నాగమణి... మణి | sunil special interview for sakshi | Sakshi
Sakshi News home page

నాగమణి... మణి

Published Sat, Feb 27 2016 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

నాగమణి... మణి

నాగమణి... మణి

నాగమణి పుత్రరత్నం మన సునీల్!
సారీ... రత్నం కాదు... మణే!
ఆరేళ్ళ వయసులో సునీల్ తండ్రి చనిపోయారు.
అప్పటి నుంచి సునీల్‌కి అమ్మయినా, నాన్నయినా నాగమణి గారే!
సునీల్ కామెడీ సీన్ల వెనకాల... ఇంతటి అగాధం ఉంటుందని మీరూ నమ్మరేమో!
ఇవాళ సునీల్ పుట్టినరోజు...
ఈసారి సునీల్ తన ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తన గురించి, వాళ్ళమ్మ గురించి అమ్మనే ఇంటర్వ్యూ చేశాడు.
ఈ స్టార్ వెనుక అసలుసిసలు స్టార్ అమ్మ. ఆమె మనసులో మాటలే... ఈ వారం ‘స్టార్ టాక్’.

సునీల్: అమ్మా! నా పుట్టినరోజు కాబట్టి అక్కడ్నుంచి మొదలు పెడతా. నేను పుట్టినప్పుడు ఏం జరిగింది? నీ ఫీలింగేంటి?
సునీల్ అమ్మ నాగమణి: మా నాన్నగారికి అయిదుగురూ ఆడ పిల్లలే. నేను రెండోదాన్ని. ఇక, మా ఫ్యామిలీలో మొదటి మగపిల్లాడివి నువ్వే. పదిహేనేళ్ళకే 1972లో నా పెళ్లైంది. ’74లో పుట్టావు. నాన్నగారు, నేను హైద్రాబాద్‌లో ఉండే వాళ్లం. కాన్పు కోసమే పుట్టింటికి వెళ్లా. హాస్పిటల్‌లో నువ్వు పుట్టినప్పట్లో ఫోన్లే లేవు. పాలేరుతో కబురెట్టాం. మగపిల్లాడని చెప్పగానే అందరూ హ్యాపీ. నువ్వు నిద్ర పోయే వరకూ వంతుల వారీగా ఎత్తుకొని, ఆడించేవారు.

సునీల్:తాతగారు నన్ను బాగా గారం చేసేవాళ్లు. చిన్న ప్పుడు ఏదో సాకుతో స్కూల్‌కు ఎగనామం పెట్టేవాణ్ణి. వెళ్లనిరోజున నాకు కష్టం సుఖం తెలియాలని నాతో పొలం పనులు చేయించేవారు. నాకు ‘బాబోయ్... దీని కన్నా స్కూల్‌కు వెళ్లడం బెటర్’ అనిపించేది. అప్పట్లో ఫిల్మ్‌లు లైటింగ్‌లో పెట్టి  చూసుకునే, డబ్బాలుండేవి. ఒకసారి తిరుపతి వెళ్ళి, రాత్రివేళ వచ్చిన తాతయ్య ‘ఫిల్మ్‌బొమ్మలు తెచ్చా’ అన్నారు. మర్నాడు చూద్దామన్నా మారాం చేసి మరీ అప్పటికప్పుడు ఆ రాత్రే లైట్లు వేసి, చూశా. ఆ ‘బొబ్బిలి పులి’ ఫిల్మ్ స్టిల్స్ ఇప్పటికీ గుర్తు (నవ్వు).

అమ్మ నాగమణి: మా ఇంట్లో వీడిదే రాజ్యం. మా నాన్నగారు వీడికి 50 దాకా డ్రెస్‌లు కుట్టించేవారు. తన ఖద్దరు పంచె లతో కుర్తా ైపైజమాలు చేయించేవారు. మా నాన్నగారు పాలు పితకడానికెళితే, పితికినవి పితికినట్లే తాగేసేవాడు.

సునీల్: చిన్నప్పుడు నేను అంత అల్లరి చేసేవాణ్ణా?
అమ్మ నాగమణి: చాలా చేసేవాడివి. పాకెట్ రేడియో, కెమెరా కనిపిస్తే మొత్తం విప్పి, దాన్లో అయస్కాంతం తీసేవాడు. అందరూ ఇంజనీరవుతాడనేవారు. యాక్టరయ్యాడు.

సునీల్: హైద్రాబాద్‌లో నీతో పాటు నేనున్న రోజులు గుర్తేనా?
అమ్మ నాగమణి: (‘సాక్షి’ వైపు తిరిగి...) భీమవరం పక్కన పెద్దపుల్లేరులో మా నాన్నగారుండేవారు. వీడు తాత గారి దగ్గర ఉండేవాడు. వీళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా, నేను, ఆయన హైదరాబాద్‌లో. (సునీల్‌తో...) నువ్వు అమ్మమ్మ, తాతయ్యలతో వచ్చేవాడివి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు నిన్ను చూసి ‘ఏంటి మీ తమ్ముడా?’ అని నన్ను అడిగేవారు. ఒక సారి ముగ్గురం ఇక్కడ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమాకెళితే చంటిపిల్లాడైన వీడు ఒకటి, రెండుతో బట్టలన్నీ ఖరాబు చేసేశాడు (నవ్వులు...). సినిమా చూడకుండా వచ్చేశాం. చిన్నప్పుడు వీడు ‘కటకటాల రుద్ర య్య’ సినిమా చూసి, పేరు పలకలేక ‘టకటకాల రుద్రయ్య’ అనేవాడు. (నవ్వు). సునీల్ చెల్లెలు సుజాత హైదరాబాద్‌లో మాతో ఉండేది.

సునీల్: నేను చిన్నప్పుడు  బాగా తినేవాడినా?
అమ్మ నాగమణి: (నవ్వేస్తూ) అస్సలు తినేవాడివి కావు. మీ తాతగారింట్లో 12  గుమ్మాలు, కిటికీలుండేవి. వీడికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అన్నం తింటాడని ప్రతి కిటికీ పక్కన ప్లేట్లలో అన్నం కలిపిపెట్టేవారు తాత గారు.
సునీల్: లేకలేక మగపిల్లాణ్ణని బయటికెళ్లనిచ్చేవారు కాదు. వెళ్లాలంటే పాలేరునిచ్చి పంపేవాళ్లు. తాతయ్య కష్టపడి పై కొచ్చారు. నాన్న పోయాక, అమ్మను ఊరికి రప్పించేశారు. తాత గారు పోయాక అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచింది.
అమ్మ నాగమణి:(‘సాక్షి’ వైపు తిరిగి) సునీల్ వాళ్ళ నాన్న గారు పోయాక ఆయన ఉద్యోగం నాకొచ్చింది. పోస్టల్ శాఖలో క్లర్‌‌కగా మొదలెట్టి పైకొచ్చా. చిన్నప్పట్నుంచే సునీల్ బాధ్యతగా ఉండేవాడు. సరుకులు తెచ్చేవాడు.
సునీల్: ఒకట్రెండుసార్లు మా నాన్నగారిని చూసినట్లు లీలగా గుర్తు. ఇక జీవితమంతా అమ్మమ్మ, పిన్నమ్మలు, మా అమ్మ, చెల్లెలు మధ్యే గడిచింది. ఆడవాళ్ళ మధ్యే పెరిగాను కాబట్టి, నేను ఇప్పటికీ చాలా ఎమోషనల్.

సాక్షి: మీ అబ్బాయికి సిన్మాల్లో ఆసక్తి అని ఎప్పుడు తెలిసింది?
అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) చిన్నప్పటి నుంచి వీడికి సిన్మా పిచ్చి. సంక్రాంతి కోడిపందాల దాకా ఆటలు, సిన్మాలే. తర్వాత చదువుపై పడేవాడు. పరీక్షలు పదిరోజుల్లో ఉన్నా యనగా ఇల్లు అదిరేలా పైకి గట్టిగా చదివేవాడు (నవ్వు).
సునీల్: అమ్మకి చెప్పకుండా సిన్మాలకెళ్ళిన రోజులున్నాయ్.
అమ్మ నాగమణి: భీమవరంలో రోడ్డుకిటు మా ఇల్లు, అటు నటరాజ్ థియేటర్. అంతా కలసి ప్రతి శనివారం సాయం త్రం సినిమాకెళ్ళేవాళ్ళం. అది కాక వీడేమో సరుకులు తేవ డానికని వెళ్ళి, నాకు తెలీకుండా సిన్మా ఇంటర్వెల్ దాకా ఒకరోజు, మిగతా సినిమా మర్నాడు చూసొచ్చేవాడు.

సునీల్: మొత్తం చూసొస్తే నీకనుమానం వస్తుందని(నవ్వు).
అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) సిన్మా చూసొస్తే, ప్రతి సీన్ యాక్షన్ చేస్తూ చెప్పేవాడు. మూడు గంటలు చెప్పి, ఇక్కడ ఇంటర్వెల్ అనేవాడు. మిగతాది మరో మూడు గంటలన్న మాట (నవ్వు). చిరంజీవి గారు వీడికి ఇన్‌స్పిరేషన్. అద్దం ముందు నిల్చొని కాళ్లు తొక్కేస్తూ, డ్యాన్‌‌సలు చేసేవాడు.

సునీల్:: సిన్మాల్లోకి వెళ్తానంటే వద్దనలేదు. ప్రోత్సహించావే?
అమ్మ నాగమణి: పిల్లల ఇష్టాన్ని పేరెంట్స్ గమనించి, ప్రోత్స హించాలి. అలా కాకుండా, మనది వాళ్ళపై రుద్దితే, ఎటూ కాకుండా అయిపోతారు. నిన్ను ప్రోత్సహించింది అందుకే.
సునీల్: (‘సాక్షి’తో) హైద్రాబాదొచ్చి, ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’లో చిన్న వేషమేశా. కానీ, ఆ సీన్లన్నీ కట్ అయ్యాయి. ఒకచోట గుంపులో వెనక కనిపిస్తా. లాభం లేదని ఊరెళ్ళిపోయి, తర్వాత మళ్ళీ వచ్చా. డ్యాన్‌‌స అసి స్టెంట్‌గా చేశా. రెండేళ్ళ సీనియరైన (త్రివిక్రవ్‌ు) శ్రీనివాస్ సిన్మాల్లోకొస్తున్నాడని మా కజిన్ వల్ల తెలిసి, తనని కలిశా.
అమ్మ నాగమణి: నాకు మొదట భయమేసింది. కానీ, శీను (త్రివిక్రవ్‌ు) ఉన్నాడని ధైర్యం. ‘మీరు చూసుకున్నట్లే నేనూ మీ అబ్బాయిని చూస్తా’నన్నాడు. వీళ్ళు హైద్రాబాదెళ్ళాక, పండగొస్తే చాలు తిన్నారో, లేదో అని తలగడలో ముఖం పెట్టుకొని, ఎన్నిసార్లు ఏడ్చానో! మా పాపేమో ‘వాడుంటేనే అన్నీ చేస్తావు’ అని దెబ్బలాడేది (నవ్వు).

సునీల్: నిరాశపడ్డప్పుడల్లా నువ్వు నాకెలా బూస్టిచ్చేదానివి?
అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) అప్పట్లో ఫోన్లు లేవుగా... వీడికి లెటర్లు రాసేదాన్ని. ‘నువ్వు-నేను’లో అసెంబ్లీ దగ్గర సీన్ సరిగ్గా యాక్ట్ చేయలేకపోయానని వీడు బాధపడ్డాడు. ‘ఈ రోజు సరిగ్గా చేయలేదని బాధపడకు. రేపటి గురించి ఆలో చించు. బాగా చేస్తావు’ అనేదాన్ని. అదే జరిగింది. ఆ సిన్మాకు వాడికి తొలి ‘నంది’ అవార్డు వచ్చింది. ప్రతిభ చాలా మందికి ఉంటుంది. కానీ, కష్టపడ్డవాళ్ళే పైకొస్తారు.
సునీల్: ప్రతి ఒక్కరూ నా కన్నా ప్రతిభావంతులే అని నమ్ముతా. ప్రతిభ అంటే వేరే ఏదో కాదు... పని మీద మనకున్న భయం, భక్తి, ప్రేమ. అవి ఉండాలి. కష్టపడాలి.

సునీల్:: మరి, యాక్టర్‌నయ్యాక నా కామెడీ నచ్చిందామ్మా?
అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) వీడు ఇంట్లో కూడా భలే కామెడీ చేస్తాడు. ఏ మంచి సీన్ చేసొచ్చినా, చెబుతాడు. చేసి చూపిస్తాడు. అప్పట్లో ‘నువ్వేకావాలి’ 5సార్లు చూశా. ‘ఇన్ని ఇడ్లీలు తినలేను. ఒక్కటి తీసేయ్’ అంటూ వీడు నటించిన ‘మనసంతా నువ్వే’లో సీన్ నాకు బాగా ఇష్టం.

సునీల్: హీరో అవుతానన్నప్పుడు నీ ఫీలింగేంటి అమ్మా?
అమ్మ నాగమణి: ఇదెలా ఉంటుందో చూద్దామనుకున్నా. ‘అందాలరాముడు, మర్యాదరామన్న, తడాఖా’ నచ్చాయి.
సునీల్: ‘మర్యాదరామన్న’లో ట్రైన్‌లో కొబ్బరిబోండాం సీన్ తాడేపల్లిగూడెంలో అమ్మ చూసిన ఇన్సిడెంట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి గారు అద్భుతంగా అల్లినదే.

సాక్షి: హీరోగా డ్యాన్‌‌సలు, ఫైట్లు, సినిమా సక్సెసా కాదా అన్న టెన్షన్లతో శ్రమపడుతుంటే, తల్లి మనసు తల్లడిల్లడం లేదా?
అమ్మ నాగమణి: కమెడియన్‌గా కష్టపడ్డాడు, పేరు ప్రతిష్ఠలు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు హీరోగా డ్యాన్‌‌స, ఫైట్స్ చేస్తూ దెబ్బలు తగిలించుకొని, ఇంటికొస్తాడు. తల్లిగా బాధనిపిం చినా, కష్టపడుతున్నది మన కోసమేనని సర్దుకుంటా.
సునీల్: పాతికేళ్లైనా లేకుండానే భర్త పోతే... ఒంటరిగా 
అమ్మ నాగమణి: (అందుకుంటూ..‘సాక్షి’తో) నాకు పిల్లలే జీవితం. బాగా పెంచాలి. తండ్రిలేని లోటు వాళ్ళకి తెలీకూడదని తపించేదాన్ని. వేరే ధ్యాసేలేదు. రాత్రి పక్క పక్కనే పడుకొంటే, కష్టం సుఖం, మంచీ చెడు చెప్పేదాన్ని. వాళ్లూ చెప్పినమాట వినేవాళ్ళు.
సునీల్: సమాజంతో, చుట్టుపక్కలోళ్ల మాటల్తో కష్టం...
అమ్మ నాగమణి: (‘సాక్షి’ వైపు తిరిగి) తెల్లవారగట్టే లేచి, పనులన్నీ చేసేదాన్ని. 7 కల్లా ఆఫీసు కెళ్ళి, 11 కల్లా పిల్లలకు స్వయంగా అన్నం పెట్టాలని వచ్చేసే దాన్ని. మళ్లీ 2గంటలకెళ్లి సాయంత్రం దాకా డ్యూటీ. తలొంచుకొని వెళ్ళడం, రావడం. అంతే. ఎవరూ నన్నూ, నా పిల్లల్నీ వేలెత్తి చూపకూడదనే తపన.

 సునీల్: మా ఇంటికీ, ఆఫీసుకీ 3 కిలోమీటర్లు. అంటే అమ్మ రోజూ 12 కిలోమీటర్లు నడిచేది. తెల్లారక ముందే బట్టలన్నీ ఉతికి ఆరేసేది. వెలుతురికి పిల్లలు నిద్రలేస్తారని కిటికీలకు కర్టెన్లు కట్టేసేది. మా కోసం ఓవర్‌టైవ్‌ు చేసి సంపాదించేది. స్కూలైపోగానే నేను, చెల్లెలు ఆఫీసుకెళ్ళేవాళ్ళం. కార్డులు, కవర్లు, బరువు తూచే కాటాల మధ్య ఆడుకొనేవాళ్ళం. చీకటిపడ్డాక మమ్మల్ని బయటకి పంపడం ఇష్టం లేక అక్కడ ఆడు కొమ్మనేదని అనుకొనేవాణ్ణి. మా అమ్మ తన భద్రతకి మమ్మల్ని పెట్టుకొందని పెద్దయ్యాక అర్థమైంది. అమ్మకు మేము, మాకు అమ్మ బాడీగార్‌‌డ! అందరూ జన్మనే ఇస్తారు. (చెమర్చిన కళ్ళతో) కానీ మా అమ్మ మాకు జీవితమిచ్చి, తన జీవితం వదిలేసుకుంది.
అమ్మ నాగమణి: (కన్నీళ్ళతో) నాకలాంటి బాధ,భావం ఇప్పటికీ లేవు. పిల్లలే ముఖ్యం, జీవితమనుకున్నా.

సునీల్: ఇక్కడ పేరొచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా కష్టపడ్డవారే. అసలు నాకు సపోర్‌‌ట మా అమ్మే. సినిమా ఆడకపోతే, ‘నిన్నటిదైపోయింది. రేపేంటో చూడు’అని ధైర్యమిస్తుంది. పెన్షన్ డబ్బులు రెండు, మూడు నెలలు వాడుకోకుండా నా ప్రతి పుట్టినరోజుకూ రూ. 50 వేలు ఇస్తుంది.
అమ్మ నాగమణి: వాడికి యాపిల్ ప్రొడక్ట్‌లంటే ఇష్టం. లేటెస్ట్ ఐఫోన్ కొనుక్కోమనిస్తా. ఈసారి లక్ష ఇవ్వాలేమో(నవ్వు).
సునీల్: అమ్మకు నేను కారో, ఫోనో కొనివ్వబోతే ‘వద్దురా.. వాడేసింది నాకివ్వు. నువ్వు కొత్తది కొనుక్కో’ అంటుంది.
అమ్మ నాగమణి: సంపాదనే నాకిస్తాడు. వేరే గిఫ్టేంటి! ఐనా, నీదేంటి? నాదేంటి? ఇవన్నీ దేవుడివే తప్ప, మనవి కాదు.

సునీల్: అమ్మ ఇప్పటి దాకా ఒక్కటే కోరింది. గుర్తుందామ్మా?
అమ్మ నాగమణి: సినిమాల్లోకెళ్ళాక వాడికి ఒకటే చెప్పా. ‘ఇక జీవితంలో నిర్ణయాలనీ నీవే. కానీ అనుకూలవతైన అమ్మా యిని చూసే బాధ్యత నాది. ఎందుకంటే నువ్వు పొరపా టు చేస్తే ఇంతకాలం నే పడ్డ కష్టం వృథా’ అన్నా. ‘నువ్వు ఎవరిని చూపిస్తే వారికి తాళి కడతా’నన్నాడు. కట్టాడు.
సునీల్: ‘నన్ను ఒక మాదిరిగా చూసుకున్నా చాలు. అమ్మని బాగా చూసుకోవాలి’ అని మా ఆవిడ శ్రుతితో చెప్పా.

సునీల్: అమ్మా! ఇంతకీ నాలో నీకు బాగా నచ్చినదేంటి?
అమ్మ నాగమణి: (‘సాక్షి’తో) వీడు మంచోడు. నాకు ఏది చేస్తాడో అదే చెల్లికీ, భార్యకీ చేస్తాడు. ఇప్పటి దాకా వీడి ముందు చెప్పనిదొకటి చెప్పాలి. మా కోడలూ అంతే. తన పిల్లలిద్దరితో పాటు, మా అమ్మాయి పిల్లలిద్దర్నీ కలిపి నలు గుర్నీ ఒకేలా చూస్తుంది. ఎప్పుడైనా ఏదైనా వస్తే తన పిల్లాణ్ణే తిడుతుంది కానీ, ఆడపడుచు పిల్లల్నేమీ అనదు. ఇలాంటి కొడుకు, కోడలున్నందుకు అదృష్టవంతురాల్ని.
సునీల్: ఒక ఫ్రెండ్‌తో చెప్పుకోలేనివి కూడా మా అమ్మతో చెప్పుకోగలను. ఇవాళ్టికీ నేను రాత్రి ఇంటికి రావడం ఎంత లేటైనా, విష్ణుసహస్రనామమో, మరొకటో చదువుకుంటూ అమ్మ సోఫాలో కూర్చొని, ఎదురుచూస్తూ ఉంటుంది.
అమ్మ నాగమణి: పొద్దున్నైనా, రాత్రైనా చెప్పకుండా వెళ్ళడు.

సాక్షి: ఇంత కష్టపడే మీకు... మీ వాడిలో కష్టమనిపించేది?
అమ్మ నాగమణి: వీణ్ణి నిద్ర లేపడం. చెప్పిన టైవ్‌ుకి లేపితే లేవడు (నవ్వులు). ఇక తల్లిగా బాధేంటంటే, వీడందరినీ నమ్మేసి, మోసపోతుంటాడు. తెలివిగా ఉండమంటుంటా! మా అబ్బాయని కాదు కానీ, ఇలాంటి కొడుకు వందలో ఒకడుంటాడు.అందరికీ ఇలాంటి కొడుకుండాలనుకుంటా.
సునీల్: జన్మజన్మలకీ ఈ అమ్మకే కొడుకునవ్వాలనుకుంటా! 
                                                     - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement