
మధుమేహులకు ఓ శుభవార్త. రక్తంలో చక్కెర మోతాదును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇకపై మీరు గ్లూకోమీటర్‌ను ప్రత్యేకంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లోని స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న తొడుగునే గ్లూకోమీటర్‌గా మార్చేశారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అంతేకాదు. ఈ స్మార్ట్‌ఫోన్ కేస్ ద్వారా లెక్కించే చక్కెర మోతాదును స్మార్ట్ అప్లికేషన్ ద్వారా ఫోన్‌లోనే చూసేసుకోవచ్చు. అంతేకాకుండా ఏళ్ల రికార్డులను నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉండటం వల్ల జబ్బును మరింత మెరుగ్గా నియంత్రించుకునేందుకు అవకాశముంటుంది.
ఇంతకీ ఈ సరికొత్త, వినూత్న పరికరాన్ని ఏమంటున్నారో తెలుసా? జీపీ ఫోన్ అంటున్నారు. దీంట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. త్రీడీ ప్రింటర్ సాయంతో ముద్రించిన తొడుగు, ఒకమూలన ఉండే సెన్సర్ ఒక భాగం. ఇక రెండోభాగంలో అయస్కాంత శక్తితో సెన్సర్‌కు అతుక్కోగల చిన్న చిన్న గుళికలు. ఈ గుళికలన్నీ కొన్ని ఫోన్లకు అనుబంధంగా వచ్చే పెన్నులాంటి పరికరం మాదిరిగా ఉంటాయి. ఒక గుళికను సెన్సర్‌పై వేసి.. దానిపై చుక్క రక్తం వేస్తే చాలు.
అందులోని గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ సాయంతో చక్కెర శాతం విశ్లేషణ జరిగిపోతుంది. సమాచారం వైర్‌లెస్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌కు చేరిపోతుంది. కేవలం 20 సెకన్లలో టెస్ట్ పూర్తవుతుందని, ఒక్కో స్టైలస్‌లో 30 వరకూ గుళికలు ఉంటాయని ఈ పరికరాన్ని తయారుచేసిన వారిలో ఒకరైన ప్యాట్రిక్ మెర్సియర్ తెలిపారు. ప్రస్తుతానికి తాము నమూనా మాత్రమే తయారు చేశామని, మరిన్ని పరీక్షలు నిర్వహించడం ద్వారా మెరుగైన స్మార్ట్‌ఫోన్ గ్లూకోమీటర్‌ను తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నామని ఆయన చెప్పారు.
ఈ పరికరంతో కరెంటు ఖర్చు బాగా తగ్గుతుంది!
అపార్ట్‌మెంట్లలో.. వీధి చివర్లలో.. విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఉండే ట్రాన్స్‌ఫార్మర్లను మీరు చూసే ఉంటారు... వోల్టేజీని నియంత్రించేందుకు పనికొచ్చే ఈ పరికరాల ద్వారా కరెంటు కొంత వృథా అవుతూంటుంది. ఇంకో మార్గం లేదు కాబట్టి వీటిని ఇంకా వాడుతున్నాం. అయితే ఇకపై ఈ పరిస్థితి మారనుంది. ట్రాన్స్‌ఫార్మర్లతోపాటు అన్ని రకాల పవర్ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా జరిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి చేర్చేందుకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి.
రెట్టింపు సామర్థ్యంతో పనిచేయగల గాలియం నైట్రైడ్ పవర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పరికరాలు కేవలం 600 వోల్టుల సామర్థ్యం కలిగి ఉండగా.. కొత్తవి 1200 వోల్టులను తట్టుకోగలవని... భవిష్యత్తులో మూడు నుంచి అయిదు వేల వోల్టులను కూడా అతి తక్కువ వృథాతో మార్చగలిగే (వోల్టేజీని తగ్గించడం, ఏసీని డీసీగా మార్చడం వంటివి) పరికరాలను తయారు చేస్తామని ఎంఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1200 వోల్టుల పరికరాలు అందుబాటులోకి వస్తే.. విద్యుత్తుతో నడిచే వాహనాల్లో కరెంటు వాడకం బాగా తగ్గుతుందని.. తద్వారా ఎక్కువ మైలేజీ పొందవచ్చునని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. గాలియం నైట్రైడ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సామర్థ్యం పెరిగితే ప్రస్తుతం డేటా సెంటర్లలో, పవర్ గ్రిడ్‌ల ద్వారా కూడా ఎంతో విద్యుత్తును ఆదా చేయవచ్చునని... ఫలితంగా కొత్తగా విద్యుత్తు తయారు చేయాల్సిన అవసరం తగ్గుతుందని ఆయన అంటున్నారు.
మానవ వలసపై కొత్త అవగాహన!
ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుట్టిన మనిషి ఆ తరువాత అన్ని ఖండాలకూ విస్తరించాడని మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. దాదాపు 60 వేల ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రస్థానం దశలవారీగా అన్ని ఖండాలకూ చేరిందన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే హవాయి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనలు ఈ అంచనాను తారుమారు చేస్తున్నాయి. ఆసియా ఖండంలోకి సుమారు 1.2 లక్షల ఏళ్ల క్రితమే ఆధునిక మానవుడి ప్రస్థానం మొదలైందని వీరు అంటున్నారు.
పదేళ్లుగా డీఎన్‌ఏ విశ్లేషణ ఆధారంగా చేసిన పరిశోధనలన్నింటినీ పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వలస కూడా ఒకేసారి పెద్దఎత్తున కాకుండా.. చిన్న చిన్న గుంపులుగా దశలవారీగా సాగిందని... చివరకు ఆస్ట్రేలియాకు చేరడం కూడా లక్షా ఇరవై వేల ఏళ్ల క్రితమే జరిగినట్లు మైకెల్ పెట్రాగ్లియా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ కొత్త పరిశోధనల నేపథ్యంలో మానవుల వలసలు మరింత సంక్లిష్టమైనవిగా అర్థం చేసుకోవచ్చునని, ఆసియా ప్రాంతంలో గతానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం గురించి తెలియజేస్తుందని ఆయన అన్నారు.