మహిళ ఆరోగ్యం మహాభాగ్యం | Today is International Women's Day | Sakshi
Sakshi News home page

మహిళ ఆరోగ్యం మహాభాగ్యం

Published Mon, Mar 7 2016 10:44 PM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

మహిళ ఆరోగ్యం  మహాభాగ్యం - Sakshi

మహిళ ఆరోగ్యం మహాభాగ్యం

నేడు అంతర్జాతీయ  మహిళా  దినోత్సవం
 
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని నానుడి.
కానీ మహిళ ఆరోగ్యం బాగుంటే...
ఫ్యామిలీ ఆరోగ్యమంతా బాగుంటుంది.
ఫ్యామిలీ బాగుంటే... సమాజం బాగుంటుంది.
సమాజం బాగుంటేనే... ప్రగతిశీలమౌతుంది.

 
పిండం ఇక మరింత పదిలం
ఇప్పుడు వైద్యరంగంలో అసమాన పురోగతి ఉంది. గైనకాలజిస్ట్‌లు, ఆబ్‌స్టెట్రీషియన్స్, రోజుల పిల్లలను చూసే నియోనేటాలజిస్ట్‌లకూ, పిల్లల గుండె వైద్య నిపుణులైన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు, జెనెటిక్ నిపుణుల నైపుణ్యాలను కలబోతగా అభివృద్ధి చెందిన అత్యంత అడ్వాన్స్‌డ్ వైద్య విభాగం ఫీటల్ మెడిసిన్. అంతకు ముందు సాధ్యం కాని ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇది. ఎవరెవరు సంప్రదించాలి: సాధారణంగా ఈ కింద సూచించిన సమస్యలు ఉన్నవారు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌లను సంప్రదించవచ్చు.  సాధారణ గర్భధారణ వయసు అంటే 35 కంటే ఎక్కువ వయసున్న మహిళలు   దగ్గరి సంబంధాలు/మేనరికాల్లో పెళ్లి చేసుకున్న దంపతులు  కుటుంబంలో ఎవరికైనా జన్యుపరమైన సమస్యలు, పుట్టుకతో అవకరాలు ఉన్నవారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందు (ప్రీ కన్సెప్షనల్ / జెనెటిక్ కౌన్సెలింగ్)  తరచూ గర్భస్రావం అవుతున్నప్పుడు  గర్భస్థ పిండంలోనే ఏవైనా లోపాలు వచ్చాయని కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారణ చేసినప్పుడు  పిండంలో కవలలు / ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నారని తెలిసినప్పుడు  కాబోయే తల్లులకు రుబెల్లా, హెర్పిస్, చికెన్‌పాక్స్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు  గర్భధారణ సమయంలో తీసుకోకూడని మందులు పొరబాటున ఏవైనా వాడినప్పుడు  రక్తం గ్రూప్ నెగెటివ్ ఉన్న మహిళలు... ఇక్కడ పేర్కొన్న వారు పిండానికీ అవసరమైన చికిత్సలు చేయించాలి. సాధారణంగా కౌన్సెలింగ్, మందులతో పాటు కొన్ని సందర్భాల్లో పిండానికే శస్త్రచికిత్స చేయడం వంటి ప్రక్రియలు అవలంబిస్తారు.

