త్రీ మంకీస్ - 7 | Three Monkeys | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 7

Published Sat, Oct 25 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

త్రీ మంకీస్ - 7

త్రీ మంకీస్ - 7

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 7
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 యమధర్మరాజు గోడ గడియారం వంక చూసి కేసుని వాయిదా వేశాడు.
 ఆయన తన ఛాంబర్‌లోకి వెళ్ళిన కొద్ది నిమిషాలకి సీఐ ఆదరాబాదరాగా మళ్ళీ ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు హాల్‌లోకి వెళ్ళాడు. అతని వెంట మరో ఇరవై మూడేళ్ళ యువకుడు కూడా ఉన్నాడు.
 ‘‘యువర్ ఆనర్ గారు ఏరి?’’ జడ్జి ఖాళీ కుర్చీని చూసి సిఐ అడిగాడు.
 ‘‘ఇప్పుడే బెంచీ దిగి తన ఛాంబర్‌లోకి వెళ్ళారు.’’ కోర్ట్ క్లర్క్ చెప్పాడు.
 ‘‘యువర్ ఆనర్ గారిని అడగండి. రిమాండ్ కేసు చూస్తారేమోనని’’సీఐ అభ్యర్థించాడు.
 ‘‘అలాగే.’’
 క్లర్క్ ఛాంబర్‌లోకి వెళ్ళి కొద్ది క్షణాల్లో వచ్చి చెప్పాడు - ‘‘త్వరగా. యువర్ ఆనర్ గారు ఇంకా డ్రస్ ఛేంజ్ చేసుకోలేదు.’’
 గుమ్మం దగ్గరకి వెళ్ళగానే లోపలి నించి ‘జగమే మారినది మధురముగా ఈ వేళా...’ ట్యూన్‌తో ఈల వినిపిస్తోంది. సిఐ ముద్దాయితో లోపలికి వెళ్ళాడు. యమధర్మరాజు మొహం ఉదయంలా ధుమధుమలాడకుండా ప్రసన్నంగా ఉండటం సిఐ గమనించాడు.
 ‘‘యువర్ ఆనర్, రిమాండ్ కేసు’’ వినయంగా చెప్పాడు.
 ఆయన ిసీఐ ఇచ్చిన కాగితాన్ని చదివి తల ఊపి ముద్దాయి టి షర్ట్ మీద రాసింది చదివి మొహం ముడుచుకున్నాడు. దాని మీద వేలితో చూపించే బొమ్మ కింద ఇలా రాసి ఉంది.
 ‘యు నో హు డ్రైవ్స్ మీ క్రేజీ? యు డు.’
 ‘‘పేరు?’’ అడిగాడు.
 ‘‘మర్కట్.’’
 ‘‘తండ్రి పేరు?’’
 మర్కట్ అది చెప్పాక ఆయన గబగబ సీఐ ఇచ్చిన కాగితంలోది చదవసాగాడు.
 ‘‘తండ్రి పేరు... చెప్పుల వేన్... ఎట్సెట్రా ఎట్సెట్రా... ఈ సంతకం నీదేగా?’’ ఆయన అడిగాడు.
 ‘‘అవును సార్.’’
 ‘‘ఎవరి బలవంతం మీదా దీన్ని పెట్టలేదుగా?’’
 ‘‘బలవంతం మీద కాదు కాని అయిష్టంగానే పెట్టానండి.’’
 ‘‘అంటే నువ్వు నేరం చేనట్లేగా?’’
 ‘‘చేసినట్లే అనుకుంటానండి.’’
 ‘‘కోర్టులో అనుకోవడాలు ఉండవు. చేసినట్లేగా?’’
 ‘‘అది మీరు నిర్ణయించాలనుకుంటానండి.’’
 యమధర్మరాజు సిఐ వంక చూస్తూ అడిగాడు.
 ‘‘కట్టుకథల్ని నేను నమ్మను. ఇతను చెప్పిందానికి మీ దగ్గర ఋజువులు ఉన్నాయా?’’
 ‘‘ఒట్టు సర్. ఇది కట్టు కథ కాదు’’ వెంటనే మర్కట్ చెప్పాడు.
 ‘‘ఉన్నాయి సార్. వేన్ కేబిన్‌లో, బూట్ల మీద ఇతని వేలిముద్రలు ఉన్నాయి. సర్‌వెలైన్స్ టేప్స్‌లో కూడా ఇతను పడ్డాడు.’’
 ‘‘ఐతే నమ్ముతాను. సరే, ఓ పదిరోజులు రాసుకో’’ మెజిస్ట్రేట్ చెప్పాడు.
 ‘‘సర్?’’
 ‘‘పది రోజుల రిమాండ్ రాసుకో. సంతకం చేస్తాను’’ ఆయన తన నల్లటి గౌనుని విప్పుతూ చెప్పాడు.
 ‘‘మరీ ఎక్కువ సార్’’ మర్కట్ నసిగాడు.
 ‘‘కోర్టులో బేరాలుండవ్.’’
 ఆయన ‘జగమే మారినది మధురముగా ఈ వేళా’ ట్యూన్‌ని హమ్ చేయడం కొనసాగించాడు.
 ‘‘యువర్ ఆనర్ సర్ హుషారుగా ఉన్నారు. ఆయన గారి భార్యకి బాగైందనుకుంటా?’’ సిఐ బంట్రోతుని ప్రశ్నించాడు.
 ‘‘లేదు. గంట క్రితమే పోయిందని కబురొచ్చింది’’ బంట్రోతు జవాబు చెప్పాడు.
 మర్కట్‌తో పోలీన్ వేన్ జైలుకి బయలుదేరింది.
   
 జైలర్ మర్కట్‌ని అడిగాడు.
 ‘‘పేరు?’’
 ‘‘మర్కట్.’’
 ‘‘ఆ పేరు ఎవరు పెట్టారో?’’
 ‘‘ఇంకెవరు? మా నాన్న.’’
 ‘‘నువ్వీ రోజు ఇక్కడికి వచ్చిన రెండో కోతివి. మీ నాన్న పేరు?’’
 ‘‘శ్రీశైలం.’’
 ఆయన కోపంగా చూస్తూ అడిగాడు.
 ‘‘నేనడిగింది మీ నాన్న పేరు.’’
 ‘‘నేను చెప్పింది మా నాన్న పేరే సార్.’’
 ‘‘మీ నాన్న ఊరు?’’
 ‘‘శ్రీశైలం సర్.’’
 ‘‘నేనడిగింది మీ నాన్న ఊరు.’’
 ‘‘శ్రీశైలమే సార్.’’
 ఆయన మర్కట్ వంక అసహనంగా చూశాడు.
 ‘‘ఏం చదివావు?’’
 ‘‘ఇంజినీరింగ్ సార్.’’     
 ‘‘బ్రాంచ్?’’
 ‘‘ఇండస్ట్రియల్ ప్రొడక్షన్.’’
 ‘‘డిగ్రీ చేతికి వచ్చిందా?’’
 ‘‘పోస్ట్‌లో ఉంది సార్.’’
 ‘‘ప్రొడక్షన్ సిస్టమ్స్‌లో ఎంతొచ్చిందో?’’
 ‘‘ఎనభై ఆరు శాతం సార్.’’
 ‘‘బ్రైట్ స్టూడెంట్‌వే అన్నమాట. అందరిలా బేంక్ లోన్ తీసుకుని అమెరికాకి తగలడచ్చుగా?’’
 (మర్కట్ దొంగిలించిన ఫన్నీ వస్తువులు ఏవో ఊహించగలరా?)
 
 ఈ సీరియల్‌ని విడవకుండా చదివేవారికి..
 సీరియల్ పూర్తయ్యాక దీని మీద రాసి పంపే సద్విమర్శ లేదా విశ్లేషణల్లోంచి మూడింటిని ఎంపిక చేసి ప్రచురిస్తాం. వారికి రచయిత తలో రూ.500/- పంపుతారు.
 ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాలని మీ ఫోటోతోపాటు ఈ కింది చిరునామాలకి పంపండి.
 మీరు ఇరవై ఒకటో శతాబ్దపు పాఠకులైతే 3monkies.sakshi@gmail.comకి
 మీ ఫోటోని అటాచ్ చేస్తూ పంపండి. మీరు ఇంకా అక్కడే ఉంటే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో సహా
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,
 సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement