సుకుమార్ సినిమా అంటేనే ఓ రెస్పెక్ట్ ఉంటుంది... - ఎన్టీఆర్
‘‘సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ నా ఫ్యామిలీ లాంటి వారు. సుకుమార్ కథ అందించిన ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుందన్న ఉత్సాహంతో వచ్చాను’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సుకుమార్ తొలిసారిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తూ, కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. రాజ్ తరుణ్, హేభా పటేల్ జంటగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విడుదల చేశారు ‘‘సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు దర్శకుడు ఇలా తీశాడేంటి అని అనుకుంటాం. కానీ, సుకుమార్ తీసిన ఫ్లాప్ సినిమాకు కూడా ఓ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేశారు. మనమే అర్థం చేసుకోలేకపోయామని అనిపిస్తూ ఉంటుంది.
అందుకే ఆయన సినిమా అంటే అందరికీ ఓ రెస్పెక్ట్ ఉంటుంది’’ అని ఎన్టీఆర్ అన్నారు. ‘‘ఈ స్టోరీ నన్ను ఆరేళ్లుగా వెంటాడుతోంది. చివరికి ఎన్టీఆర్ కోసం కథ తయారు చేస్తున్న సమయంలో, చిన్న గ్యాప్ దొరికితే ఈ కథ తయారు చేశాం. రాజ్ తరుణ్, హీభా ఇద్దరూ బాగా చేశారు, ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్‌కి అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరుగుతుంది’’ అని సుకుమార్ చెప్పారు. సుకుమార్ కోసమే తానూ. రత్నవేలు ఈ సినిమా చేస్తున్నామని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, చిత్రనాయకా నాయికలు రాజ్ తరుణ్, హేబా ఫటేల్, దర్శక-నిర్మాతలు సూర్యప్రతాప్, విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.