కొన్ని పరీక్షలు: గర్భం దాల్చిన 11-14 వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత మళ్లీ 18-20 వారాల్లో చేయించాలి.      గర్భం దాల్చాక మొదట 11-14 వారాల్లో ‘న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ (ఎన్‌టీ) స్కాన్ చేస్తారు. ఈ పరీక్షలో క్రోమోజోమల్ లోపాలు ఏవైనా ఉన్నా, పిండం గుండెలో లోపాలున్నా, జన్యుపరమైన వ్యాధులు ఉన్నా తెలుస్తాయి. ఈ పరీక్ష వల్ల జన్యుపరమైన వ్యాధులేవీ లేవని నిర్ధారణ చేయడం కోసం మరిన్ని అడ్వాన్స్‌డ్ క్రోమోజోమల్ పరీక్షలు అవసరమా అన్న విషయం తెలుస్తుంది  గర్భం దాల్చాక 12వ వారంలో చేసే స్కానింగ్‌తో అనెన్‌సెఫాలి వంటి మెదడుకు సంబంధించిన కొన్ని మేజర్ సమస్యలు, కాళ్లూ చేతుల్లో లోపాలేవైనా ఉన్నాయా అన్న విషయాలను తెలుసుకోవచ్చు  18 - 20 వారాల్లో చేసే పరీక్ష ద్వారా చాలా ఉపయోగకరమైన అంశాలను  తెలుసుకోవచ్చు. శిశువులో సరిదిద్దలేని లోపాలు ఉన్నప్పుడు తదనుగుణంగా నిర్ణయం తీసుకోడానికి ఈ దశలో చేసే స్కానింగ్ ఉపయోగపడుతుంది. ఈ దశలో చేసే పరీక్షను ‘మిడ్ ట్రైమిస్టర్ అనామలీ స్కాన్’ అంటారు. ఇందులో పిండం తల నుంచి కాలి వరకు అన్ని అవయవాలను చూడటం సాధ్యమవుతుంది. ఈ దశలో చేసే స్కాన్ వల్లనే పిండం అన్ని రకాలా నార్మల్ ఉందన్న భరోసా తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. మిడ్ ట్రైమిస్టర్ అనామలీ స్కాన్ ద్వారా క్రోమోజోమ్ లోపాలు ఏవైనా ఉంటే వాటిని,  పిండంలో ఎదుగుదల లోపాల వంటివి ఈ దశలో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. పిండం తల చిన్నగా ఉండటం (మైక్రో సెఫాలీ), పిండం ఎముకలు, అస్థిసంబంధమైన లోపాలు (నాన్ లీథల్ స్కెలెటల్ డిస్‌ప్లేసియా), గుండె, రక్తప్రసరణ వ్యవస్థలో ఎక్కడైనా అడ్డంకులు ఉన్నాయా అన్న విషయం తెలుసుకునేందుకూ స్కానింగ్‌లు తోడ్పడతాయి. మన దేశంలో చాలా సందర్భాల్లో గర్భస్రావాలు 5వ నెలలో (20వ వారంలో) చేయిస్తుంటారు. పిండంలోని గుండె లోపాలేవీ లేవని తెలుసుకోవడం కోసం పిండానికి చేసే గుండె పరీక్ష అయిన ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ అవసరమా లేదా అన్న సంగతి అప్పుడే తేటతెల్లమవుతుంది.

చికిత్సలు ఎలా:  కవలలు, అంతకంటే ఎక్కువ శిశువులు గర్భంలో పెరుగుతూ... అవన్నీ ఒకే బొడ్డుతాడు మీద పెరుగుతుంటే ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ (టీటీటీఎఎస్) వంటి కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో లేజర్ చికిత్సలు అవసరం కావచ్చు  రక్తం గ్రూపు నెగెటివ్ ఉన్న మహిళలలో పిండానికి రక్తహీనత వస్తే... తొమ్మిదో నెలలోపు పిండానికే రక్తమార్పిడి చేస్తారు  గుండెలోని వాల్వ్‌లు సన్నబడిపోయినా లేదా పిండం అభివృద్ధి చెందే దశలో అవయవాలు పెరిగేటప్పుడు ఒక అవయవంలోకి మరో అవయవం దూరిపోయే హెర్నియా  (కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా) వంటి కేసుల్లో అవసరమైతే పిండానికే శస్త్రచికిత్స అందిస్తారు  ఇక పిండం పెరుగుదల సమయంలో వివిధ దశల్లో దాన్ని పరిశీలించడానికి డాప్లర్ పరీక్షలు చేస్తారు  ఈ అన్ని స్కానింగ్ చేయించిన తర్వాత కూడా బిడ్డకు కలగబోయే కొన్ని అవకరాలను ముందుగానే పసిగట్టడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని పరిమితులు ఉన్నాయని గ్రహించాలి. బిడ్డ పుట్టాకే అవి తెలుస్తాయి. అయితే ఈ విధమైన అడ్వాన్సెస్ ద్వారా అవగాహన పెంపొందించుకొని, వాటిని ఉపయోగించుకోవడం వల్ల గతంలోని ఎన్నో సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
 
