‘చున్ని’కృష్ణులు | Think in one of the girls wants to save the life | Sakshi
Sakshi News home page

‘చున్ని’కృష్ణులు

Published Wed, Jun 25 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

‘చున్ని’కృష్ణులు

‘చున్ని’కృష్ణులు

ఉత్త(మ)పురుష
 

అలనాడు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను లాగేస్తుంటే శ్రీకృష్ణుడు ఆమెకు చీరలిచ్చాడన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నయ్యంటే ఆయనే మరి. అప్పుడెప్పుడో ఆ సంఘటన జరిగింది కాబట్టి సరిపోయిందిగానీ... ఇప్పుడు జరిగుంటేనా... దుశ్శాసనుడి మీద ‘నిర్భయ’ చట్టం కింద కేసు బుక్ చేసి ఉండేవాళ్లం. పీడా వదిలిపోయి ఉండేది. సదరు దుశ్శాసనుడు ఇప్పుడు లేడనే బాధ కంటే ఇప్పుడు మన అమ్మాయిల మానమర్యాదలు కాపాడేందుకు కంకణం కట్టుకున్న శ్రీకృష్ణులు ఎక్కువయ్యారన్న బాధ ఎక్కువైంది.

 అరే... చెల్లెళ్ల మానమర్యాదలను కాపాడే అన్నయ్యలూ, కన్నయ్యలూ ఎక్కువైతే ఆనందించాలి గానీ... బాధపడాల్సిన అవసరమేముందంటారా? చెబుతా. సరదాగా మా శ్రీవారితో సైకిల్ మోటర్ మీద వెళ్దామని బయల్దేరుతానా... ఇక దాంతో పాటే మా కన్నయ్యల తాకిడి పెరిగిపోతోంది.
       
 సరదాగా సినిమాకు తీసుకెళ్లమని శ్రీవారిని అడిగా. ఎందుకో ఆయన మూడ్ బాగుంది. ‘సరే బయల్దేరు’ అన్నారు. మోటర్‌సైకిల్ స్టార్ట్ చేశాక ఆయన వెనక కూర్చున్నా. బయల్దేరిన కాసేపటికి మన మోటార్‌సైకిల్‌కి ప్యారలల్‌గా మరో బైక్ కాసేపు అదేపనిగా  నడుస్తూ ఉంటుంది. మనం చీర కట్టుకుని ఉంటే... ‘చీర... చీర’ అంటూ హెచ్చరిస్తాడా బైకు మీది అపర కృష్ణుడు. అదే మనం గానీ చుడీదార్ వేసుకుని ఉంటే... ‘చున్నీ చున్నీ’ అంటూ జాగ్రత్త చెబుతాడు. పైగా ఆ మాట చెప్పాక... వాడేదో మనల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడేసిన ఫీలింగును ముఖంలో పలికిస్తాడు. మనల్ని పెను విపత్తు నుంచి రక్షించిన అలసటను ఫేసులో ఒలికిస్తాడు. గతంలో ఇంటిదాకా దిగబట్టే బాడీగార్డుల్లాగే ఇటీవల ఈ తరహా ‘శారీగార్డు’లు ఎక్కువయ్యారు. అయితే తీరా చూసుకుంటే మన చీరో, చున్నీయో అంతా సక్రమంగానే ఉంటుంది. అప్పట్లో అమ్మాయిలను ఏదో వంకతో పలకరించాలంటే... మగాళ్లు తమ వాచీ దాచుకుని ‘టైమెంత’ అని అడిగేవాళ్లట. నాకనిపిస్తున్నదేమిటంటే... ఇప్పుడు ఆ మగాళ్లే కాసేపు వివాహితతో అధికారికంగానూ, తమకు ఎలాంటి దురాలోచనా లేదనే దృక్పథాన్ని చాటుకుంటూనో.... దాంతోపాటు ఏదో పెజాసేవను ఎగస్ట్రాగా ఒరగబెట్టామనే ఫీలింగిచ్చుకునే త్యాగిష్ఠిలా పోజిచ్చుకునేందుకో ఈ ‘చున్నీ’ హెచ్చరికలను చేస్తున్నారనే అనుమానం నా మనసులో ఓ మూలన ఉంది. వాస్తవంగా అతివ తాలూకు అంగవస్త్రం చక్రంలో చుట్టుకుపోతుందనే ఉద్దేశంతో ఆ ప్రమాదానికి చక్రం అడ్డేయడానికీ, మగువ మానాన్ని కాపాడటానికే హెచ్చరిక చేస్తే... ఆ మగాళ్లు నిజంగానే చెల్లెలి మానాన్ని కాపాడేందుకు సిద్ధపడ్డ అపర శ్రీకృష్ణులే. అదే... ఏదో ఒక ఒంకతో కాసేపు అమ్మాయి చీరనో, చున్నీనో సర్దుకునేలా చేసేందుకు పరోపకారి వేషం వేస్తే మాత్రం వాళ్లనేమని పిలవాలి? నా మటుకు నాకు అనిపిస్తుందేమిటో తెలుసా! నేను వాళ్లకు పెట్టిన పేరేమిటో తెలుసా... వాళ్లు కన్నయ్యల్లాంటి మా అన్నయ్యలైన ‘చున్ని’కృష్ణులు!!
 - వై!
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement