మరో 100 కోట్లతో ఫినిషింగ్‌ టచ్‌లు... | Special story torajani robo 2.0 | Sakshi
Sakshi News home page

మరో 100 కోట్లతో ఫినిషింగ్‌ టచ్‌లు...

Published Tue, Jun 19 2018 12:06 AM | Last Updated on Tue, Jun 19 2018 10:47 AM

Special story torajani robo 2.0 - Sakshi

ఇనుములో బంగారం మొలిచెనే!రోబో తర్వాత వస్తున్న సీక్వెల్‌ 2.0.అద్భుతంగా ఉండటానికి శంకర్‌ చేస్తున్నప్రయత్నం మేలిమి బంగారం.ఎప్పుడో దీపావళికి రావాల్సింది.ఉయ్‌ ఆర్‌ ఆల్‌ వెయిటింగ్‌ ఫర్‌ ద బ్లాస్ట్‌. పండగ ఎప్పుడు వస్తుందా అని  లుగులు ఎప్పుడు చిమ్ముతుందా అనిశంకరాభిమానులంతా ఎదురు  చూస్తున్నారు.


కొందరు డైరెక్టర్లతో చిక్కే.ఉదాహరణకు శంకర్‌ ‘విజువల్‌ ఎఫెక్ట్స్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌లా కనిపించకూడదు. అవి కథలో భాగం అయిపోవాలి. ప్రేక్షకుడు కథను ఎంజాయ్‌ చేయాలి’ అంటారు.చిన్నమాటే.కాని దాని బరువు వందల మంది విజువల్‌ ఎఫెక్ట్స్‌ టెక్నీషియన్స్‌ మీద పడుతుంది.శంకర్‌ తాజా చిత్రం ‘2.ఓ’ లో ఒక అడవి సన్నివేశం ఉంది. అడవినంతా తెర మీద సృష్టించాలి. అడవి కనిపించిన వెంటనే ప్రేక్షకుడు ‘ఆహా... విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎంత బాగున్నాయి’ అని అనుకుంటే సినిమా ఓడిపోయినట్టు. ఆ అడవిలో మమేకమైపోయి ఇప్పుడేం జరుగుతుందా అని ఉత్సుకతతో ఉంటే సినిమా గెలిచినట్టు. అడవిలోని ఆకునూ తీగనూ లతనూ మట్టినీ మానునూ పువ్వునూ చాలా సహజంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదు అన్నంత బాగా సృష్టించాల్సిన భారం టీమ్‌ మీద ఉంటుంది.‘2.ఓ’ ఆలస్యానికి బహుశా కారణం ఇదే అయి ఉండవచ్చు. పర్‌ఫెక్షనిజమే దాని విడుదలకు అడ్డంకి అవుతుండవచ్చు. ఆలస్యం అమృతం అమృతం అంటారు శంకర్‌.ఆ అమృతం మరింత మధురంగా మారడానికి మరో వంద కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని కథనం. మరో వందకోట్లు.ఆల్రెడీ ఈ సినిమా బడ్జెట్‌ 400 కోట్లు అంటున్నారు. ఈ వంద కోట్లతో కలిపి 500 కోట్లు కావచ్చు. భారతదేశంలో ఇంత ఖరీదైన బడ్జెట్‌తో తయారయ్యే చిత్రం ఇదే. ‘బాహుబలి’ రికార్డును ఇది చెరిపేయవచ్చు. కాని ప్రేక్షకుడు కోరుకునేది అదే కదా. ఒక రికార్డు చెరిపే స్థాయిలో మరో రికార్డు సిద్ధం అవుతుండాలి. ఒక గొప్ప సినిమా వచ్చాక మరింత గొప్ప సినిమా సిద్ధమవుతూ ఉండాలి. ‘2.ఓ’ మరింత గొప్ప సినిమా కాబోతున్నదనే సూచనలు కనిపిస్తున్నాయి.

సెట్‌లో కళ్లద్దాలతో...
సెట్‌లో డైరెక్టర్‌ కళ్లద్దాలతో ఉండటం మామూలే– సైట్‌ ఉంటే. శంకర్‌కు సైట్‌ లేదు. కాని ఆయన ‘2.ఓ’ సెట్‌లో ఎప్పుడూ చాలా శక్తివంతమైన కళ్లద్దాలను పెట్టుకుని ఉంటాడు. అవేమిటో తెలుసా? త్రీడీ కళ్లద్దాలు. హాలీవుడ్‌ వాళ్లను మించిపోవాలనుకున్నారు శంకర్‌. హాలీవుడ్‌లో సినిమాలు 2డిలో తీసి త్రీడిలో కన్వర్ట్‌ చేస్తుంటారు. కాని ‘2.ఓ’ను డైరెక్ట్‌గా త్రీడీలో చిత్రీకరిస్తున్నారు. షాట్‌ అయ్యాక మానిటర్‌ మీద ఆ షాట్‌ ఎలా వచ్చిందో చూడాలంటే త్రీడీ కళ్లద్దాలు ఉండాలి. శంకర్‌ ఆ కళ్లద్దాలు పెట్టుకుని షాట్‌ను గమనించుకుని అది ఓకే అయ్యిందనుకున్నాకే నెక్ట్స్‌ షాట్‌కు వెళతారు. లేదంటే రీషాటే. ఇంత టెక్నికల్‌ వ్యవహారం నిమగ్నమై ఉన్నందువల్లే ఇప్పటికే మనకు కనుల విందు చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యమవుతున్నదో ఏమో.

స్క్రిప్ట్‌కు తాళం
‘రోబో’ హిట్‌ అయ్యాక దానికి సీక్వెల్‌ తీయాలని 2012లోనే అనుకున్నారు శంకర్‌. దానికి అవసరమైన కథను రూపకల్పన చేయడానికి తమిళంలో సాహిత్యకారునిగా పేరు గడించిన జయమోహన్‌ను ఎంచుకున్నారు. ‘రోబో’కు పని చేసిన డైలాగ్‌ రైటర్‌ మదన్‌ కార్కె (గీత రచయిత వైరముత్తు కుమారుడు) ఇందులోని టెక్నికల్‌ డైలాగ్స్‌ విషయంలో జయమోహన్‌కు సాయం పట్టాడు. ‘నా ఇమేజినేషన్‌కు తగినట్టుగా కథ హ్యూజ్‌గా వైల్డ్‌గా ఎదిగిపోయింది’ అంటారు శంకర్‌. భారీ సినిమాలకు మహా భారీ ప్రొడ్యూసర్‌ అయితేనే కరెక్ట్‌. శ్రీలంక మూలాలు కలిగిన తమిళ పారిశ్రామిక వేత్త, ‘లైకా’ మొబైల్స్‌ ద్వారా 21 దేశాలలో ఐదు వేల కోట్ల వ్యాపార లావాదేవీలకు ఎదిగిన అల్లిరాజా సుబస్కరన్‌ దీనికి నిర్మాతగా ముందుకు వచ్చాడు. ఈయన లైకా ప్రొడక్షన్స్‌ ఇంతకు ముందు విజయ్‌తో ‘కత్తి’ (తెలుగులో ఖైదీ నం.150) వంటి సూపర్‌ హిట్‌ను సాధించి ఉంది. హీరోగా రజనీకాంత్‌ ముందే సిద్ధం. కాని విలన్‌గా చాలా పేర్లే వినిపించాయి. ఆర్నాల్డ్‌ ష్వాస్‌నెగర్‌ను, ఆమిర్‌ ఖాన్‌ను, విక్రమ్‌ను వీరందరినీ దాటి ఆ అద్భుతమైన అవకాశం అక్షయ్‌ కుమార్‌కు చేరింది. 

హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను తీసుకున్నారు. అంతా సిద్ధం అయ్యాక స్క్రిప్ట్‌ను ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకుని లాక్‌ చేశారు శంకర్‌. ఆయనలోని సుగుణమో దుర్గుణమో ఒకసారి స్క్రిప్ట్‌కు లాక్‌ చేశాక ఏది రాసుకున్నారో అదే తీయాలి... ఏమైనా ఎంత ఖర్చయినా. ‘ఐ’ సినిమాలో ‘పూలనే కునుకేయమంటా’ పాటను చైనాలో పూలు వికసించే కాలంలో తీయాలని శంకర్‌ నిర్ణయించుకుని అందుకోసం ఆరు నెలలు వేచి ఉండి వెళ్లి తీశారు. స్డూడియోలో తీసి ఉంటే ఒక వంతు ఖర్చయ్యే పాటకు చైనాలో తీయడం వల్ల పది వంతులు ఖర్చయ్యింది. ఇలాంటి తాళ రాక్షసుడు కనుకనే అలాంటి ఎన్నో సీన్లు ‘2.ఓ’ లో రాసుకున్నాడు కనుకనే వాటన్నింటినీ అనుకున్నట్టుగా తీయడంలో సినిమా విడుదలకు ఆలస్యమవుతున్నదేమో.

