ఈ గొడుగు చాలా స్మార్ట్ గురూ!
స్మార్ట్ గాడ్జెట్
వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదనేది కాలం చెల్లిన సామెత. ప్రాణం పోకడ సంగతలా ఉంచితే, ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న గొడుగు వాన రాకడను ఇంచక్కా గంట ముందే చెప్పేయగలదు. ‘వెజూ’ అనే ఫ్రెంచి కంపెనీ ఈ గొడుగును రూపొందించింది. దీనిని ‘ఊంబ్రెల్లా’ బ్రాండ్ పేరిట మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. వాతావరణంలో రాబోయే మార్పులను ఇది గంట ముందే చెప్పేస్తుంది. ఈ గొడుగు పైభాగంలో ఏర్పాటు చేసిన సెన్సర్లు వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తాయి. ఎండ తీవ్రత, వాతావరణంలోని తేమ, గాలి పీడనం వంటి ప్రతి అంశాన్నీ స్మార్ట్ ఫోన్‌కు చేరవేస్తాయి.
రాబోయే గంట వ్యవధిలో వాతావరణంలో తలెత్తబోయే మార్పులను ముందుగానే అంచనా వేసి, స్మార్ట్‌ఫోన్‌కు హెచ్చరికలు జారీచేస్తాయి. మరో విశేషం ఏమిటంటే, దీనిని ఎక్కడైనా మర్చిపోయినా మరేమీ ఫర్వాలేదు. జీపీఎస్ ఆధారంగా ఇది ఎక్కడ ఉన్నదీ వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చేస్తుంది. అందువల్ల దీన్నెవరైనా కొట్టేస్తారేమోననే బెంగ కూడా అక్కర్లేదు. దీని రిటైల్ ధర 86 డాలర్లు (రూ.5,725) మాత్రమే. అంటే దాదాపు ఒక సగటు స్మార్ట్‌ఫోన్ ధరకు సమానం. ఎండ నుంచి, వాన నుంచి తలకు రక్షణ ఇచ్చే గొడుగుకు ఇది పెద్దమొత్తం అనిపించవచ్చు కానీ, ఇది మొబైల్ వాతావరణ కేంద్రంలా పనిచేస్తుంది మరి.