మా టీమ్ మొత్తం నాన్న పిచ్చోళ్లమే : ఎన్టీఆర్
‘‘సుకుమార్ కథ రాయడు. జీవితాన్ని రాస్తాడు. సుక్కు నాన్నగారి కొన ఊపిరి నుంచి పుట్టిన కథ ఇది’’ అని చిన్న ఎన్టీఆర్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విడుదల చేసి తండ్రి హరికృష్ణకి అందజేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ- ‘‘సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పుడు మా నాన్నగారు ‘కింద పడండి.. చావు దాకా వెళ్లండి.. మీరు మీరుగా బతకండి’ అని నేర్పించారు. సత్యమూర్తిగారు చనిపోయిన రెండో రోజు దేవీకి మెసేజ్ చే శాను.
అతను నాకు పంపించిన రిప్లైలో తన బాధతో పాటు పాటల రికార్డింగ్ స్టేటస్‌ని కూడా మెసేజ్ చేశాడు. మన వల్ల పని డిస్ట్రబ్ కాకూడదని సత్యమూర్తిగారు చెప్పిన మాటను దేవి పాటిస్తుంటాడు. ‘నాన్నకు ప్రేమతో’ ప్రపంచంలోని తండ్రులందరికీ ఇచ్చే నీరాజనం. కెమెరామ్యాన్ విజయ్‌గారైతే నేనో ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు ఏడ్చేశాడు. మా టీమ్ అంతా నాన్న పిచ్చోళ్లమే’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘నాకు పిల్లలు పుట్టాక మా అమ్మానాన్నలను ఇంకా ప్రేమించడం మొదలుపెట్టాను. నిస్వార్థంగా మనల్ని ప్రేమించేవాళ్లు అమ్మానాన్నలు మాత్రమే.
ఎందుకంటే వాళ్ల సామ్రాజ్యంలో మనమే రారాజులం. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత ఎమోషనల్‌గా ఉన్నానో అదే సినిమాలో చూపించడానికి ట్రై చేశాను. రాజేంద్రప్రసాద్‌గారి ‘లేడీస్ టైలర్’ షూటింగ్ చూసేటప్పుడే నాకు సినిమాల మీద ఆసక్తి కలిగింది’’ అన్నారు. హరికృష్ణ మాట్లాడుతూ- ‘‘జానకీరామ్, కల్యాణ్‌రామ్ పేర్లు మా నాన్నగారే పెట్టారు. జూనియర్‌కు తారక రామ్ అని నేను పెట్టా. నాన్నగారు ‘విశ్వామిత్ర’ షూటింగ్ అప్పుడు తారక రామ్‌ని తీసుకు రమన్నారు. ‘నీ పేరేంటి’ అని మనవణ్ణి ఆయన అడిగితే, ‘నాన్నగారు తారక రామ్ అని పెట్టారు’ అన్నాడు. ‘నా పేరు నీకుండాలి’ అని నందమూరి తారకరామారావు అని మా నాన్నగారు పెట్టారు’’ అని చెప్పారు.
‘‘నాన్నగారు స్థాపించిన జగపతి బ్యానర్‌పై మళ్లీ సినిమాలు తీయాలనుకుంటున్నాను’’ అని జగపతిబాబు పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మట్లాడుతూ- ‘‘30 ఇయర్స్ నుంచి మా నాన్నగారికి హార్ ్టప్రాబ్లమ్ ఉంది. మా అమ్మ ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ‘నాన్నకు ప్రేమ’తో పాటలను మా నాన్నగారికి అంకితం చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా నాన్నగారు లక్ష కిలోమీటర్లు మా తాతగారి కోసం చైతన్య రథం నడిపారు. మా నాన్నగారిలాంటి గొప్ప కొడుకు ఎక్కడా పుట్టడు’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. వీవీ వినాయక్, కొరటాల శివ, వక్కంతం వంశీ, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, చంద్రబోస్, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.