నేడు 9 అక్టోబర్, 1962
బుగాండా టు ఉగాండా
స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ ఉక్కుచెర నుంచి బయటికి వచ్చిన ఉగాండా స్వాతంత్య్రదేశంగా స్వేచ్ఛాపతకాన్ని ఎగరేసింది. 1894కు ముందు... ఉగాండా అనేది అనామక ప్రాంతం. ‘ఈ ప్రాంతాన్ని కాపాడడానికి వచ్చిన రక్షకులం మేము’ అంది బ్రిటన్. చరిత్ర మాత్రం ఈ సత్యాన్ని పెద్దగా ధ్రువీకరించలేదు. ఏది ఏమైనా... ఒక స్వాతంత్య్ర దేశంగా స్వేచ్ఛావాయువుల రుచి చూసిన ఈ ప్రాంతం- ‘హో! ఉగండా... ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ అని జాతీయగీతం పాడుకుంది.
పచ్చని కొండల అందాలు, తేయాకు తోటల ఘుమ ఘుమలు... ఉగాండా ఒక అద్భుత చిత్ర దృశ్యం. ‘బుగాండా రాజ్యం’ నుంచి ‘ఉగాండా’ పేరు వచ్చింది. దేశపాలకులు ‘ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ విశేషణంతోనే సంతృప్తిపడకుండా ఉండి ఉంటే, దేశ అభివృద్ధి కోసం కష్టపడి ముందస్తు ప్రణాళికలు వేసుకొని ఉంటే... ప్రపంచంలోని పేద దేశాలలో ఉగాండా ఒకటయ్యేది కాదు. సరే, ఈ ఆర్థిక పేదరికం మాట ఎలా ఉన్నా... ప్రకృతి సంపద, సాంస్కృతిక, పురా చారిత్రక సంపద... ఆ దేశాన్ని సంపద్వంతం చేస్తూనే ఉన్నాయి.