ప్రెగ్నెన్సీలో ఫిట్స్... మెడిసిన్స్‌తో చెక్

మహిళల్లో నరాలకు సంబంధించిన సమస్యలు గర్భధా రణకు ముందే ఉండవచ్చు, లేదా మారవచ్చు లేదా గర్భం ధరించినప్పుడే కనిపించవచ్చు. గర్భధారణ సమయంలో కొన్ని మగతగా ఉండటం, నొప్పి, మాటిమాటికీ మూత్రవిసర్జన వంటి కనిపించవచ్చు. గర్భధారణ సమయంలో ఆమె ఆరోగ్య చరిత్ర తెలియడం అవసరం. ఇది ఆమెకు చికిత్స, తగిన సలహాలూ, సూచనలు అందించడానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో  పక్షవాతం, ఫిట్స్ (ఎపిలెప్సీ), తలనొప్పి, మల్టిపుల్ స్క్లిరోసిస్ వంటి పెయిన్ సిండ్రోమ్స్ వంటివి సాధారణం. తమ గర్భధారణ తమపైనా, కడుపులో ఉన్న బిడ్డపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఫిట్స్‌తో బాధపడే మహిళలు అడిగే ప్రశ్న. అందుకే వాళ్లకు కౌన్సెలింగ్ అవసరం. వాళ్లకు ఆ టైమ్‌లో ఫిట్స్ రాకుండా చూడటం ప్రధానం. ఫిట్స్‌ను తగ్గించే ఏఈడీ వంటి మందులు వాడుతూ ఉన్న వారు కూడా తమకు ఆరోగ్యపరమైన సమస్యలూ, సామాజిక సమస్యలు ఏవైనా వస్తాయేయోనని ఆందోళన పడుతుంటారు. వాల్‌ప్రోయేట్ (వీపీఏ) వంటి కొన్ని యాంటీఎపిలెప్టిక్ మందులు వాడేవారిలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కనిపించవచ్చు. గర్భధారణ సమయంలో కనిపించే వికారం (నాసియా) వంటి అంశాల కారణంగా కొందరు తమ మందులను తగ్గించడమో లేదా పూర్తిగా ఆపేయడమో చేస్తుంటారు. ఇంకొందరు అవి పిండానికి హానిచేస్తాయేమోనని ఆందోళన చెందుతుంటారు. మందులు తీసుకుంటున్నప్పటికీ మరికొందరు మహిళల్లో నిద్రలేమి వల్ల ఫిట్స్ తిరగబెట్టవచ్చు. అందుకే డాక్టర్ సలహా మేరకు ఆ మందులనూ, తగిన మోతాదుల్లో వాడాలి. గర్భం దాల్చిన వారిలో వచ్చే ఫిట్స్ అటు తల్లికి, ఇటు పిండానికీ అపాయకరంగా పరిణమించవచ్చు.  అందుకే ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. కొన్ని మందులు పిండం పెరుగుదల, వికాసంపై తీవ్ర దుష్ర్పభావం చూపవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో అలాంటి మందులను నిలిపివేసి, తల్లికీ-బిడ్డకూ సురక్షితమైన మందులనే వాడాలి.
డాక్టర్ పద్మ వీరపనేని
న్యూరో స్ట్రోక్ స్పెషలిస్ట్ అండ్ సీనియర్ న్యూరాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్
కొండాపూర్, హైదరాబాద్
 
నోరు... నో ప్రాబ్లమ్
మహిళల్లో నోటి ఆరోగ్యం హార్మోన్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని హార్మోన్ల వృద్ధి వల్ల నోటి ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. బాలికలు పదకొండో ఏటి నుంచి కౌమార ప్రాయంలోకి అడుగుపెడతారు. ఈ సమయంలో వారిలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఆ టైమ్‌లో యువతుల్లో కొన్ని చిగుర్ల సమస్యలు రావచ్చు. ఆ సమయంలో వస్తాయి కాబట్టి వాటిని ‘ప్యూబర్టీ జింజివైటిస్’ అంటారు. కౌమార బాలికల్లో ప్రొవెటెల్లా ఇంటర్మీడియా అనే బ్యాక్టీరియా వృద్ధి ఎక్కువై చిగుర్ల సమస్యలకు కారణమవుతాయి.  యాంటీబ్యాక్టీరియల్ మౌత్‌వాష్ వాడటం, కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇక యువతుల్లో తాము తినడం వల్ల బరువు పెరుగుతున్నామేమో అన్న ఆందోళన ఉంటుంది. దాంతో అతిగా డైటింగ్ చేసే వారికి అనొరెక్సియా నర్వోజా, తిన్నది వాంతి చేసుకునే వారికి బులీమియా నర్వోజా అనే మానసిక అనారోగ్యాలు రావచ్చు. ఈ రెండు కండిషన్స్‌లోనూ కడుపులో స్రవించే గ్యాస్ట్రిక్ యాసిడ్స్ నోట్లోకి కూడా వచ్చి దంతాల్లోని డెంటిన్ అనే పదార్థాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చు. ఇక గర్భవతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల చిగుర్లు ఉబ్బినట్లుగా, బ్రష్ చేస్తున్నప్పుడు రక్తస్రావం కావచ్చు. దీనికి మొదటి ట్రైమిస్టర్‌లో చికిత్స సాధ్యం కాదు. కానీ రెండో ట్రైమిస్టర్‌లో జింజివల్ ట్యూమర్స్ రాకుండానూ, పన్నుకూ పన్నుకూ మధ్యలో ఉండే ఎముక అరగకుండా చికిత్స చేయవచ్చు.
డాక్టర్ ప్రత్యూష
హెచ్‌ఓడీ, ఓరల్ మెడిసిన్
న- మాక్సీలో ఫేషియల్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్స్
సికింద్రాబాద్
 
 
కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మహిళల్లో ఎక్కువ. సర్వైకల్ క్యాన్సర్ స్త్రీలకే వస్తుంది.

సర్వికల్ క్యాన్సర్: సర్వికల్ క్యాన్సర్‌ను  ముందుగానే గుర్తించవచ్చు. దీనికి కారణం... క్యాన్సర్ వచ్చే ముందర ఉండే ప్రీ-క్యాన్సర్ దశ దీనికి చాలా ఎక్కువ.  దాంతో నిరోధించడానికి అవకాశాలు కూడా ఎక్కువే. దానికోసం పాప్‌స్మియర్ అనే పరీక్ష చేయించుకోవాలి.
 పరీక్షలు ఇలా:  ప్రతి మహిళా  25 ఏళ్లు దాటాక ఒకసారి పరీక్ష చేయించాలి. ప్రీ-క్యాన్సర్ ఏదీ కనిపించకపోతే అప్పట్నుంచి ప్రతి మూడేళ్లకోమారు ఈ పరీక్ష చేయించుకోవాలి. సర్వికల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుందని కనుక్కున్నారు. దానికి వ్యాక్సిన్‌నూ  రూపొందించారు. అయితే దీన్ని వ్యాధి రాకమునుపే తీసుకోవాలి. మనదేశంలో ఈ వ్యాధి విస్తృతి దృష్ట్యా అమ్మాయిలు ఈ వ్యాక్సిన్‌ను 10-15 ఏళ్లప్పుడే తీసుకుంటే మంచిది.రొమ్ము క్యాన్సర్‌కూ వయస్సుకూ దగ్గరి సంబంధం ఉంది.  అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయన్నమాట.

రిస్క్ గ్రూప్:  కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు, రక్తసంబంధీకులలో ఈ వ్యాధి వచ్చిన వారు ఉంటే  పిల్లలు లేని వాళ్లలో  మొదటిసారి గర్భం ముప్ఫయి ఏళ్లు దాటాక వస్తే  ఐదేళ్లకు పైబడి హార్మోనల్ చికిత్స తీసుకుంటూ ఉంటే...  వీళ్లకు ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అలాంటివాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిస్క్ గ్రూపులు చేయించాల్సిన మూడు పరీక్షలు చేయించుకోవాలి  మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో పరీక్ష చేసుకోవాలి. దాంతో వాళ్లకు తమ రొమ్ము ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన పెరుగుతుంది. ఫలితంగా అందులో ఏ చిన్నమార్పు వచ్చినా  అర్థమైపోతుంది. దాంతో ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరితంగా గుర్తించగలరు. దాన్ని మీ డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు.
 
మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ పరీక్షలు ఎలాగంటే...  ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి  ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి  40 ఏళ్లు దాటక 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి  50 ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది  ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లకు డాక్టర్ సలహా మేరకు ఇంకా త్వరితంగానే అవసరం కావచ్చు.
 
డా. సుశీలా నారాయణన్
కన్సల్టెంట్ బ్రెస్ట్ సర్జన్
ఒమేగా హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
యూరినరీ ఇన్ఫెక్షన్స్... సొల్యూషన్స్
మూత్రంలో ఇన్ఫెక్షన్స్ మహిళల్లో చాలా తరచుగా వస్తుంటాయి. వారిలో సాధారణ యూరినరీ సమస్యలివి...  మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం  కొత్తగా పెళ్లయిన మహిళల్లో హనీమూన్ సిస్టయిటిస్ అనే సమస్యతో పాటు, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణం  మధ్యవయసు మహిళల్లో కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ మామూలే. నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే హార్మోన్ల లోపమే దీనికి కారణం. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ లోపం వల్ల మూత్రనాళంలోని ఇంటర్నల్ లైనింగ్‌పొర సన్నబడే అవకాశం ఉంది. ఫలితంగా బ్యాక్టీరియా పేరుకుపోవడం ఎక్కువై ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

నిర్ధారణ పరీక్షలు:  మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చేవారికి సాధారణంగా చేసే పరీక్షలే కాకుండా మూత్రావయవాలలో ఏమైనా మార్పులు వచ్చేయేమో తెలుసుకోడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొన్ని ప్రత్యేకమైన ఎక్స్-రే (ఐవీయూ, ఎంసీయూజీ లాంటివి) పరీక్షలు చేయాల్సి ఉంటుంది  మూత్రవిసర్జక వ్యవస్థలో టీబీ ఉంటే దాని నిర్ధారణ కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేయాల్సి ఉంటుంది.
 ఇన్ఫెక్షన్‌కు చికిత్స: సాధారణంగా వచ్చే సిస్టైటిస్‌కి మూడు రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే దీర్ఘకాలం పాటు చికిత్స (లాంగ్ టర్మ్ సప్రెసెంట్ థెరపీ) అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలలో రాళ్లను తొలగించడం కోసం కొన్ని నాన్‌సర్జికల్, సర్జికల్ ప్రొసిజర్స్ అవసరం కావచ్చు.
డా. జోత్స్న గుత్తికొండ
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
స్టార్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
స్కిన్... అవుతుంది షైన్
మన చర్మం ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...  డర్మటాలజిస్ట్ సూచించిన జంటిల్ ఫేస్‌వాష్‌తో గానీ లేదా సోప్-ఫ్రీ క్లెన్సింగ్ లోషన్ తోగానీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి  చర్మం పొడిగా ఉండేవారు  క్రమం తప్పకుండా షియాబటర్, కోకొవా బటర్, ప్రొపిలీన్ గ్లైకాల్, గ్లిజరిన్, ఆలో బటర్, ఈడీటీఏ వంటి కాంబినేషన్స్‌తో ఉన్న మాయిష్ఛరైజర్‌ను రాసుకోవాలి  మాయిశ్చరైజింగ్ చేసుకున్న తర్వాత 40 కంటే ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్న మంచి సన్‌స్క్రీన్‌ను చర్మానికి రాసుకోవాలి. అదే కాస్తంత జిడ్డు చర్మం ఉన్నవారు కూడా 40 కంటే ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవచ్చు. అయితే అది డ్రై-టచ్ సన్‌స్క్రీన్ అయి ఉండాలి  పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉన్నవారు ప్రదిరోజూ రాత్రివేళ కోజిక్ యాసిడ్, లికోరిక్, టెట్రాహైడ్రోకర్క్యుమిన్, ఆర్బ్యుటిన్, విటమిన్-సి ఉన్న క్రీములు ప్రతిరోజూ రాత్రివేళ రాసుకోవాలి  మొటిమలుఉన్నవారు  క్లిండామైసిన్ అండ్ ఎడాపలిన్ కాంబినేషన్ ఉన్న క్రీమును ప్రతిరోజూ రాత్రివేళ రాసుకోవాలి  ముఖం మీద నల్లమచ్చలు, ముడతలు వస్తున్నవారు ప్రతిరోజూ రాత్రివేళ విటమిన్-సి, రెటినాల్, హైలురానిక్ యాసిడ్ ఉన్న క్రీములు రాసుకోవాలి  ముఖం విచారంగా మారినప్పుడు, నవ్వినప్పుడు ముడుతలు రావడం, నుదుటిమీద గీతల వంటి ‘డైనమిక్ రింకిల్స్’  ఉన్నవారికి బొటాక్స్ చికిత్స మేలు చేస్తుంది..
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చీబౌలీ
హైదరాబాద్
 
మెనోపాజ్ చింత వద్దు
రుతుక్రమం ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. చాలా మంది మహిళల్లో దీనిపై ఆందోళన ఉంటుంది. మెనోపాజ్‌పై అపోహలు తొలగించుకునేలా అవగాహన  కోసం  వైద్య నిపుణుల సూచనలివి... రుతుక్రమ దశ నుంచి మెనోపాజ్‌లోకి ప్రవేశించే మధ్య దశ (ట్రాన్సిషన్ పీరియడ్) అందరిలోనూ ఒకేలా ఉండదు.  మెనోపాజ్ సమయంలో...  సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. మహిళలు తీసుకునే ఆహారంలో పాలకూర వంటి ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, క్యారట్, బెర్రీస్ వంటి పండ్లు, పీచుపదార్థాలు లభ్యమయ్యే కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని చాలా తగ్గించాలి  బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి  ఒంటి నుంచి వేడి ఆవిరులు రావడం (హాట్ ఫ్లషెస్) అన్నది రుతుక్రమం ఆగిపోబోయే ముందు కనిపించే ఒక లక్షణం. మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడం, కాఫీ వంటి పానీయాలు హాట్ ఫ్లషెస్‌ను ప్రేరేపిస్తాయి. అందుకే వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి  క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారం, విటమిన్-డి లభ్యమయ్యే పదార్థాలు తీసుకోవడం వల్ల మెనోపాజ్ తర్వాత వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి  ప్రశాంతంగా ఉంచే యోగా, ధ్యానం వంటి ప్రక్రియలను పాటించాలి  మహిళల్లో ఉండే ఒత్తిడి వల్ల వాళ్లకు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు మెనోపాజ్‌కు ముందు మరింత ఎక్కువ. దాంతో పాటు క్షణక్షణానికీ భావోద్వేగాలు మారిపోతూ ఉండటం, తగినంత నిద్రలేకపోవడం, బరువు పెరగడం వంటివి కనిపించవచ్చు. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు మెదడులో చోటు చేసుకునే రసాయనాల సమతౌల్యం తప్పడం వల్ల కావచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
డాక్టర్ భాగ్యలక్ష్మి
సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రిషియన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
 