మరో వంద కోట్లు
సినిమా 2017 దీపావళికి వస్తుందని ఆశించారు. జనవరి 1, 2018కి వస్తుందని ఆశించారు. వేసవి సెలవుల్లో గ్యారంటీ అని కూడా అన్నారు. ఆడియో లాంచ్‌ అయ్యింది. ట్రైలర్‌ బయటకు వదలకపోయినా ‘కట్‌’ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయినా విడుదల గురించి హీరో గాని దర్శకుడు కాని ఏమీ మాట్లాడటం లేదు. ఈలోపు రజనీ కాంత్‌ ‘కబాలి’, ‘కాలా’ తీసుకున్నారు. దర్శకుడు కార్తి సుబ్బరాజ్‌తో మరో సినిమా కూడా చేస్తున్నారు.  వీటి ముందు మొదలైన ‘2.ఓ’ మాత్రం విడుదల కాలేదు. ఈ నేపధ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కోసం మరో వంద కోట్లు విడుదల చేస్తున్నారని వార్త. అయితే ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయడానికే అయి ఉంటుందని ట్రేడ్‌ పండితుల పరిశీలన. ‘2.ఓ’ ను ప్రపంచ వ్యాప్తంగా 13 భాషలలో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ అన్ని భాషలకు డబ్బింగ్‌ పనులు జరగాలి. భారీ క్లయిమాక్స్‌కు తగినట్టుగా ఎఫెక్ట్స్‌ కోసం మరిన్ని నిధులు అవసరమయ్యాయేమో తెలియదు. ఈ విషయం అటుంచితే ఈ సినిమా కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో థియేటర్లు త్రీడీకి అనువుగా అప్‌డేట్‌ అవ్వాల్సి ఉంది. ఇవన్నీ ముగిశాకే సినిమాను పకడ్బందీగా విడుదల చేయాలని వేచి ఉన్నారో ఏమో తెలియదు.

షోలే అవుతుందా?
భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘షోలే’ను 1973లో మొదలెట్టి మూడేళ్ల పాటు తీశారు. దీని చిత్రీకరణ సమయంలోనే ఒక్కో హీరో రెండు మూడు సినిమాలు చేశారు. అందరూ ఆ సమయంలో ఇంత ఆలస్యమా అన్నవారే. కాని ఒక మంచి సినిమా అన్ని విధాలా పూర్తవ్వడానికి అంత సమయం తీసుకుంటుంది మరి. ‘2.ఓ’ విషయంలో కూడా ఇదే పునరావృతం అవుతున్నట్టుంది.  శంకర్‌ అభిమానులు, రజనీ అభిమానులు, కమర్షియల్‌ సినిమా అభిమానులు ‘2.ఓ’  కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాసులతో కలెక్షన్లతో ఆ వత్తులను వెలిగించాలనుకుంటున్నారు.
భూనభోనాంతరాలు దిమ్మెరపోయే వెలుగు ‘2.ఓ’ విడుదలతో సాక్షాత్కరిస్తుందని ఆశిద్దాం.

భారీ చిత్రీకరణ
‘2.ఓ’ చిత్రీకరణ సరిగ్గా 2015 డిసెంబర్‌లో మొదలైంది. అయితే ఇది స్టూడియోల్లో తీసే సినిమా కాదు. భారీ మైదానాలు కావాలి. అందుకే చెన్నై పూనమలై రోడ్‌లోని 160 ఎకరాల ఇ.వి.పి. థీమ్‌ పార్క్‌ను లీజుకు తీసుకుని దానినే ప్రధాన స్టూడియోగా మలుచుకున్నారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో కూడా 45 రోజులు షూట్‌ చేశారు. వంద రోజులు షూట్‌ చేస్తే సాధారణంగా ఒక సినిమా పూర్తయిపోతుంది. కాని వంద రోజుల చిత్రీకరణ తర్వాత సినిమా సగమైనట్టుగా శంకర్‌ ప్రకటించారు. నూట యాభై రోజుల చిత్రీకరణ తర్వాత మూడు వంతుల సినిమా పూర్తయినట్టు చెప్పారు. 2017 అక్టోబర్‌కు చిత్రీకరణ అధికారికంగా ముగిసింది. కాని అసలు కథ అప్పుడే మొదలైంది.

పోస్ట్‌ ప్రొడక్షన్‌
కొన్ని చోట్ల సగం సెట్లు వేసి మిగిలిన భాగాలను స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా పూర్తి చేశారు. కొన్నిసార్లు అసలు ఏ సెట్‌ లేకుండా తీసి తెర మీదే సెట్‌ను పూర్తిగా సృష్టించారు. ఉదాహరణకు ఇందులో ఒక పాటను అమి జాక్సన్, రజనీల మీద ఉక్రయిన్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌ నీరవ్‌ షా అక్కడకు వెళ్లి లొకేషన్లను చూసుకుని వచ్చారు కూడా. కాని రజనీకాంత్‌ అనారోగ్యం వల్ల ఆ పని జరగలేదు. కాని శంకర్‌ ఉక్రయిన్‌ అని ఫిక్స్‌ అయ్యారు కదా. పాట మొత్తం ఉక్రయిన్‌లో తీసినట్టుగానే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా ఆ ల్యాండ్‌ స్కేప్స్‌ను సృష్టించారు. దీనికంతా సమయం పడుతుంది. ఈ సమయం వల్లే సినిమా ఆలస్యం అవుతున్నట్టుంది.  
– వెస్లీ గోపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement