నీటి చుక్క మనిషి జీవితానికి చుక్కాని
సందర్భం
భిన్నత్వంలో ఏకత్వం... మన నినాదం. ప్రకృతి ఇచ్చిన భిన్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయులంతా కలిసి జీవించడమే మన జాతీయత. సగటు భారతీయ గ్రామీణ మహిళ జీవితంలో ఒక రోజు... ఎలా గడుస్తోంది అని గమనిస్తే మంచినీటి సేకరణలో గడిచిపోతున్న గంటలే ఎక్కువ. నీటిలభ్యత కొరవడిందా లేక లభించిన నీటిని పరిరక్షించుకోవాలనే స్పృహ కొరవడిందా అంటే రెండోదే అసలైన సమాధానం అంటున్నారు నీటి వనరుల మీద అధ్యయనం చేస్తున్న నిపుణులు.
వర్షపునీటిని భద్రపరుచుకోవడంలో ఆధునిక మానవుడు విఫలమవుతూండడమే ఇందుకు కారణం. ప్రపంచం అంతా పర్యావరణ పరిరక్షణ కోసం ఎలుగెత్తి చాటాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతి పచ్చగా ఉంటే పర్యావరణం చల్లగా ఉంటుంది. చెట్టును కొట్టేసి ఎత్తై భవనం కట్టడానికి, పాతాళంలోని నీటిని వెలికి తీసి వాటర్ టేబుల్‌ని చిన్నాభిన్నం చేయడానికి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న నేటి మానవుడిని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తూనే ఉంది.
పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఏడాదికో నినాదంతో ప్రజల్ని చైతన్యవంతం చేస్తోంది. ‘గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టి సముద్రాలు పొంగకుండా నివారిద్దాం, భూగోళాన్ని ముంచెత్తే ప్రమాదాన్ని అరికడదాం’ అని గగ్గోలు పెడుతూనే ఉంది. కరుగుతున్న మంచుకొండల్ని కరగకుండా ఆపడంతోపాటు ఇంకిపోతున్న నీటి చుక్కను పదిలంగా కాపాడుకోవడమూ అవసరమే. ఈ నేపథ్యంలో ఆధునిక విజ్ఞానాన్ని ప్రతి వర్షపు చుక్కనీ పదిలపరుచుకోవడానికి వినియోగించమని సూచిస్తున్నారు జాతీయ వర్షపునీటి నిర్వహణ సంస్థ డెరైక్టర్ ఎ.కె. మెహ్రా.
దేశంలో ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటిని అందించే ప్రయత్నాలు పూర్తి కానేలేదు. ఈ లోపే బిందెడు నీళ్లు దొరికితే చాలనే పరిస్థితి తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంట తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలో నీటిమట్టాన్ని పెంచాలని (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ) ఆయన గుర్తు చేస్తున్నారు.
(రేపుప్రపంచ పర్యావరణ దినోత్సవం)