నిలవకు విలువైన సూత్రాలు
ఇంటిప్స్
సాంబారు, రసం పొడులను డీప్ ఫ్రీజర్‌లో నిలవ ఉంచితే ఎక్కువ రోజులు వాసన పోకుండా తాజాగా ఉంటాయి. పచ్చళ్ళు, ఊరగాయల్లో స్టీల్ స్పూన్లు వాడకూడదు.కోడిగుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు టీ స్పూన్ల పాలు కలపాలి.ఉల్లిపాయలను గ్రైండ్ చేసిన వెంటనే వాడాలి, ఆలస్యమైతే చేదవుతుంది. గ్రైండ్ చేసే ముందు ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. వంకాయలను కోసిన వెంటనే ఒక స్పూను పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ల మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. పుట్టగొడుగులు వాతావరణంలోని తేమ ను పీల్చుకుని ఉంటాయి. వండేటప్పుడు కడిగితే మరింతగా నీటిని పీల్చుకుంటాయి కాబట్టి కడగకుండా శుభ్రమైన పేపర్‌తో కాని వస్త్రంతో కాని తుడవాలి.
బంగాళాదుంపలను వారం పాటు నిలవ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్‌ను ఉంచాలి.బెండకాయల జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూను పెరుగు కాని కలపాలి.కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తర్వాత కడగాలి. టొమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.