వింతైన షేప్.. కొంటే సేఫ్
ఒకప్పుడు ఒక అవసరం తీర్చే వస్తువు కనిపిస్తే ఆహా. మరిప్పుడో... ఒకే వస్తువు ఎన్ని ఎక్కువ అవసరాలు తీరిస్తే అంత ఆహా.. ఓహో. వర్షంలో తడవకుండా రక్షించే గొడుగులు ఇప్పుడు అనేక హంగులతో వస్తున్నాయి. వర్షంలో ఒక చేత్తో మొబైల్, మరో చేత్తో గొడుగు పట్టుకునే అవస్థ లేకుండా... ఫోన్‌ను గొడుగులో అమర్చి సంచలనం సృష్టించారు కేరళీయులు.
ఇవి రేపో మాపో సిటీ మార్కెట్‌లోకి రానున్నాయి. అయినా ఇంతకీ మీరు ఏ గొడుగు వాడుతున్నారు? ఏ గొడుగంటే రంగు గురించి అనుకునేరు! వీటిలో చాలా రకాలున్నాయి. ఏ వర్షానికి ఏ గొడుగు అనేది తెలియాలంటే కాస్త అవగాహన అవసరమే. ఈ నేపథ్యంలో వెరైటీ గొడుగుల విశేషాలు... – ఓ మధు
మరికొన్ని వెరైటీ గొడుగుల విశేషాలివి....
► క్లాసిక్: చెక్క, మెటల్ ఫ్రేమ్, పాలిస్టర్‌తో చేసిన సింగిల్ ఫోల్డ్ గొడుగులు ఇవి. మన ఇళ్లలో కనిపించే పాత కాలం నాటి గొడుగులు చాలా వరకూ ఇవే.
► ఆటోమెటిక్ గొడుగులు: ఒక చేత్తో తెరిచేందుకు వీలుగా ఉండేవి. వీటిలో రెండు మడతలు చేసి బ్యాగుల్లో సర్దుకొని తీసుకెళ్లేంత చిన్నవి కూడా ఉన్నాయి. రేటు పెరిగే కొద్ది చిన్న పౌచ్, ప్లాస్టిక్ బాటిల్‌లో పట్టేవి కూడా లభిస్తున్నాయి.
► పాకెట్ గొడుగు: ఇవి తక్కువ బరువుతో పాకెట్‌లో పట్టేంత చిన్నగా ఉంటాయి. భారీ వర్షం నుంచి రక్షించలేవు.
► బబుల్: నీటి బుడగను తలపిస్తాయి. తల, భుజాలు కవర్ అయ్యేలా ఉండే బబుల్ గొడుగులు ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్‌తో చేసినవే ఎక్కువ.
► తుఫాన్ గొడుగులు: భారీ, ఈదురు గాలులతో కూడిన వర్షాలను తట్టుకునేలా తయారుచేసినవి. ఇవి చాలా దృఢంగా ఉంటాయి.
► ఫ్యాషన్: ఫ్యాషన్ డిజైనర్లు రకరకాల మెటీరియల్స్, కొత్త డిజైన్స్‌తో గొడుగులు తయారు చేస్తున్నారు. ఎండ కోసం ప్రత్యేకమైన గొడుగులు తయారవుతున్నాయి. ఎండతో పాటు అతినీలలోహిత కిరణాలు, టాన్ నుంచి తప్పించుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. బీచ్‌లలో బాగా ఎండ ఉన్న సమయాల్లో వాడతారు.
► గోల్ఫ్ గొడుగు: 70 ఇంచుల వ్యాసంతో గోల్ఫ్ బ్యాగుల్లో తీసుకెళ్లడానికి వీలుగా ఉంటాయి.
► గాడ్జెట్ గొడుగులు: లైట్, కత్తి, చేతి కర్ర తదితరాలతో పాటు ఆధునిక సాంకేతికత కూడా గొడుగులో దూరిపోతోంది. ఎంపీ3, రేడియో, యూఎస్‌బీ, ఎల్‌ఈడీ, అలారం, బ్లూటూత్‌తో కూడిన చైనా మేడ్ గొడుగులు అందుబాటులో ఉన్నాయి. సిటీలో బ్లూటూత్ గొడుగులు ఆదరణ పొందుతున్నాయి.