గుండె జబ్బులు... గుబులొద్దు
మహిళల్లో గఒక వయసు వరకూ గుండెజబ్బుల నుంచి స్వాభావిక రక్షణ లభిస్తుంది. దీనికి కారణం ప్రతి నెలా రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్. దీని వల్ల మహిళల గుండెకూ, రక్తనాళాలకూ రక్షణ ఉంటుంది. కాబట్టి రుతుక్రమం ఆగిన వారితో పోలిస్తే... రుతుక్రమం అయ్యే మహిళలకు (మెనోపాజ్ దశకు చేరని వారిలో) గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ డయాబెటిస్ వచ్చినప్పుడు ఈ సహజ రక్షణ తొలగిపోతుంది.  అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి.
 లక్షణాలు:  అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం, ఊపిరి ఆడకపోవడం, ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్టలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటివి కనిపించవచ్చు.
 
నివారణ:   మహిళల్లో వ్యాయామం చేయడం మనదేశంలో చాలా చాలా తక్కువ. రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు నడక, మెల్లగా జాగింగ్ చేయడం వంటి వ్యాయామాలు మహిళల గుండెజబ్బులను సహజంగానే నిరోధిస్తాయి  ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించవచ్చు. (ఒక నెలకు ఒక మనిషి అరలీటరు నూనె కంటే ఎక్కువగా తీసుకోకుండా ఉండటం అన్నది ఆరోగ్యకరమైన పరిమితి అని గుర్తుంచుకోండి)  రక్తపోటు, డయాబెటిస్ కొలెస్ట్రాల్ పాళ్లు పెరగడం వంటివి ఉంటే వాటికి తగిన చికిత్స చేయించుకుంటూ... అవి ఉన్నవారు గుండెజబ్బులు ఉన్నట్లుగానే పరిగణించి జాగ్రత్తలు తీసుకోవడం మంచి నివారణ చర్య.
డాక్టర్ శ్రీదేవి
సీనియర్ కార్డియాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
పీరియడ్స్ టైమ్‌లో... ఫుడ్
రుతుస్రావం సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్న యువతులు, మహిళలు తీసుకోవాల్సిన ఆహారం గురించి అవగాహన పెంచుకునేందుకు ఈ విషయాలు చదవండి.  మీరు శాకాహారులైతే మీ రోజువారీ ఆహారంలోనే తీసుకోండి. దానితో పాటు మీ ఆహారంలో తాజాగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీడీలు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే  పల్లీపట్టీలు), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండేలా చూసుకోండి  మాంసాహారులైతే మీ ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తో పాటు... లివర్‌ను ప్రత్యేకంగా తీసుకోండి  మాంసాహారులైనా, శాకాహారులైనా కోడిగుడ్డు, పాలు తప్పనిసరి. ఇకపై ప్రతినెలా రక్తం కోల్పోతుండటం వల్ల హీమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది. అందుకే రక్తహీనత రాకుండా ఐరన్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉండటం వల్ల పై ఆహారాన్ని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్‌హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే, అదనంగా విటమిన్-సి కావాలి. కాబట్టి శాకాహార పదార్థాలతో పాటు విటమిన్-సి ఉండే తాజా పండ్లు... జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటి వాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి  కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా పరిమితంగా తీసుకోవాలి.  బేకరీ ఐటమ్స్, కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.
సుజాతా స్టీఫెన్
న్యూట్రిషనిస్ట్
మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్
మాదాపూర్
హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement