ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా తెలియ చెప్పిన ఆధ్యాత్మిక వేత్త.ఓసారి ఓ ధనవంతుడొకరు ఆయనను చూడ్డానికి వచ్చాడు. వస్తూనే గురువుకు దణ్ణం పెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు అందించాడు. గురువు ఆ సంచిని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.‘‘ఏమిటిది’’ అని అడిగారు.‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది‘‘ అని అన్నాడు ధనవంతుడు.‘‘ఇందులో ఏముంది?’’ అన్నారు గురువు.‘‘వెయ్యి బంగారు నాణాలు’’ అన్నాడు ధనవంతుడు దర్పంగా. ‘‘సంతోషం’’ అంటూనే ధనవంతుడి వంక చూసి ‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ..’’ అని అడిగారు గురువు.‘అవునండీ.. ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు.
‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపటి తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నాను’’ అన్నాడు ధనవంతుడు.గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బు సంచిని తిరిగి ఆ ధనవంతుడికే ఇచ్చేశారు.ఇచ్చి, ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... మీ దగ్గరే ఉంచుకోండి’’ అన్నారు.ధనవంతుడు ముందు తెల్లబోయాడు. తర్వాత తనకు ఏదో అర్థమైందన్నట్టుగా తలపంకించి, గురువుకు దణ్ణం పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్లకు ఎవరిౖకైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. ఉన్నదానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేసినప్పుడు సంతృప్తిగా ఉంటుంది.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment