హార్ట్‌ఫుల్ సూచనలు... | suggestions to keep heart healthy | Sakshi
Sakshi News home page

హార్ట్‌ఫుల్ సూచనలు...

Published Thu, Nov 28 2013 11:44 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

suggestions to keep heart healthy

ఎప్పుడూ పనిచేసే యంత్రానికి కాసేపు విశ్రాంతి ఇస్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఈ సూత్రం మాత్రం దేహయంత్రంలోని గుండెకు మినహాయింపు. ఎందుకంటే... గుండె ఎప్పుడూ పనిచేస్తుంటేనే మనకు బాగుంటుంది. అది పనిమానేస్తానంటూ మొరాయించే పరిస్థితిని మనం రప్పించకూడదు. దానికి చేయాల్సినవి చాలా సులభం. గుండెను ఇంగ్లిష్‌లో హార్ట్ అంటారని గుర్తుపెట్టుకుని, ఆ హార్ట్ స్పెల్లింగ్‌లోని కొన్ని అంశాలను పాటిస్తే చాలు... అది గుర్తుపెట్టుకోడానికి వీలుగా ఈ కథనం...
 
 H
హెచ్ ఫర్ హెల్దీ డైట్ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టిన ఆకుకూరలు, పండ్లలో సగానికి సగం పోషకాలు నశిస్తాయి. ఇక కొవ్వుల్ని కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలైన వెల్లుల్లినీ, రక్తనాళాలను శుభ్రపరిచే ద్రాక్ష వంటి పండ్లను, ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ లభ్యమయ్యే చేపలను మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.


 హెచ్ ఫర్ హ్యాపీనెస్:  ఎప్పుడూ సంతోషంగా ఉండండి. తద్వారా మీలోని ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం పెంపొందుతుంది.
 
 E ఈ ఫర్ ఎక్సర్‌సైజ్ : వ్యాయామం అన్నది గుండె ఆరోగ్యానికి చాలా మంచి మార్గం. అయితే  శ్రమ కలిగించే కఠినమైన వ్యాయామాలు కాకుండా నడక / జాగింగ్ వంటి తేలికపాటి సాధారణ వ్యాయామాలు అయితే మరీ మంచిది.


 ఈ ఫర్ ఎండార్ఫిన్స్ : వ్యాయామం వల్ల మనలో సంతోషం కలిగించే రసాయనాలైన ఎండార్ఫిన్ వంటివి వృద్ధి అవుతాయి. దాంతో రెండు ప్రయోజనాలన్నమాట. ఒకటి వ్యాయామం వల్ల కొవ్వులు, రక్తపోటు, మధుమేహం వంటివి అదుపులో ఉండటంతో పాటు అదే ప్రక్రియలో ఎండార్ఫిన్ కూడా స్రవించడం వల్ల సంతోషం, మానసిక ఉల్లాసం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఇది కూడా గుండెకు మేలు చేసేదే.
 
 A
ఏ ఫర్ యాక్టివిటీ : బద్దకంగా ఒకేచోట కదలకుండా ఉండటం వల్ల స్మోకింగ్‌తో ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో అలాంటివే వస్తాయని అధ్యయనాల్లో తేలింది. మీకు ఒక విషయం తెలుసా? పదిలక్షల సార్లు స్పందించడం వల్ల గుండెకు కలిగే అలసటను ఒకసారి మనం చురుగ్గా పని చేయడం అన్న చర్య తొలగిస్తుందని కొన్ని పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. అందుకే ఆఫీసులోనూ లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం మంచిది. మనం చురుగ్గా ఉండటం గుండెపై మరింత ఒత్తిడిని కలగజేస్తుందన్నది అపోహ మాత్రమే. మనమెంత చురుగ్గా ఉంటే గుండెకు అంత మేలు. అందుకే అందరికీ వ్యాయామంతోపాటు మంచి వ్యాపకమూ (యాక్టివిటీ) ఉండాలి.
 
 R ఆర్ ఫర్ రెస్ట్ : ఇక్కడ రెస్ట్ అంటే ఆరోగ్యకరమైన విశ్రాంతి తప్ప బద్దకం కాదు.  పగలు ఎంత యాక్టివ్‌గా ఉంటామో, రాత్రి మంచి నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిద్రలేమి రక్తపోటును పెంచి, వ్యాధి నిరోధకతను తగ్గిస్తుంది.


 ఆర్ ఫర్ రిఫ్రెషింగ్ మూడ్ : వారమంతా మీరు  కష్టపడి చురుగ్గా పనిచేయడం గుండెకు ఎంత లాభమో, వారాంతపు విశ్రాంతి కూడా దానికి అంతే ప్రయోజనం. అయితే అతివిశ్రాంతి మళ్లీ గుండెకు అనర్థమన్నది గుర్తుపెట్టుకోండి.


 ఫర్ రొటీన్ హార్ట్ చెకప్ : మీకు 40 దాటితే ఏడాదికోసారి రొటీన్‌గా గుండె పరీక్షలను డాక్టర్ సలహా మేరకు చేయించుకోవడం మంచిది.
 
 T టీ ఫర్ టొమాటో: అని కూడా గుర్తుంచుకోవచ్చు. మీ ఆహారంలో టొమాటోను ఎంత గా వాడితే గుండెకు అంత మేలు అన్నమాట. టొమాటోకు ఎర్రటి రంగును తెచ్చిపెట్టే పదార్థం ‘లైకోపిన్’ అనే పోషకం. మనం లైకోపిన్‌ను ఎంతగా లైక్ చేస్తుంటే అది గుండె ఆరోగ్యాన్ని అంతగా ‘లైక్’ చేస్తుందని ‘పిన్’పాయింటెడ్‌గా గుర్తుపెట్టుకోండి.


 టీ ఫర్ ట్రెడ్‌మిల్: మీ గుండె ఆరోగ్యానికి ట్రెడ్‌మిల్‌పై నడక కూడా ఒక సాధనం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ట్రెడ్‌మిల్‌కు ప్రాధాన్యం లేదు. కేవలం నడకకే. టీ ఫర్ ట్రెక్కింగ్ అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. అది కూడా నడక కోసమే. ఇక్కడ నడకకే ప్రాధాన్యం గాని ట్రెడ్‌మిల్ సాధనానికీ/ట్రెక్కింగ్ ప్రక్రియకూ కాదన్నమాట.


 -నిర్వహణ: యాసీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement