ఓటమి నేర్పే పాఠాలు అత్యంత విలువైనవి | The defeat of the most valuable lessons to teach | Sakshi
Sakshi News home page

ఓటమి నేర్పే పాఠాలు అత్యంత విలువైనవి

Published Sun, Jan 22 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

ఓటమి నేర్పే పాఠాలు అత్యంత విలువైనవి

ఓటమి నేర్పే పాఠాలు అత్యంత విలువైనవి

సువార్త
యెరికో పట్టణాన్ని అద్భుతంగా స్వాధీనం చేసుకున్న విజయంతో ఆరంభమైన ఇశ్రాయేలీయుల వాగ్దాన దేశ జైత్రయాత్రకు వెనువెంటనే హాయి పట్టణంలో ఎదురైన అత్యంత అవమానకరమైన ఓటమితో బ్రేకులు పడ్డాయి. హాయి చాలా చిన్న పట్టణమైనందువల్ల మూడు వేలమంది సైనికులు చాలునన్న వేగులవారి సమాచారం నమ్మి యెహోషువా అంతేమందితో ఆ పట్టణం మీద దండెత్తాడు. కాని హాయి పట్టణస్తులు వారి సైన్యం ఇశ్రాయేలు వారిని తరిమికొట్టి వారిలో 36 మందిని హతమార్చారు. ఓడిపోయిన యెహోషువా దేవుని సన్నిధిలో మోకరించగా, ఇశ్రాయేలీయుల్లో ఒక వ్యక్తి చేసిన ఆజ్ఞాతిక్రమమనే పాపాన్ని బట్టి యుద్ధానికి తన సన్నిధిని ఇశ్రాయేలీయులతో పంపలేదని, అందుకే బలహీనుల చేతిలో ఓడిపోవలసి వచ్చిందని దేవుడు బదులిచ్చాడు.

యెరికో పట్టణాన్నంతా ధ్వంసం చేయాలన్నది దేవుని ఆజ్ఞ కాగా, అక్కడి ఒక మంచి వస్త్రాన్ని, కొంత వెండిబంగారాలను ఆకాను అనే ఇశ్రాయేలు సైనికుడు ఆశించి తీసుకున్నాడని విచారణలో వెల్లడికాగా, యెహోషువా అతనికి అతని కుటుంబానికంతటికీ మరణదండన అమలుపర్చాడు. ఆవిధంగా పాపప్రాయశ్చిత్తం చేసిన తరువాత ఇశ్రాయేలీయులు హాయి పట్టణంపై మళ్లి దాడి చేసి గెలిచి దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అంత చిన్న విషయాన్ని కూడా దేవుడంత తీవ్రంగా పరిగణిస్తాడా? తద్వారా దేవుడు నేర్పాలనుకున్న గుణపాఠం అత్యంత విలువైనది కాబట్టి దేవుని దృష్టిలో అది తీవ్రమైన విషయమే! యుద్ధంలో 36 మందిని పోగొట్టుకున్నామని మధనపడుతున్న ఇశ్రాయేలీయులకు, ఒక వ్యక్తి పాపం వల్ల అసలు దేవుని సన్నిధినే పోగొట్టుకోవడం మరింత నష్టదాయకమో, బాధాకరమో దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీయులు హాయి సైనికులు తమను ఓడించలేదని, దేవుని సన్నిధి తమలో లేని కారణంగా తమను తామే ఓడించుకున్నామని తెలుసుకున్నారు. వాగ్దాన దేశమైన కనానులో యెరికోలాంటి అతి పెద్ద పట్టణమైనా హాయిలాంటి అతి చిన్నదైనా దేవుని సన్నిధి తమలో ఉటే తప్ప ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేమన్న ‘విజయ సూత్రాన్ని’ దేవుని ప్రజలు గ్రహించారు. ఆ గ్రహింపుతోనే కనాను దేశాన్ని అద్భుతంగా ఆ తర్వాత గెలుచుకున్నారు.

యుద్ధ వ్యూహంలో వేగులవారి సమాచారం ఆధారంగా కాదు, దేవుని సన్నిధితో బలపడే అనుబంధం ఆధారంగా రూపొందించుకోవాలని వారి నాయకుడుగా యెహోషువా నేర్చుకున్నాడు. పాపం చేసి ఇశ్రాయేలీయుల ఓటమికి కారకుడైన ఆకాను ఉదంతం ఇప్పటికీ విశ్వాసులందరికీ ఒక హెచ్చరిక. వాగ్దాన దేశ జైత్రయాత్రలో ఎన్నో విలువైన అంశాలు కనిపించవచ్చు. అయితే వాటన్నింటికన్నా దేవుని సన్నిధే అత్యంత విలువైనదని అది లేకుండా బలహీనుల చేతిలో కూడా ఓడిపోవలసి ఉంటుందని దేవుడు వారికి నేర్పించాడు. హాయిలో ఓడినంత మాత్రాన వాగ్దాన దేశమంతా పోగొట్టుకున్నట్టు కాదని, జీవితాన్ని సరిచేసుకోవడం ద్వారా ప్రతి ఓటమినీ అధిగమించి మహావిజయం వైపు సాగవచ్చునని కూడా ఈ ఉదంతం తెలుపుతోంది. వాగ్దాన దేశ జీవితానికి అవసరమైన అత్యంత విలువైన పాఠాలను దేవుడు యెరికో మహా విజయం ద్వారా, హాయి ఓటమి ద్వారా కూడా నేర్పించాడు.

 దేవుడు పరిశుద్ధుడు కాబట్టి విశ్వాసి పరిశుద్ధత విషయంలో ఆయన రాజీపడడు. ఇంట్లోని కుక్క లేదా పిల్లి లాంటి పెంపుడు జంతువు నట్టింట్లో ‘అశుద్ధం’ చేస్తే, ఇంటిని శుభ్రపర్చుకోకుండా అందులో జీవించగలమా? దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేసే పాపాన్ని కూడా వెంటనే ప్రక్షాళనం చేసుకోవాలి. అప్పుడే విజయం, ఆనందం, ఆశీర్వాదం!
– రెవ.డాక్టర్‌.టి.ఎ. ప్రభుకిరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement