర్ క్రిమినల్స్. నాట్ ఫర్ స్టూడెంట్స్.
శృతి మించి
ఇటీవల విశాఖ నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థులు అర్ధరాత్రి కొట్లాటకు దిగారు. ఈ గొడవ మొదట ఓ సీనియర్ విద్యార్థి జూనియర్‌ని ర్యాగింగ్ చేయడంతో మొదలైంది. ఈ ఘటనలో పదిమంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
అంతకు మించి
వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీలో డిగ్రీ (ఆర్కిటెక్చర్) ఫస్టియర్‌లో చేరింది. ఇద్దరు తోటి విద్యార్థినులతో కలిసి వర్సిటీలోని హాస్టల్‌లోనే ఉంటోంది. కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో సీనియర్ స్టూడెంట్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తట్టుకోలేక ఎదురు తిరిగింది. సీనియర్‌కు ఎదురు తిరిగినందుకు అదే గ్రూప్‌లో ఉన్న ఓ సీనియర్ విద్యార్థిని ఆమెకు సరైన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంది. హాస్టల్ గదిలో రిషితేశ్వరిని అర్ధనగ్నంగా తిప్పి, ఆ దృశ్యాలను వీడియో తీసిందని, వాటిని సీనియర్స్‌కి చూపించిందని, ఆ అవమానం భరించలేకే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ర్యాగింగ్ చేసినవారికి తన మరణం కనువిప్పు కావాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది రిషితేశ్వరి. నిన్నమొన్న జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను, తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్రవ్యాప్త నిరసనలూ మొదలయ్యాయి.
కాలేజీ వర్సెస్ కాలేజీ
పది రోజుల కిందట విశాఖలో రెండు ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈవ్‌టీజింగ్ ఇష్యూతో రోడ్డు మీదకెక్కారు. మా కాలేజీవారినే ర్యాగింగ్ చేస్తారా...!! అంటూ గొడవకు దిగారు. పరిచయాలతో మొదలైన ర్యాగింగ్... చివరికి వేర్వేరు కళాశాలల విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరుగా మారింది.
నిజానికి విద్యాలయాలలో ర్యాగింగ్ అన్నది కొన్నేళ్లుగా కనుమరుగైందని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులూ నిశ్చింతగా ఉన్నారు. కానీ, తాజాగా ఇప్పుడు చోటుచేసుకున్న ఈ సంఘటనలు అందరినీ మళ్లీ భయంలో, ఆవేదనలో ముంచెత్తాయి. ఆ రోజుకు కాలేజీ నుంచి తమ బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకుంటే చాలని ఫ్రెషర్స్ పేరెంట్స్ భయపడే పరిస్థితి మళ్లీ వచ్చింది!
పలకరింపులు... పరిచయాలు
ఫ్రెషర్స్ వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికీ, సీనియర్లకు సమన్వయం ఉండాలని అధ్యాపకులు చెప్పే సూచనల మేరకు పరిచయాలు, పలకరింపులు ఒక సంప్రదాయం అయ్యాయి. ఇంజినీరింగ్ విద్యా సంస్థలు పెరిగిన తర్వాత ఈ సంప్రదాయం మరింత విస్తరించింది. సీనియర్లకి జూనియర్లు ఇచ్చే గౌరవం క్రమంగా వారికి అవకాశంగా మారింది. దీంతో కొందరు ఆకతాయి సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించడం, జూనియర్లతో అన్ని పనులు చేయించుకోవడం, చెప్పినట్టు వినకుంటే బెదిరించడం చేస్తున్నారు. చివరికి మానసికంగా, శారీరకంగా హింసించే స్థాయికీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురయ్యే వేధింపులు భరించలేక ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు.
పదేళ్లుగా... సీరియస్ యాక్షన్!
కేంద్ర ప్రభుత్వం కళాశాలలో జరిగే అకృత్యాలను సీరియస్‌గా తీసుకొని ర్యాంగింగ్ నిరోధక చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ర్యాగింగ్ భూతం తన ఉనికి కోల్పోతూ వచ్చింది. చట్టానికి భయపడి సీనియర్లు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లు చేయడం తగ్గించారు. అయితే, మళ్లీ కొన్ని రోజుల కిందట తెలుగు రాష్ట్రాలలో ర్యాగింగ్ రూపం మార్చుకొని కలత చెందేలా చేస్తోంది.
తిరుగుబాటు...
పరిచయాల పేరుతో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తే కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు భరించే స్థితిలో లేరు. సీనియర్లు అయితే ఏంటి? వేధిస్తే సహించాలా? అని ఎదురు తిరుగుతున్నారు. దీనిని భరించలేని సీనియర్లు వారి మీద దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో జూనియర్స్ కూడా సీనియర్స్ మీద తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాలలో అయితే కాలేజీలు ఒకే చోట ఉంటున్నాయి. దీంతో వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం, ఈవ్ టీజింగ్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో కళాశాల విద్యార్థులు గొడవలకు దిగుతూ రోడ్ల మీదనే కొట్లాడుకుంటున్నారు. మా కాలేజీ అమ్మాయిని కామెంట్ చేసావని ఒకరు, మా కాలేజీ స్టూడెంట్‌ని కొడతావా అంటూ మరొకరు... గొడవలకు దిగుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.
ఇవన్నీ ‘రోగ్ గేమ్’లో భాగమే
► అశ్లీల పాటలు పాడించడం, అశ్లీల నృత్యాలు చేయించడం, ముద్దుపెట్టుకోమనడం... వంటివి.
► శారీరకంగా, మానసికంగా హింసించడం.. హింసకు సహ విద్యార్థులను ప్రేరేపించడం.
► విద్యార్థి చదువుపై ప్రభావం చూపిస్తూ అకడమిక్ యాక్టివిటీస్‌కు అంతరాయం కల్గించడం.
► జూనియర్స్‌ని సీనియర్ విద్యార్థులు తమ అకడమిక్ టాస్క్‌ని పూర్తి చేయాలని బలవంతం చేయడం.
► బలవంతంగా ఆర్థిక భారం పడేట్టు చేయడం.
► మాటల ద్వారా గానీ, మెయిల్స్, సందేశాల రూపంలోగాని, ఫోన్ ద్వారా గానీ టార్చర్ పెట్టడానికి ప్రయత్నించడం.
పేరెంట్స్... ఇవి మీ కోసం
►ఇంట్లో సీనియర్ విద్యార్థి ఉంటే కాలేజీ అడ్మిషన్స్‌కు నెల రోజుల ముందు నుంచే వారితో- వేధించడం వల్ల జూనియర్స్‌కి కలిగే ఆవేదన, దాని వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించాలి.
►కొత్తగా కాలేజీకి వెళ్లే విద్యార్థి ఉంటే సీనియర్స్ నుంచి ఎదురయ్యే పరిణామాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో జాగ్రత్తలు తెలియజేయాలి.
►సినిమాలలో ర్యాగింగ్ సన్నివేశాలు ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ నిజజీవితాల్లో మాత్రం అలాంటి ఆనందాలు విషాదాలు నింపుతున్నాయి. చదువు మనిషిని ఉన్నతంగా మార్చాలి. అందుకు ఆటంకంగా నిలిచే ర్యాగింగ్ విషసంస్కృతికి నేడే చెక్ పెడదాం.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
రేప్‌తో సమానమైన కేసు!
1980 నుంచి ర్యాగింగ్ కేసులు నమోదు అవుతున్నా 1995 తర్వాత ఎక్కువ అవడంతో... డాక్టర్ రాఘవన్, యు.జి.సి ప్రొఫెసర్ కె.టి.ఎస్ ఉన్ని కమిటీ ఆధ్వర్యంలో... రేప్, అట్రాసిటీకి సమానమైన కేసుగా ర్యాగింగ్‌ను పరిగణించాలన్నారు. కోర్టులో నేరం రుజువైతే ఆ నేరాన్ని బట్టి 3 ఏళ్లకు పైగా జైలు శిక్ష, 25 వేల రూపాయలు ఆపైన జరిమానా ఉంటాయి. ఏడాది-నాలుగేళ్ల వరకు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడం, ఇతర కాలేజీలలో ఎక్కడా అడ్మిషన్ ఇవ్వకపోవడం జరుగుతుంది. స్కాలర్‌షిప్ కూడా రద్దు చేస్తారు. పాస్‌పోర్ట్, వీసా.. వంటివీ క్యాన్సిల్ చేస్తారు.
- నిశ్చల సిద్ధారెడ్డి,
అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్
విజిలెన్స్ కమిటీలు
జూనియర్లను స్వాగతించే సంస్కృతి సీనియర్ విద్యార్థుల్లో పెరగాలి. తోటి విద్యార్థులను గౌరవించడం నేర్చుకోవాలి. ర్యాగింగ్ నిరోధించేందుకు మా కళాశాల ప్రాంగణంలో, ప్రతి బ్లాక్‌లో కంట్రోల్ రూమ్ ప్రారంభించాం. హాస్టళ్ల వద్ద విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక విచారణ కమిటీ వే శాం. ర్యాగింగ్‌కు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. నిత్యం పర్యవేక్షిస్తున్నాం.
- జి. ఏసురత్నం, ప్రిన్సిపాల్
జేఎన్‌టియూ, విజయనగరం
కౌన్సెలింగ్ మేలు!
గతంలో సీనియర్స్ చేత వేధింపబడిన, మానసిక అపసవ్యత కలిగిన విద్యార్థులు తమకంటే చిన్నవారిని వేధించి, ఆనందించాలనుకుంటారు. వారు పెరిగిన వాతావరణం కూడా ఇందుకు దోహదం చేస్తుంది. ర్యాగింగ్ చేస్తారేమో అని జూనియర్స్ భయపడకుండా, ర్యాగింగ్ చేయాలనే తలంపు సీనియర్స్‌లో కలగకుండా కౌన్సెలింగ్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు.
- డా. సూర్యనారాయణ,
సైకాలజిస్ట్
మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారా?
కళాశాలలో ర్యాగింగ్ కారణంగా ఎన్నో దారుణ సంఘటనలు, మరణాలను గుర్తించిన సుప్రీం కోర్టు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో 2009లో నేషనల్ యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ర్యాగింగ్‌కు గురయ్యే విద్యార్థులు... helpline@antiragging.in కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నెంబర్: 1800-180-5522 {పతి 15 నిమిషాలకు ఒక ఫిర్యాదు అందుతున్నట్టు హెల్ప్‌లైన్ ద్వారా తెలుస్తోంది. 2012లో antiragging.in అనే మరో పోర్టల్‌ను ప్రారంభించారు. ిఫిర్యాదు అందిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా సదరు విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతారు.
ఉన్నత విద్యాసంస్థల బాధ్యతలు
► {పతి కళాశాల యాజమాన్యం విద్యార్థిని చేర్చుకునేముందు తప్పక ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్/బ్రోచర్ అందజేయాలి.
► యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నెంబర్, మెయిల్ ఐడి, ఇతర ఫోన్ నెంబర్లు విధిగా ఆ నిబంధనల బుక్‌లెట్‌లో ఉండాలి.
► ఆ నెంబర్లను బుక్‌లో నోట్ చేసుకోమని విద్యార్థులకు తెలియజేయాలి. ఏ చిన్న అవాంతరం ఎదురైనా సమాచారాన్ని చేరవేయమని సూచించాలి.
► ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్య తీసుకోవచ్చని విద్యార్థి తల్లిదండ్రుల చేత ఒక అఫిడవిట్‌ను తీసుకోవాలి.
► ర్యాగింగ్‌కు పాల్పడితే జరగబోయే నష్టాలు, తీసుకునే చట్టపరమైన శిక్షలను సూచిస్తూ కాలేజీల్లో డిస్‌ప్లే పోస్టర్లను అతికించాలి.
► కాలేజీల్లోనూ, హాస్టళ్లలోనూ ముందు కొన్ని నెలల పాటు యాంటీ-ర్యాగింగ్ స్క్వాడ్‌ను తప్పక నియమించాలి.
తప్పనిసరి...
► జూనియర్స్-సీనియర్స్‌కి మధ్య కాలేజీ టైమింగ్స్ కనీసం 30 నిమిషాలైనా తేడా ఉండాలి. బస్‌స్టాప్స్, టీ స్టాల్స్ దగ్గర విద్యార్థులు గుమికూడుతుంటారు. కాలేజీ స్టార్ట్ అవడానికి అరగంట ముందు, కాలేజీ వదలిన అరగంట వరకు స్క్వాడ్స్ అక్కడ ఉండాలి.
► ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ గుమిగూడకుండా చూడాలి.
► కాలేజీలో డ్రాప్‌బాక్స్ తప్పక ఉంచాలి.
► {పతి ఐదుగురికి ఒక లీడర్‌ని పెట్టి, వారితో ఫ్యాకల్టీ టచ్‌లో ఉండాలి.
► వేధింపులకు లోనైన సీనియర్స్ చేత జూనియర్ మీట్ పెట్టించాలి. ర్యాగింగ్ కమిటీలో సీనియర్ లీడర్స్, జూనియర్ లీడర్స్ తప్పక ఉండాలి.
► హాస్టల్‌లో అయితే సీనియర్స్ ప్రమేయం లేకుండా ఫ్రెషర్స్ కోసం సెపరేట్ బ్లాక్‌ను కేటాయించాలి.