ఇది స్కూళ్లు రీ ఓపెన్ అయిన సమయం. పిల్లలందరూ కొత్త నోటు పుస్తకాలపై నేమ్ స్లిప్స్ అంటించుకుంటారు. కామిక్ బొమ్మలు, పూలు, జంతువులు... ఇలాంటి నేమ్‌స్లిప్స్ ఉంటాయి సాధారణంగా. కాని ఉండవల్లికి చెందిన నశీర్ అహ్మద్‌కు వినూత్నమైన ఆలోచన వచ్చింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న యోధుల నేమ్ స్లిప్స్‌ను తయారు చేస్తే అవి పిల్లలకు స్ఫూర్తినిస్తాయి కదా అనుకున్నారు. లక్షలాదిగా తయారు చేసి ఆయన ఉచితంగా పంచుతున్న నేమ్‌స్లిప్స్ పిల్లలకు తెలియని చరిత్ర తెలియచేస్తున్నాయి. కొత్త స్ఫూర్తిని నింపుతున్నాయి. నశీర్ అహ్మద్ (మొబైల్: 82476 77127 ) ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన కృషిని పంచుకున్నారు.
‘భారత స్వాతంత్య్రోద్యమంలో ఎంతోమంది ముస్లిం సమరయోధులు పాటుబడ్డారు... ‘జైహింద్’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు సృష్టించారు. చరిత్రలో వీరికి స్థానం కల్పించకపోవడంతో వారి త్యాగాలకు గుర్తింపులేకుండా పోయింది. సుభాష్ చంద్రబోస్‌కి ‘నేతాజీ’ అన్న బిరుదు ఇచ్చింది, అల్లూరి సీతారామరాజుకి తుపాకి పట్టడం నేర్చింది ముస్లింలే. ఇటువంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఈ తరం బాలలు తెలుసుకోవాలనే స్కూల్ బుక్స్ మీద అంటించుకునే నేమ్‌స్లిప్స్‌కు రూపకల్పన చేశాను.
ఇరవై ఏళ్లుగా కృషి
‘మాది గుంటూరు జిల్లా. గతంలో జర్నలిస్టుగా పనిచేశాను. స్వాతంత్య్రం కోసం పాటుబడిన ముస్లిం సమరయోధుల మీద గత 20 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నాను. తెలుగులో వీరి మీద రాసిన పుస్తకాలు నాతోనే ప్రారంభం అని నేను అనుకుంటాను. ముస్లింల త్యాగాల గురించి చాలామంది ముస్లింలకే తెలియదు. ఇక ముస్లిమేతర సోదరులకు తెలియడం అసంభవం. ఆ క్రమంలోనే వారి గురించిన సమాచారం ప్రజల్లోకి తీసుకురావాలనే సంకల్పం కలిగింది. పుస్తక రూపంలోను, ఆల్బమ్స్‌గాను రూపొందిస్తే అందరికీ త్వరగా చేరువవుతుందనే ఉద్దేశంతో పుస్తకాలుగా ప్రచురిస్తున్నాను. ముస్లిం యోధుల పేరు మీద పిల్లలకు పుస్తకాల మీద వేసుకునే లేబుల్స్ తయారుచేస్తున్నాను. వాటి మీద సమరయోధుల పేరు, ఆ కింద వారికి సంబంధించిన ఒక లైను రాసి ఉంటుంది. ఆ లేబుల్ వారి పుస్తకం మీద కనీసం మూడునాలుగు నెలలు ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ వారు ఆ బొమ్మ చూస్తూ ఉంటారు. పిల్లల మనసుల్లో ఈ బొమ్మలు ముద్రితమవుతాయి. పూర్వీకుల వివరాలు తెలుస్తాయి. అందువల్ల ఈ విధంగా రూపొందించాను. మొత్తం పది లక్షల స్టిక్కర్లు ఉచితంగా పంపిణీ చేయబోతున్నాను. ఇందుకు ఎంతోమంది మిత్రులు సహకరిస్తు న్నారు’.
13 పుస్తకాలు
‘1998 లో మొదటి పుస్తకం ‘భారత స్వాతంత్య్రోద్యమ ముస్లిం మహిళలు’ అనే పుస్తకం రచించి ప్రచురించాను. ఆ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. చాలామందికి ముస్లిం మహిళల గురించి ఒక అపోహ ఉంటుంది– వారు బురఖాల నుంచి బయటకు రాలేరని. ఆ అపోహను తునుమాడుతూ ఎంతోమంది మహిళలు భారతదేశం కోసం పాటుబడ్డారని ఆ పుస్తకంలో చెప్పాను. ఇప్పటివరకు మొత్తం 13 పుస్తకాలు రచించాను’.
ఫొటో ఎగ్జిబిషన్
‘పది సంవత్సరాల పాటు కష్టపడి మొత్తం 152 మంది ముస్లిం సమరయోధులకు సంబంధించిన ఫోటోలు సేకరించి వాటిని ఆల్బమ్‌గా తయారుచేశాను. నెల్లూరు జిల్లా గూడూరులో మొట్టమొదటి ప్రదర్శన పెట్టాను. ఆ తరవాత హైదరాబాద్, విజయవాడ, గుంటూరు... ప్రాంతాలలో ప్రదర్శించాక ఆర్థికంగా కష్టం కావడంతో, కొంతకాలం పాటు ఎగ్జిబిషన్ పెట్టడం మానేశాను. ఈలోగా పుణె నుంచి కె.జి పఠాన్ అనే వ్యక్తి పుణేలో ఎగ్జిబిషన్ పెడతామంటూ నన్ను సంప్రదించారు. నేను అంగీకరించాను. ఫొటోలను తెల్ల షీట్ మీద ప్రింటవుట్ తీసి, గోడ మీద నల్ల కర్టెన్ పెట్టి, దాని మీద ఈ షీట్‌ను అతికించారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆ ప్రదర్శన ఎంతో మంది వీక్షించారు. అలా నాకు వారు మార్గం చూపడంతో, చాలా తక్కువ ఖర్చుతో తిరిగి ప్రదర్శనలు ప్రారంభించాను. గుజరాత్, బిహార్, యు.పి, పంజాబ్, తమిళనాడులలో ఈ ఎగ్జిబిషన్లు నిర్వహించబోతున్నాను. విస్తృతంగా స్నేహాలు ఏర్పడటంతో అంతర్జాలం నాకు ఒక మంత్రంగా ఉపయోగపడింది’.
అతడు కూడా భగత్‌సింగే
‘మహారాష్ట్రకు చెందిన అష్ఫఖుల్లా ఖాన్ 20 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారి చేత ఉరి తీయబడ్డాడు. అతను జర్నలిస్టు. 14 సంవత్సరాల వయసులో పత్రిక నడిపాడు. ఆయన ‘మేరా వతన్ రహే సదా /మై రహూ యా నా రహూ’ అన్నాడు. ఇవాల్టి తరాలకు భగత్‌సింగ్ తెలుసు. అష్ఫఖుల్లా ఖాన్ గురించి ఎంతమందికి తెలుసు? సహాయ నిరాకరణోద్యమ సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేయమని పిలుపు ఇవ్వగానే మొట్టమొదటగా రాజీనామా చేసిన వ్యక్తి విజయవాడకు చెందిన గులాం మొయిద్దీన్ అని చాలామంది తెలుగువారికి తెలియదు. అల్లూరి సీతారామరాజుకి తుపాకీ పట్టడం నేర్పింది షేక్ సదరుల్లాఖాన్, అంతేకాదు ఆయనకు అండదండలుగా నిలిచింది సదరుల్లా ఖాన్. యూసఫ్ మెహర్ ఆలీ అనే ముస్లిం క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించాడు. ఈ సమాచారం చాలామందికి తెలియదు’.
ఆజాద్ హింద్ ఫౌజ్
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ పేరిట ముస్లిం పోరాట యోధులకు సంబంధించిన పుస్తకాన్ని 425 పేజీలతో తీసుకురాబోతున్నాను. నేతాజీ ఆధ్వర్యంలో 1941 నుంచి 1945 వరకు జరిగిన పోరాటంలో పాల్గొన్న ముస్లిం పోరాట యోధుల గురించి ఈ పుస్తకంలో చెప్పబోతున్నాను. అలాగే చరిత్ర సృష్టించిన రజియా సుల్తానా నుంచి సానియా మీర్జా వరకు గల ముస్లిం మహిళల సమాచారంతో మరో పుస్తకం తీసుకురాబోతున్నాను’.
మంచిని పెంచాలి
‘విస్మరించబడ్డ వీరులను తెలియచేయడం కాదు, ఈ దేశంలో ఉన్న విభజన సముదాయాల మధ్యసౌభ్రాతృత్వం, సామరస్యం, సహిష్ణుత, స్నేహభావం, సోదరభావం ‘మరింత పటిష్టం’ కావాలని నా లక్ష్యం. సదవగాహన, సద్భావన ఏర్పడాలి. బహుళ సంస్కృతి పరిఢవిల్లాలి. అన్ని మతాలలోను మంచిచెడులుంటాయి. ప్రేమను భ్రాతృత్వాన్ని పెంచుకోవడం మంచిది. అవి మంచిని చెబుతున్నాయి. నేను చేస్తున్నది ఒక వ్యవస్థతో కూడిన పని’.
అల్లూరి సీతారామరాజుకి తుపాకీ పట్టడం నేర్పింది షేక్ సదరుల్లాఖాన్, అంతేకాదు ఆయనకు అండదండలుగా నిలిచింది సదరుల్లా ఖాన్. యూసఫ్ మెహర్ ఆలీ అనే ముస్లిం క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించాడు. ఈ సమాచారం చాలామందికి తెలియదు.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment