అమెజాన్.. ఒరాకిల్.. మైక్రోసాఫ్ట్.. శాంసంగ్.. గూగుల్.. ఫేస్‌బుక్.. ఉద్యోగాల కోసం అభ్యర్థులు బారులు తీరే కంపెనీలు. ఈ కంపెనీల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగం లభించినా.. ఎగిరిగంతేస్తారు! పై కంపెనీలతోపాటు ప్రముఖ బహుళజాతి కంపెనీలు, కొత్తగా ఏర్పాటైన స్టార్ట్-అప్స్ వరకు వందల సంఖ్యలో కంపెనీలు ‘మేం ఉద్యోగమిస్తాం. మా కంపెనీలో చేరండి’ అంటూ.. విద్యార్థుల వెంట ‘క్యూ’ కడితే..! ఈ పరిస్థితిని ఎవరైనా ఊహించగలరా..! ఇది వాస్తవమని నిరూపించాయి మన దేశంలోని ఐఐటీ క్యాంపస్‌లు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు.. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో కొనసాగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇది ప్రస్ఫుటమైంది. బెస్ట్ టాలెంట్‌ను సొంతం చేసుకోవాలని.. ఇందుకు కేరాఫ్ ఐఐటీ క్యాంపస్‌లేనని భావించిన కంపెనీలు వందల సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. దాంతో బ్రాండ్ ఐఐటీ మరోసారి మారుమోగింది. ఐఐటీలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై విశ్లేషణ..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు.. అకడెమిక్ ఎక్స్‌లెన్స్‌కు చిరునామా అనేది నిస్సందేహం. అందుకే ఐఐటీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇక్కడ డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులంటే.. బెస్ట్ బ్రెయిన్స్ అనే గౌరవం. కాబట్టే కంపెనీలకు.. టాలెంట్ అనగానే టక్కున గుర్తొచ్చేవి.. ఐఐటీలు. 2013-14 విద్యా సంవత్సరంలో ఇది మరోసారి రుజువైంది. అభ్యర్థులకు ఆఫర్లు ఇచ్చేందుకు ప్రతిష్టాత్మక కంపెనీలెన్నో పోటీపడ్డాయి. టాలెంట్ హంట్‌లో ముందుం డాలని రూ. లక్షల్లో వేతనాలు అందించాయి.
టాప్ రిక్రూటర్.. శాంసంగ్
దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పీహెచ్‌డీ వరకు దాదాపు 14వేల సీట్లు ఉన్న అన్ని ఐఐటీ క్యాంపస్‌లలో నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో శాంసంగ్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మొత్తం 271 ఆఫర్లు ఇచ్చింది. ఇందులో 28 ఆఫర్లు కంపెనీ ప్రధాన కార్యాలయం (కొరియా)లోనే ఉండటం విశేషం. శాంసంగ్ అంతర్జాతీయ ఆఫర్ల పరంగానూ మెరుగైన అవకాశాలు అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 177 ఆఫర్లతో రెండో స్థానంలో నిలవగా.. సాఫ్ట్‌వేర్ దిగ్గజంఒరాకిల్ 142 మందికి ఆఫర్ లెటర్స్ అందజేసింది. అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 118 అవకాశాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. 2012-13తో పోల్చితే ఈ సంఖ్య పెరగడం ఇక్కడ గమనార్హం.
సాఫ్ట్‌వేర్ నుంచి స్టార్ట్-అప్స్ వరకు
2013-14 ఐఐటీల క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో మరో ఆసక్తికరమైన అంశం.. ప్రతిష్టాత్మక సాఫ్ట్‌వేర్ సంస్థలతో పోటీగా స్టార్‌ట-అప్ సంస్థలు కూడా పాల్గొని ఆకర్షణీయ వేతనాలు అందించడం. అన్ని ఐఐటీల్లో 2012-13తో పోల్చితే స్టార్ట్-అప్ ఆఫర్ల సంఖ్య 23 నుంచి 27 శాతం మేర పెరిగింది. ఐఐటీ-బాంబే క్యాంపస్‌లోనే సుమారు వంద మందిని రిక్రూట్ చేసుకోవడానికి స్టార్ట్-అప్ కంపెనీలు ముందుకు రావడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు విద్యార్థులు కూడా స్టార్ట్-అప్ కంపెనీల పట్ల ఆసక్తి చూపారు. హౌసింగ్ డాట్ కామ్,Myntra.com, కిచ్‌డీ, ఫ్యుజీ లాజిక్స్, ఇన్‌మొబి వంటి స్టార్ట్-అప్‌లు సగటున 12 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్లు అందించాయి. స్టార్ట్-అప్స్‌లో అధికశాతం ఐఐటీ, ఐఐఎంల పూర్వ విద్యార్థులు నెలకొల్పినవే. యువ ప్రతిభావంతులను నియమించుకుంటే తమ ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చనే ఎంఎన్‌సీలకు ధీటుగా స్టార్ట్-అప్‌లు ఐఐటీయన్ల కోసం పోటీ పడ్డాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఖరగ్‌పూర్ కళ.. కళ..
మొత్తం ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఖరగ్‌పూర్ క్యాంపస్ అగ్రస్థానంలో నిలిచింది. తొలి దశలోనే 1010 ఆఫర్లు సొంతం చేసుకుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి దాదాపు 1400 మందికి అవకాశాలతో మొదటి స్థానంలో నిలిచింది. 1042 ఆఫర్లతో ఐఐటీ-బాంబే; 1008 ఆఫర్లతో ఐఐటీ-చెన్నై; సుమారు 950 మందికి అవకాశాలతో ఐఐటీ-ఢిల్లీ; 800 ఆఫర్లతో ఐఐటీ-కాన్పూర్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం మీద అన్ని ఐఐటీల్లో కలిపి 85 శాతంపైగా విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లో అవకాశాలు అందుకున్నారు. మిగతా విద్యార్థులకు కూడా ఆఫర్లు వచ్చినప్పటికీ.. ఉన్నత విద్య, రీసెర్చ్, సొంత స్టార్ట్-అప్స్ ఆలోచనతో వదులుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐఐటీ-హైదరాబాద్‌లో ఇలా
కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐటీల్లో ఒకటైన హైదరాబాద్‌లో 2013-14లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఆశాజనకంగానే సాగాయి. అమెజాన్, టీసీఎస్, పేపాల్, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌కు వచ్చాయి. మొత్తం 52 కంపెనీలు ఈ ప్రక్రియలో పాల్గొని 121 ఆఫర్లు అందించాయి. 2012-13తో పోల్చితే 20 కొత్త కంపెనీలు పాల్గొనడం విశేషం. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో గరిష్టంగా రూ.22 లక్షల వార్షిక వేతనం, సగటున 7.8 లక్షల వేతనాలతో విద్యార్థులకు ఆఫర్లు లభించాయి.
కొత్త ఐఐటీల్లో పరిస్థితి
కొత్తగా ఏర్పాటైన ఐఐటీలు మాత్రం ఈ ఏడాది (2013-14)లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఒడిదుడుకులు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నుంచి పబ్లిక్ సెక్టార్ కంపెనీలను నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ఐఐటీలను ఏర్పాటు చేసినప్పటి నుంచి గతేడాది వరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వరంగ సంస్థలు ప్రధానంగా ఆఫర్స్ ఇచ్చేవి. అయితే వీటిని క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొనవద్దని మద్రాస్ హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో కొత్త ఐఐటీలు 2013-14లో ఆఫర్లు పొందడంలో కొంత వెనుకంజలో ఉన్నాయి. అలాగే అంతకుముందు ఏడాది ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్లు అందించిన గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు కూడా ఈసారి కొత్త ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనలేదు. కొత్త ఐఐటీల్లో ప్రతిఏటా సీట్ల సంఖ్యను, ఆ మేరకు విద్యార్థుల సంఖ్యను పెంచడం.. ఇంకా కొన్ని క్యాంపస్‌లు మౌలిక సదుపాయాల కొరతతో అకడెమిక్ నైపుణ్యాల పరంగా వెనుకబడటం వంటివి ప్రముఖ కంపెనీలు రాకపోవడానికి ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. అయితే ఇక్కడ ఆఫర్లు పొందిన వారికి సగటు వార్షిక వేతనంలో పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ఐఐటీ-రోపార్‌లో 2012-13తో పోల్చితే సగటు వార్షిక వేతనం 21 శాతం పెరిగింది. ఐఐటీ-హైదరాబాద్‌లో కూడా ఈ పెరుగుదల 27 శాతం నమోదైంది.
ఇంజనీరింగ్.. టు ఎడ్యుకేషన్
ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ అంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ డొమైన్ కంపెనీల సంఖ్య అధికంగా ఉంటుందనేది వాస్తవం. వీటితోపాటు మరెన్నో రంగాలకు చెందిన సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొన్నాయి. మోర్గాన్ స్టాన్లీ, బార్ క్లేస్ వంటి కన్సల్టింగ్ కంపెనీలు మొదలు డీఆర్‌డీఓ, బార్క్ తదితర రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థల వరకూ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చాయి. కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్.. తమ కార్యకలాపాల్లో బ్యాక్-ఎండ్ టెక్-సపోర్ట్ విభాగాల కోసం నియమించుకోగా.. ఆర్ అండ్ డీ సంస్థల్లో మాత్రం ఔత్సాహిక అభ్యర్థులే ఎక్కువ మొగ్గు చూపారు.
ఐఐటీలు.. ఐఐఎంల మధ్య పోటీ
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్.. టాలెంట్ సెర్చ్ విషయంలో ఐఐటీలు, ఐఐఎంల మధ్య పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారిన మరో అంశం. ఐఐటీలంటే టెక్నోక్రాట్స్, ఐఐఎంలంటే బిజినెస్ లీడర్లకు కేరాఫ్‌గా పేరొందిన నేపథ్యంలో.. పలు ఫైనాన్‌స సంస్థలు ఐఐటీల్లోనూ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించాయి. దీంతో ఐఐఎం విద్యార్థులు.. ఐఐటీయన్లతో పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. మెకిన్సే, బోస్టన్ కన్సల్టెన్సీ, యూబీఎస్ వంటి ప్రముఖ ఫైనాన్స్ సంస్థలు తొలిసారి ఐఐటీ-బాంబేలో ఆఫర్లు అందించగా.. ఇదే పరిస్థితి ఐఐటీ-ఢిల్లీ, ఖరగ్‌పూర్‌లలోనూ కనిపించింది. బార్‌క్లేస్ క్యాపిటల్, ఒపేరా సొల్యూషన్స్ వంటి ప్రముఖ బిజినెస్ కన్సల్టింగ్, ఫైనాన్స్ సంస్థలు ఐఐటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకునేందుకు ముందుకొచ్చాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ సంస్థలు ఐఐఎంలలో అందించిన సగటు వేతనం.. ఐఐటీల్లో అందించిన సగటు వేతనం దాదాపు సమానం కావడం. ఐఐటీ-బాంబేలో గ్రాడ్యుయేట్లకు లభించిన సగటు వేతనం రూ. పది లక్షలు.. ఐఐఎం-అహ్మదాబాద్‌లోని విద్యార్థులకు లభించిన సగటు వేతనం (రూ. 9.5 లక్షలు) కంటే ఎక్కువగా ఉండటం మరో విశేషం.
పెరిగిన సగటు వేతనాలు
వేతనాల విషయంలోనూ ఐఐటీల్లో 2014 పాస్-అవుట్ విద్యార్థులకు ఆకర్షణీయమైన పరిస్థితులు కనిపించాయి. గత ఏడాదితో పోల్చితే అంతర్జాతీయంగా, జాతీయంగా సంస్థలు అందించిన సగటు వేతనాల మొత్తం పెరిగింది. 14 నుంచి 16 శాతం మేర పెరిగి.. సగటున జాతీయస్థాయిలో 13.5 లక్షల వార్షిక వేతనం; అంతర్జాతీయంగా రూ. 47 లక్షల వేతనం నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అత్యధిక పే-ప్యాకేజ్‌ను రూ.1.54 కోట్లతో గూగుల్ సంస్థ అందించింది.
విద్యార్థులే ఆఫర్లను తిరస్కరిస్తే!?
క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే సంస్థలన్నీ అంతర్జాతీయ గుర్తింపు ఉన్నవే. అలాంటి సంస్థల్లో ఆఫర్ వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించడం కూడా సహజం. కానీ విద్యార్థులే వచ్చిన ఆఫర్లను.. అందులోనూ లక్షల డాలర్లు కురిపించే అంతర్జాతీయ ఆఫర్లను కాదంటే. ఇదే పరిస్థితి ఐఐటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కనిపించింది. ఇందుకు ఉదాహరణ.. ఒరాకిల్ సంస్థ ఐఐటీ-కాన్పూర్‌లో 2,10,000 అమెరికన్ డాలర్ల వార్షిక వేతనంతో ఇచ్చిన ఆఫర్‌ను ఇద్దరు విద్యార్థులు తిరస్కరించడమే. చివరకు ఈ సంస్థ ఐఐటీ-చెన్నై నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకుంది. డబుల్ ఆఫర్లు పొందిన పలువురు విద్యార్థులు తక్కువ జీతమైనా.. విధుల పరంగా తమకు సంతృప్తినిచ్చే సంస్థలవైపు మొగ్గు చూపారు. ఉదాహరణకు.. ఐఐటీ-చెన్నైలో 84 మంది విద్యార్థులకు డబుల్ ఆఫర్ లభించగా.. నలుగురు విద్యార్థులు ఎంఎన్‌సీల ఆఫర్‌ను వదులుకుని స్టార్ట్-అప్ సంస్థలో చేరేందుకే ప్రాధాన్యమిచ్చారు.
విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు
గతేడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను విశ్లేషిస్తే.. విద్యార్థులే ఐఐటీల బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవనున్నారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఐఐటీల్లో టాలెంట్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అందుకే ప్రముఖ సంస్థలన్నీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ తొలి దశలో మొదటి మూడు రోజుల్లో డ్రైవ్స్ నిర్వహించడానికి ప్రాధాన్యమిచ్చాయి. విద్యార్థుల కోణంలో చూస్తే.. ఆఫర్లను అంగీకరించే విషయంలో చాలా పరిణితితో వ్యవహరించారు. పే ప్యాకేజ్‌లకంటే వ్యక్తిగత ఆసక్తులకే ప్రాధాన్యమి చ్చారు. స్టార్ట్-అప్ సంస్థల ఆఫర్లకు, ఆర్ అండ్ డీ అవకాశాలకు మొగ్గు చూపడమే ఇందుకు నిదర్శనాలుగా పేర్కొనొచ్చు.
- ఎస్.కె.మెహతా, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఐఐటీ-బాంబే
ఉన్నత విద్యకు పెరిగిన ప్రాధాన్యం
గత ప్లేస్‌మెంట్ సీజన్‌లో విద్యార్థులకు ఆకర్షణీయ ఆఫర్లు లభించాయి. ఇదే సమయంలో మొత్తం విద్యార్థుల్లో 15 నుంచి 20 శాతం మంది ఉన్నత విద్యకు ప్రాధాన్యమిచ్చి.. ఆఫర్లను తిరస్కరించా రు. దీనివల్ల గణాంకాల పరంగా అంతకుముందు ఏడాదితో పోల్చితే ప్లేస్‌మెంట్స్ సంఖ్య కొంత తక్కువగా కనిపిస్తోంది.
- బి.వెంకటేశం, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్, ఐఐటీ-హైదరాబాద్
ఐఐటీ బ్రాండ్ ఇమేజ్‌కు చక్కటి నిదర్శనాలు
గతేడాది ప్లేస్‌మెంట్స్ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఐఐటీల బ్రాండ్ ఇమేజ్‌కు చక్కటి నిదర్శనాలు. ముఖ్యంగా ఎన్నో దశాబ్దాలుగా ఉన్న చెన్నై, బాంబే, ఢిల్లీ, ఖరగ్‌పూర్, కాన్పూర్, రూర్కీ వంటి ఐఐటీల పట్ల అంతర్జాతీయ సంస్థలు ఎంతో ఆసక్తి చూపాయి. ఈ క్యాంపస్ లలో కొలువులు ఇచ్చే విషయంలో కంపెనీలు పోటీ పడ్డాయి. అన్ని ఐఐటీల్లో కలిపి సుమారు 200కు పైగా విద్యార్థులకు డబుల్ ఆఫర్లు లభించాయి. కానీ విద్యార్థులు తమ అభిరుచి, ఆసక్తికే ప్రాధాన్యమిచ్చారు. ఇదే హవా ఈ ఏడాది కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు.
- లెఫ్ట్‌నెంట్ కల్నల్ (రిటైర్డ్) జయకుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్, (ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్), ఐఐటీ-చెన్నై
స్టార్ట్-అప్స్ కూడా సమర్థంగా...
ఐఐటీల క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పలువురు విద్యార్థులు స్టార్ట్-అప్ సంస్థల వైపు మొగ్గు చూపడానికి కారణం.. అవి కూడా అంతర్జాతీయ సంస్థలకు ధీటైన పోటీ ఇవ్వడమే. ఫ్లిప్‌కార్ట్ సంస్థ అంతర్జాతీయ ఆదరణ పొందుతోంది. అంతేకాకుండా విద్యార్థులు తమలోని వినూత్న ఆలోచనలను వెలికి తీసేందుకు స్టార్ట్-అప్ సంస్థలను వేదికలుగా భావించారు.
- పాయల్ బెనర్జీ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్, ఫ్లిప్‌కార్ట్
బ్రాండ్ ఐఐటీ.. క్యూ కట్టిన కంపెనీలు
Published Sun, Aug 10 2014 11:40 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
Advertisement