మలయాళీ చిత్రం‘జూన్’లో రిజీషా విజయన్(ప్రతీకాత్మక చిత్రం)
‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం!విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాలేకున్నా, తన ఆఫీస్‌కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇలాంటివి చాలానే ఉన్నాయ్ రోజూ వినే పాటల్లో, ప్రావెర్బుల్లో.ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉందిఆయన ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అనడం.-మాధవ్ శింగరాజు
ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లో పదవీ విరమణ పొందిన భారత రాష్ట్రపతులు నివాసం ఉండే భవంతి ఒకటి ఉంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక ప్రణబ్ సామాన్లను అందులోకి మార్పించారు. పుస్తకాలే ఆయన సామాన్లు. ఉండడానికైతే ప్రణబ్ ఇప్పుడు రాజాజీ మార్గ్ నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లోని ఆయన పూర్వీకుల స్వగ్రామం మిరాటీలో స్థానికులకు కనిపిస్తుంటారు. ఢిల్లీలో ఉన్నా, మిరాటీలో ఉన్నా ఆయన చేతిని వదలని మనుషులు.. పుస్తకాలే! అసలు ఢిల్లీ, మిరాటీ కాదు.. పుస్తకాలు ఎక్కడుంటే అక్కడే ఆయన నివాసం. ప్రణబ్ చుట్టూ తిరిగే రాజకీయాలు కూడా ప్రస్తుతం దేశంలో ఏమీ లేవు కనుక ఎక్కడైనా ఆయన మాట వినిపిస్తే, వెంటనే ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారోనన్న సందేహం రావడానికి కారణం ఇదే.ఇప్పుడేం జరిగిందంటే.. ‘‘పురుషుడి చదువు పురుషుడికి మాత్రమే పరిమితం అవుతుంది. స్త్రీ చదువు కుటుంబం మొత్తానికీ చదువౌతుంది’’ అని ప్రణబ్ అకస్మాత్తుగా దేశ ప్రజలకు వాక్ దర్శనం ఇచ్చారు! ఢిల్లీలోనే ఒక కార్పొరేట్ కంపెనీ ‘బేటీ పఢావో అభియాన్’ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందులో గెస్ట్‌గా మాట్లాడుతూ ప్రణబ్ అన్నమాట ఇది. అంతే తప్ప తనకు తానుగా రాజాజీ మార్గ్‌లోనో, మిరాటీలోనో ప్రెస్ మీట్ పెట్టి ఉమెన్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడలేదు. అలా మాట్లాడి ఉంటే ఆయన మాటల్ని సీరియస్‌గానే తీసుకోవలసి వచ్చేది. సందర్భానుసారం మాట్లాడ్డానికి, మాట్లాడవలసిన అవసరాన్నే ఒక సందర్భం చేయడానికీ తేడా ఉంటుంది కదా.
ప్రణబ్ చెప్పిన హితవు కూడా కొత్తదేం కాదు. ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యు ఎడ్యుకేట్ ఏన్ ఇండివిడ్యువల్. బట్ ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్, యు ఎడ్యుకేట్ ఎ ఫ్యామిలీ’ అని చెప్పారు ఆయన. ఎప్పుడూ వింటుండే మాటే. ఎవరో ఒకరు అంటుండే మాటే. మగ పిల్లవాడిని చదివిస్తే అది వాడికి మాత్రమే మేలవుతుంది. ఆడపిల్లను చదివిస్తే అది దేశానికే మేలవుతుంది అనేది ఆఫ్రికన్ ప్రావెర్బ్. అక్కడి నుంచి మిగతా ప్రపంచానికి ప్రబలింది. వాళ్లు ‘దేశానికి మేలు’ అంటే.. మనం ‘ఇంటికి మేలు’ అని మార్చుకున్నాం. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి మేలు ఎలా అవుతుందంటే ఆమె ఇంట్లోనే కూర్చుని పిల్లల చేత అక్షరాలు దిద్దిస్తూ, బుద్ధులు నేర్పిస్తూ ఉంటుందని! తను చదువుకుంటున్నప్పుడు తోబుట్టువుల్ని చదివించడం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక వాళ్లను చదివించడం, పిల్లల పెళ్లిళ్లు కూడా అయి మనవలు పుట్టాక వాళ్లను చదవించడం.. అలా ఆ విద్యాజ్యోతి తరాలను వెలిగించుకుంటూ పోతుంది. ఆమె ఉద్యోగం చేస్తున్నా కూడా రిటైర్ అయ్యేవరకు ఆమె వెలిగించడం కోసం రోజూ కొన్నిదీపాలు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాయి. ‘మమ్మీ ప్రాజెక్ట్‌వర్క్’. ‘అమ్మమ్మా హోమ్‌వర్క్’! చెయ్యడానికి, చేయించడానికి సంతోషమే.
కానీ ఓపిక. అదెక్కడి నుంచి వస్తుంది? ‘ఓపిక దేముందీ.. ఫ్యామిలీ కంటే ఎక్కువా’ అని తను అనుకున్నా.. తనకు శక్తిని, జీవితేచ్ఛను ఇచ్చే సంతోషాల కోసం, సమాజం కోసం చేసుకోవాలనుకున్నవి! వాటికి టైమ్ ఎక్కడ? ఇంట్లో ఇంకో జ్ఞానదీపం ఉంటుంది కదా.. మగ జ్ఞానదీపం. అదెప్పుడూ తనకు తను ఇంట్లో, బయటా వెలుగుతూ ఉంటుంది తప్ప ఇంకొకర్ని వెలిగించేందుకు ఉత్సాహం చూపదెందుకు? సొంత పిల్లదీపాలను కూడా పట్టించుకోదెందుకు? డాడీ ఈ సమ్ అర్థంకావడం లేదు. ‘మమ్మీని అడుగు’. డాడీ.. స్కూల్ టైమ్ అవుతోంది. షూజ్‌కి పాలిష్ చెయ్యవా ప్లీజ్. ‘నీ షూజ్ నువ్వే క్లీన్ చేసుకోవాలని మమ్మీ చెప్పలేదా నీకు?’. విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాగోలేకున్నా, తన ఆఫీస్‌కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇంకా ఇలాంటివే చాలానే ఉన్నాయ్ రోజూ వినే మాటల్లో, పాటల్లో.. స్త్రీని నెత్తి మీద పెట్టుకొని ఎటూ కదలనివ్వకుండా పట్టుకునేవి. ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉంది ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అని ఆయన అనడం. ఆడపిల్లల్ని చదివించాలి అని మాత్రమే చెప్పి, రిలేటెడ్‌గా వేరే ఏమైనా మాట్లాడాల్సింది. ‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం.
ప్రణబ్ ముఖర్జీ కన్నా నలభై ఏళ్లు ముందు పుట్టిన తెలుగు రచయిత, సంస్కర్త గుడిపాటి వెంకటాచలం. స్త్రీ అభ్యున్నతి కోసం ఆయన రాసినంతగా ఎవరూ రాయలేదు. అయినప్పటికీ ఎక్కడా విద్యతోనే స్త్రీ అభ్యున్నతి అని ఆయన అనలేదు. ‘అసలు జన్మ వల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు గొప్పవారు పల్లెటూళ్లలో. కానీ చదివి గొప్పవారైన స్త్రీలు ఈ దేశంలో లేనట్లున్నారు. మళ్లీ చదువుల వల్ల చక్కని పాలిష్ వొచ్చిన పురుషులున్నారు’ అని రాశారు ఒకచోట. ఎందుకలా మగవాళ్లు మాత్రమే పాలిష్ అవుతారూ అంటే ఎంత చదువుకున్న స్త్రీ అయినా ఇంటిని పాలిష్ చేస్తుండటమే ఆ చదువుకు సార్థకత అన్నట్లుగా వాళ్ల మైండ్‌ని వీళ్లు ఎప్పటికప్పుడు పాలిష్ చేస్తుంటారు కనుక.
ప్రణబ్ బాగా చదువుకున్న మనిషి. 83 ఏళ్ల వయసులో ఇప్పటికీ చదువుతున్న మనిషి. రిటైర్ అయ్యి రాజాజీ మార్గ్‌లో ఉంటున్నా, ఆ రిటైర్‌మెంట్ నుంచి మరికాస్త రిటైర్ అవడం కోసం మిరాటీలో ఉంటున్నా, అప్పుడప్పుడూ సభలు సమావేశాలకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లొస్తున్నా.. కాస్త తీరిక చేసుకుని చిన్నపుస్తకమేదైనా రాస్తే బాగుంటుంది.. దీపమనీ, అపురూపమనీ స్త్రీని మభ్యపెట్టింది చాలు, ఆమె కోసం కూడా కాస్త ఆమెను వెలగనివ్వండి అని చెబుతూ! దీపం వెలుగులో ఎదగాలనుకోవడంలో తప్పులేదు. మనం ఎదగడం కోసమే దీపం వెలుగుతూ ఉండాలని అనుకోవడం అన్యాయం.
Comments
Please login to add a commentAdd a comment