ప్రేమ చరిత్ర
అగాథంలోకి తొంగి చూస్తే?
లోతైన ప్రేమ కనబడుతుంది.
పర్వతాలెక్కి పిలిస్తే?
ప్రేమ ప్రతిధ్వనిస్తుంది.
షరతులతో సంకెళ్లేస్తే?
ప్రేమ పట్టరానిదైపోతుంది.
కాంక్షలతో కాటేస్తే? కక్షలతో చంపేస్తే?
ప్రేమ... మరో చరిత్ర అవుతుంది.
ఇలాంటి సినిమా చూడకపోతే?
ప్రేమ... భవసాగరంలో కొట్టుకుపోతుంది...
బాలు, స్వప్నల స్వప్నంలా..!
ప్రేమ ఫలించిందంటే ఏమిటి అర్థం? కథ అయిందనా? చరిత్ర అయిందనా? రెండూ కాదు. నిజం అయిందని! కానీ కమల్, సరితల ప్రేమ నిజం కాలేదు. అంటే వాళ్ల ప్రేమ ఫలించలేదా? ఫలించింది. వాళ్ల ఆత్మలు ఇంకా వైజాగ్ బీచ్ కోటలో కలిసే ఉన్నాయి. ఆత్మలా? మనుషుల్లేరా! ఉన్నారు. ఇప్పుడున్న ప్రేమికులందరి ఆత్మలే ఆ ఇద్దరు.
అవునూ... ఇప్పుడూ మనం ఇలా శిథిలాల్లో తిరుగుతున్నాం ఎందుకు స్వప్నా? (కమల్ ఆత్మ) ఈ శిథిలాల వెనుక ఎన్నో కథలుంటాయ్. చిరిగిపోయిన చరిత్ర పుటలు ఎంత చిందరవందరగా పడున్నా శాశ్వతంగా గుర్తుంటాయ్. బాలూ... (సరిత ఆత్మ)స్వప్నా... మనం పెళ్లి చేసుకోకూడదు. ఏ బాలూ...? ప్రేమంతా అయిపోయిందా? ప్చ్... కాదు. పెళ్లి చేసుకుంటే అందరిలా మనం కూడా ఆలుమగలుగా మిగిలిపోతాం? ప్రేమ ఫలించకపోతేనే కథానాయకులమవుతాం. మనది కథెందుకు కావాలి? చరిత్ర కాకూడదా?
సరిత విశాఖ విమెన్స్ కాలేజీలో చదువుతోంది. కమల్ ఉద్యోగం మానేసి మద్రాస్ నుండి వైజాగ్ వచ్చేశాడు.ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. కమల్‌ది తమిళ ఫ్యామిలీ. సరితది తెలుగు ఫ్యామిలీ. కమల్‌ది వెజ్ ఫ్యామిలీ. సరితది నాన్‌వెజ్ ఫ్యామిలీ. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి తల్లిదండ్రులూ డైనమైట్‌లా పేలారు! ఇద్దర్నీ విడివిడిగా కూర్చోబెట్టి, నిలబెట్టి వంద ప్రశ్నలు వేశారు. ఇద్దరిదీ ఒకటే మాట... మేము ప్రేమించుకున్నాం. మేము ప్రేమించుకున్నాం. ఓ రోజు కమల్ డెరైక్టుగా సరిత ఇంటికే వచ్చేశాడు. సరితను కౌగిలించుకుని ‘ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు’ అన్నాడు. రెండు కుటుంబాల మధ్య పచ్చటి ప్రేమ భగ్గుమంది.రెండు వైపుల పెద్దలూ సమావేశమయ్యారు. ఇక్కడ కమల్ తల్లి సాఫ్ట్. అక్కడ సరిత తండ్రి సాఫ్ట్. కానీ ఇక్కడి తండ్రి, అక్కడి తల్లి ధాటికి ఆ సాఫ్ట్‌నెస్ వర్కవుట్ కాలేదు. పెద్దలకు, పిల్లలకు మధ్య ప్రేమయుద్ధం మొదలైంది. మేం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాం. (కమల్)అందరూ మాకన్నా వయసులో, అనుభవంలో పెద్దవాళ్లు. ఒక్కరూ మా మనసులేమిటో అర్థం చేసుకోరే! (సరిత) పెద్దవాళ్లని గౌరవిస్తున్నాం కదా. అందుకే (కమల్) ఎవరికీ తెలియకుండా బాలు నన్ను లేవదీసుకుపోతే ఏం చేసేవారేం?
ఆన్సర్ హర్ (కోపంగా పైకి లేవబోయిన తండ్రితో కమల్). మేమేం చేసినా హద్దులు... హద్దులు దాటి ప్రవర్తించలేదు. దాటితే అప్పుడు నోరు మూసుకుంటారే!
కమల్ తండ్రి జె.వి.రమణమూర్తి ఆవేశంగా అరిచాడు. ‘‘వాయి మూడ్రా భడవా... బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు.. మాంసం తినే పిల్లను పెళ్లి చేసుకుంటాట్ట. సిగ్గు లేదు. సిగ్గు’’. నేను మాంసం, చేపలు మానేస్తాను అంది సరిత. ఓహో అది గొప్ప త్యాగమా అంది సరిత తల్లి. అదే త్యాగం కాకపోతే నేను మాంసం తింటాను అన్నాడు కమల్.శివ శివా అన్నాడు కమల్ తండ్రి. ఇదంతా కావాలని ఈ అరవోళ్లు చేస్తున్న కుట్ర. అదేదో సామెత చెప్పినట్టు... ఎక్కడో చెన్నపట్నం నుంచి వలస వచ్చినోడికి మా అమ్మాయిని కట్టబెడతామా? ఏం.. తెలుగుదేశం గొడ్డుబోయిందా? (సరిత తల్లి) మీకు భాష మాత్రమే అభ్యంతరమైతే... ఒక్కనెల గడువివ్వండి. మీ తెలుగులో మీకే పాఠాలు చెప్తాను. కవిత్వాలు రాస్తాను. పొయెట్రీ. జస్ట్ వన్ మంత్ (కమల్)రాస్తావ్ అబ్బాయ్ రాస్తావ్. మా నెత్తిన పేడ రాస్తావ్. అందుకే కన్నారు మీ అమ్మా అబ్బా. (సరిత తల్లి) చూడండి... వాళ్లు సరే చిన్నవాళ్లు. మనమైనా కాస్త పెద్ద తరహాగా వ్యవహరించకపోతే ఎలా? వాళ్లిద్దరూ ఒకళ్లనొకళ్లు ప్రేమించుకున్నాం అంటున్నారు. ఇప్పుడు మనమేం చేయాలో అది ముందు ఆలోచించండి. (కమల్ తల్లి) ఏం చేయవలెనా? ముందా చెయ్యి తియ్యమనండి. (కమల్ సరిత చెయ్యి పట్టుకుని ఉంటాడు) అంద కయ్యిడరా. ఈ వయసులో ప్రేమయే! ప్రేమ! వ్యామోహం ద. బలుపు. (కమల్ తండ్రి) వాదన ఆగట్లేదు.
ఇదంతా ఎందుకండీ... మాది నిజమైన ప్రేమే అని తెలియజేయడానికి ఏం చెయ్యమంటారో చెప్పండి. చేస్తాం అంది సరిత.
ఊ... చూడండీ... మీరెవరూ ఏమీ అనుకోనంటే... నేనొక మాట చెప్తాను. ఒక సంవత్సరం పాటు వాళ్లిద్దర్నీ వేరు చేసి చూడండి. ఆ తర్వాత కూడా వాళ్లు పరస్పరం కోరుకుంటే... అది నిజంగా ప్రేమే. వ్యామోహం కాదు అన్నాడు మధ్యవర్తి. కమల్ ఇంటి ఓనర్.
అయితే అప్పుడు పెళ్లి చేయవాలా? పోవయ్యా.. నూరు సంవత్సరమైనా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అదెల్లా ముడియాదు. (కమల్ తండ్రి).
ముడియాదు అనడానికి మీరెవరండీ. నేను చెప్తున్నాను. ఈ సంబంధం నాకు ముడియాదు. ఈ జగన్నాథానికేం (మధ్యవర్తి) పోయింది. పిల్లా పీచా.. నోటికొచ్చినట్టు వాగుతాడు. (సరిత తల్లి)అలా తోసి పారేయకండి. కాస్త ఆలోచించండి. (కమల్ తల్లి) సరిత తండ్రి ఆలోచనలో పడ్డాడు. అవునే. ఆయనజెప్పిందీ కాస్త సబబుగానే ఉన్నట్టుంది. అన్నాడు. ఏం బాలూ అంది కమల్ తల్లి.
ఎదుక్కుమా ఇదెల్లా.. ఏదో పెద్ద అగ్ని పరీక్ష లాగా. యూ... యూసీ... మేము ఒప్పుకోం (కమల్)
పోనీ ఒప్పుకుందాం బాలూ. వీళ్ల పరీక్షలకు మనం దడిసిపోతామా? ఏం చేసినా మన మనసులు మారవ్. నాకా నమ్మకం ఉంది అంది సరిత. ఊ.. అయితే అన్నాళ్లు ఒకర్నొకరు చూసుకోకూడదు. మాట్లాడకూడదు. ఉత్తరాలు కూడా రాసుకోకూడదు. (సరిత తల్లి) ఆ.. అసలు ఇద్దరూ ఒక ఊర్లోనే ఉండకూడదు. వాణ్ణి హైద్రాబాద్ పంపిస్తున్నాను. (కమల్ తండ్రి)
అగ్రిమెంట్ అయింది. కమల్, సరిత విడిపోయారు. కమల్ హైదరాబాద్‌లో. సరిత వైజాగ్‌లో. ఏడాది వరకు వీళ్లు కలుసుకోడానికి వీల్లేదు. డెడ్‌లైన్... డిసెంబర్ 19, 1977. ఈలోపు కలుసుకుంటే ప్రేమ రద్దు.
అక్కడ హైదరాబాద్‌లో కమల్‌కి ఎవరైనా ‘కావ్యం’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ‘వెన్నెల’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ఇక్కడ విశాఖపట్నంలో సరిత... కమల్ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతోంది. అక్కడ కమల్‌కి మాధవి పరిచయం అయింది. మాధవియంగ్ విడో. కమల్‌కి తెలుగు నేర్పిస్తోంది. డాన్స్ నేర్పిస్తోంది. ఇక్కడ సరితకు బావ టార్చర్ మొదలైంది. కమల్ ప్రతి జ్ఞాపకాన్నీ తుడిచేసి, తన తమ్ముడు మిశ్రోకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సరిత తల్లే ఆ బావని రప్పించింది. సరితకు ఇంకో టార్చర్.. అమెపై కన్నేసిన బుక్‌షాప్ ఓనర్. అవకాశం కోసం కాచుక్కూర్చున్న కామాంధుడు అతడు. రోజులు గడుస్తున్నాయి. కమల్, సరితల ప్రేమకు ఒక్కోరోజు ఒక్కో పరీక్ష ఎదురౌతోంది. కమల్ నెగ్గుతున్నాడు. సరిత నెగ్గుతోంది. కానీ ఓ రోజు కమల్ ఓడిపోయినంత పని చేశాడు! జూలాజికల్ ఎక్స్‌కర్షన్ కోసం వైజాగ్ నుండి సరిత, ఆఫీస్ ఇన్‌స్పెక్షన్ కోసం హైదరాబాద్ నుండి కమల్ కాకినాడ వెళ్లారు. ఓ రెస్టారెంట్‌లో దిగారు. అనుకోకుండా ఇద్దరివీ పక్కపక్క గదులు. సరితకు తెలీకుండా ఆమె బావ కూడా ఆమెను ఫాలో అయి వచ్చాడు. సరిత ఆశ్చర్యపోయింది. తనపై నిఘా పెట్టినందుకు తల్లిని తిట్టుకుంది.
ఇక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది. సరితను చూడకుండా ఉండలేక ఆమె గదిలోకి వెళ్లిన కమల్‌కు సరిత బావ కనిపించాడు. త్వరలో తను సరితను చేసుకుంటున్నట్లు చెప్పాడు. కమల్ నమ్మాడు. కోపంతో వెళ్లిపోయాడు. ఆ కోపం మాధవి మీద ప్రేమ అయింది. ఆ ప్రేమ పెళ్లి కార్డులు వేసే వరకు వెళ్లింది. ఈలోపు కమల్, మాధవి బుక్ ఎగ్జిబిషన్‌కి వెళతారు. అక్కడ స్టాల్ పెట్టిన వైజాగ్ బుక్‌షాప్ ఓనర్ (నటుడు కృష్ణ చైతన్య) కమల్‌కి కనిపిస్తాడు. మాధవిని అనుమానంగా చూడడం గమనించి, నా కాబోయే భార్య అని చెప్తాడు కమల్. ‘పెళ్లి చేసుకోవడం నాకూ చేతనౌను. వైజాగ్ వెళ్లి చెప్పండి’ అంటాడు.
ఇక కృష్ణ చైతన్య ఊరుకుంటాడా? నేరుగా వెళ్లి సరితకు, ఆమె అమ్మానాన్నలకు చెప్పాడు. సరిత షాక్ తింది. పరుగున వెళ్లి ‘బాలూ పెళ్లి చేసుకుంటున్నాడా..’ అని కమల్ తల్లిని అడిగింది. నిజం కాదని తెలుసుకుని గుండెమీద చెయ్యి వేసుకుంది. గడువు తేదీ కోసం ఎదురు చూస్తోంది. అక్కడ హైదరాబాద్‌లో కమల్ సరితకు రాసి, పోస్ట్ చేయని ఉత్తరాలను చూసింది మాధవి. వారిద్దరి మధ్య ప్రేమ ఉందని గ్రహించింది. వెంటనే వైజాగ్ వచ్చి సరితకు కమల్ ప్రేమ గురించి చెప్పింది. సరిత పెళ్లి కూడా వట్టి మాటేనని తెలుసుకుంది. తిరిగి హైదరాబాద్ వెళ్లి కమల్‌కు అసలు సంగతి చెప్పింది. ప్రింట్ అయిన పెళ్లి కార్డులను పక్కన పడేసింది. వెంటనే వెళ్లి సరితను కలుసుకొమ్మని కమల్‌కు చెప్పింది. కమల్‌కు ట్రైన్ టిక్కెట్ కూడా బుక్ చేసింది.
కమల్ వైజాగ్ బయల్దేరాడు. మాధవి అన్న రెడ్డి, తన చెల్లెలి పెళ్లి పాడైపోయిందన్న ఆవేదనతో, ఆగ్రహంతో కమల్‌ను చంపేందుకు పథకం వేశాడు. రాత్రి 3 గంటలప్పుడు విశాఖపట్నం అప్పారావుకు ఫోన్ చేసి, వాణ్ణి చంపెయ్ అని చెప్పాడు. నా చె ల్లెల్ని దగా చేసినవాడు మరొక దానితో కులకడానికి వీల్లేదు అని అన్నాడు.
క్లైమాక్స్
వైజాగ్‌లో కొండ మీద గుడి. కమల్, సరితల లవ్‌స్పాట్. కమల్ వస్తున్నాడని గుడికి బయల్దేరింది సరిత. ఒంటరిగా సైకిల్ మీద. అమెను ఫాలో అవుతున్నాడు... ఎప్పటినుంచో ఆమె కోసం కాచుక్కూర్చున్న కృష్ణ చైతన్య. ఇప్పటికి ఛాన్స్ దొరికింది.ఇంటికి వచ్చి, అక్కడి నుంచి సరిత వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె గుడికి వెళ్లిందని తెలుసుకుని బైక్‌పై బయల్దేరాడు కమల్. మాధవి అన్న రెడ్డి పురమాయించిన రౌడీలు కమల్‌ని వెంబడించారు. సరితను కృష్ణ చైతన్య వెంటాడుతున్నాడు. కమల్ ను వీళ్లు వెంటాడుతున్నారు. ఒకరు శీలం దోచుకోవడం కోసం. ఇంకొకరు ప్రాణాలు తీయడం కోసం. ఇక్కడ ట్విస్టులేమీ లేవు. సర్వం కోల్పోయి సరిత, ప్రాణాలు కోల్పోతుండగా కమల్ ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరిలోకి ఒకరు ఒరిగిపోయారు. బాలు... బాలు.. ఇంతకాలం మనం విడిపోయింది మృత్యువు ఒడిలో కలవడానికా? బాలూ ఇది జరక్కముందే నన్ను నీతో లేవదీసుకుపో బాలూ... అంటోంది సరిత. రా స్వప్నా అంటున్నాడు కమల్. ఇద్దరూ సముద్రంలో కలిసిపోయారు. ప్రేమికులు ఓడిపోయారు. కానీ ప్రేమ గెలిచింది. మరో చరిత్ర అయి నిలిచింది.
వివరాలు
నటీనటులు : కమల హాసన్, సరిత (తొలి పరిచయం), మాధవి,
జయవిజయ, కాకినాడ శ్యామల, జె.వి.రమణమూర్తి, కృష్ణచైతన్య, పి.ఎల్.నారాయణ, మిశ్రో. పాటలు : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : పి.సుశీల, జానకి, వాణీజయరామ్
ఎల్.ఆర్.ఈశ్వరి, రమోలా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మాటలు : గణేశ్ పాత్రో సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
నిర్మాత: రామ అరంగణ్ణల్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాలచందర్, విడుదల (1978)
సమర్పణ: ఆండాళ్ ప్రొడక్షన్స్.
విశేషాలు
మరో చరిత్ర 1981లో హిందీలో ఏక్ దూజేకే లియే పేరుతో వచ్చింది.
ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే.
సరిత అసలు పేరు అభిలాష. బాలచందరే సరితగా మార్చారు.
పాటలు
ఏ తీగ పువ్వునొ, ఏ కొమ్మ తేటినో (సంతోషం)
బలే బలే మగాడివివోయ్
బంగారు నా సామివోయ్
కలిసి ఉంటే కలదు సుఖము...
కలసి వచ్చిన అదృష్టము
పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే...
ఏ తీగ పువ్వునో... ఏ కొమ్మ తేటినో (విషాదం)
విధి చేయు వింతలన్నీ...