
చిత్రమైన చావులు
విడ్డూరం
మరణమనేది ఎప్పటికైనా సంభవించక తప్పదని అందరికీ తెలుసు. అది ఎప్పుడు ఎలా వస్తుందో కనిపెట్టలేమనీ తెలుసు. అయితే చరిత్రలో కొందరిని మరణం మరీ విచిత్రమైన పద్ధతిలో వెతుక్కుంటూ వచ్చింది. వాటి గురించి వింటే అయ్యో పాపం అనిపించక మానదు.
క్రీ.పూ. 206లో క్రిసిపస్ అనే గ్రీకు ఫిలాసఫర్ నవ్వి నవ్వి నరాలు తెగిపోయి చనిపోయాడు. అతడంత నవ్వడానికి పెద్ద కారణం కూడా ఏమీ లేదు. తను తిందామని పెట్టిన అంజూరపు పళ్లను గాడిద తినడం చూశాడు. దీనికి అంజూరపు పళ్లు కావలసి వచ్చాయా అని పడీ పడీ నవ్వాడు. ఇక అంతే సంగతులు!
1771 - స్వీడన్ రాజు అడాల్ఫ్ ఫ్రెడరిక్ మరణించాడు. అయితే ఎలానో తెలుసా? పాలల్లో తనకిష్టమైన పద్నాలుగు రకాల పదార్థాలను కలుపుకుని తిన్నాడు. ఆపైన అజీర్తితో ప్రాణాలు కోల్పోయాడు!
1871 - క్లెమెంట్ అనే అమెరికన్ లాయర్ ఓ హత్య కేసు వాదిస్తున్నాడు. తన క్లయింటు చేతిలో తుపాకీ అనుకోని విధంగా ఎలా పేలిందో వివరిస్తూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కాడు. తూటా గుండెల్లోకి దూసుకెళ్లి మరణించాడు.
1958 - గ్యారెత్ జోన్స్ అనే బ్రిటిష్ నటుడు నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సన్నివేశంలో గుండెనొప్పితో కుప్పకూలిపోయినట్టు నటించాలి. అలా నటిస్తుండగా నిజంగానే గుండెనొప్పి వచ్చింది!
1974 - ఇంగ్లండుకు చెందిన బసిల్ బ్రౌన్ కాలేయం దెబ్బ తిని చనిపోయాడు. అతడి లివర్ చెడిపోయింది మద్యం వల్ల అనుకునేరు. పది రోజుల్లో పది గ్యాలన్ల క్యారెట్ జ్యూస్ తాగేయడంతో ‘ఎ’ విటమిన్ ఎక్కువై కాలేయం దెబ్బతింది!
1993 - కెనడాకు చెందిన గ్యారీ హోయ్ అనే న్యాయవాదికి తన ఇంటి కిటికీ అద్దం గురించి వాదన వచ్చింది. అది పగులుతుందని వాళ్లు, పగలదని ఈయన వాదులాడుకున్నారు. తన మాటను నిరూపించుకోవడానికి హోయ్ కిటికీలోంచి దూకాడు. తర్వాత ఏమైందో వేరే చెప్పాలా!