
ఈ పదీ ఆచరిస్తే నో టెన్‌షన్
మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలి అవసరం. మంచి వ్యాయామం అవసరం.దానితో పాటు ఎప్పుడూ ఆకర్షణీయమైన సౌష్టవంతో, ఫిట్‌నెస్‌తో ఉండటం అనే అంశమూ నలుగురిలోనూ ఆత్మవిశ్వాసంతో ఉండటానికి దోహదపడుతుంది. అలాంటి ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం పొందడానికి కొన్ని సాధారణ సూచనలు ఇవి...
మంచి ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఆటగాళ్లకు ఉండే సౌష్టవం సాధ్యం కాదు. మంచి బ్రేక్‌ఫాస్ట్, ఓ మోస్తరుగా మధ్యాహ్న భోజనం, రాత్రివేళ తీసుకునే ఆహారం మితంగా ఉండేలా చూసుకోవాలి. దాంతో పాటు పోషకాలు ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. రాత్రి 10 గంటలు దాటాక ఆహారం తీసుకోవడం సరికాదు.
వ్యాయామం: వ్యాయామ నియమం తప్పక పాటించండి. వారంలో ఐదు రోజులు వ్యాయామం చేయాలన్న నియమం తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని తప్పకూడదు. నిర్ణయాల విషయంలో సూచనలు: మనం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ఆచరణకు సాధ్యమేనా అన్న విషయం ఆలోచించండి. మనం తప్పక ఆచరించగలమనే అంశాలనే ఎంచుకోండి. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుపరచండి.
ఇష్టమైన ఆట: మీరు ఏదైనా ఆటను ఎంచుకోండి. మీరొక్కరే ఎప్పుడూ ఆటను కొనసాగించలేరు. మీరు ఎంచుకున్న ఆటతో పాటు నిత్యం మీకు తోడుగా వచ్చే పార్ట్‌నర్‌ను కూడా ఎంచుకోండి. మిమ్మల్ని ఆటలో ప్రోత్సహించేలా ఆ భాగస్వామి ఉండాలి. అయితే ఇటీవలి కాలంలో మీకు ఖాళీ సమయం లభించినప్పుడే మీ క్రీడా భాగస్వామికీ టైమ్ లభిస్తుందని చెప్పలేం. కాబట్టి కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల సహాయంతో మీ ఇంటి టీవీలోనే మీ క్రీడా భాగస్వామిని ఎంచుకునే వీలుంది. కాబట్టి ఇలాంటి ఇండోర్ ఆటలు రోజులో కనీసం కొద్దిసేపైనా ఆడటం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి క్రీడా భాగస్వామిని ఎంచుకోలేని వారు ఈ తరహా ఆటలను ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి.
కొత్తది నేర్చుకోండి: ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. మీకంటే చిన్నవాళ్ల నుంచి కొత్తవి నేర్చుకునే విషయంలో అహానికి లోనుకావద్దు. కొత్త తరానికి మనకంటే కొన్ని విషయాలు ఎక్కువగా తెలుసు అనే అంశాన్ని గుర్తించండి. సాకులు మానేయండి: కొన్ని విషయాలను ఆచరించడానికి కుదరనప్పుడు దానికి వెంటనే సాకులు వెతుక్కోవడం మానవ సహజం. అది ఆహారం విషయంలోనైనా, వ్యాయామం విషయంలోనైనా! అందుకే ఏదైనా విషయంలో ఎప్పుడైనా పొరబాటు జరగవచ్చు. అలాంటప్పుడు తప్పు మీది కాదని సరిపుచ్చుకోకండి. జరిగిన పొరబాటును మళ్లీ జరగకుండా దిద్దుకోండి.
నిత్యం ఆనందంగా ఉండండి: ఎప్పుడూ విచారంగా ఉండకండి. మీరు చేసే ప్రతి పనినీ ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండండి.
స్ఫూర్తి పొందండి: మీరు చదువుతున్న పత్రికలు, చూస్తున్న టీవీ కార్యక్రమాల వంటి వాటి నుంచి నుంచి స్ఫూర్తి పొందండి. ఇలా నిత్యం స్ఫూర్తి పొందడం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
ఓపికగా ఉండండి: జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. కష్టాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకండి. అవి తొలగేవరకూ ఓర్పుగా ఉండండి. మీరు ఏదైనా లక్ష్యాలు నిర్ణయించుకున్నప్పుడు అవి తీరే వరకు ఓపిక వహించండి.
కుంగిపోకండి: వరుసగా కష్టాలు వచ్చినా కుంగిపోకండి. ఏ కష్టమూ ఎప్పుడూ శాశ్వతం కాదు. సుఖం తర్వాత కష్టం, దాని తర్వాత ఆనందం ఎప్పుడూ వస్తూపోతూ ఉంటాయి.