మన కళ్లముందే మరో అద్భుత ప్రపంచం | Tomorrow's World Tourism Day | Sakshi
Sakshi News home page

మన కళ్లముందే మరో అద్భుత ప్రపంచం

Published Thu, Sep 25 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

Tomorrow's World Tourism Day

రేపు ప్రపంచ పర్యాటక దినం
 
ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయనేది ఒక జాబితా మాత్రమే! కానీ కంటిని కట్టడి చేసేవి, విస్మయపరిచే వింతలు భూమి నిండా ఉన్నాయి. అలాంటి వాటిని కళ్లారా వీక్షించినప్పుడు జన్మ ధన్యమైందని భావిస్తుంటాం. ఇక ఆ తర్వాత జీవితం లేకపోయినా పర్వాలేదనిపించే అనుభూతిలో మునిగిపోతాం. వందల జలపాతాలు కలిసికట్టుగా ఒకేసారి దుమికే అద్భుతం, వేల అడుగుల లోతున గల గుహలోకి వేలాడుతూ వెళ్లే ధైర్యం, భూగర్భంలో ప్రయాణ మార్గాలు, ప్రశాంతతకు కొండంత ప్రతిమ, ఆధ్యాత్మికతకు అలనాటి వైభవం.. చూసినకొద్దీ చూడాలనిపించేవి. ఒక్కసారి చూస్తే చాలు అనిపించే అలాంటి కొన్ని అద్భుతాల వివరాలు... ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా ఈ వారం...
 
లోతైన అద్భుతం: క్రుబేరా గుహ!

గుహల సౌందర్యం, వాటి అద్భుతం గురించి మనకు తెలియంది కాదు. మనదగ్గర బొర్రాగుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు.. ఎన్నో లెక్కపెట్టి మరీ ఈ అద్భుతాల గురించి వివరిస్తారు. కానీ, ప్రపంచంలోనే అతి లోతైన గుహగా పేరుపొందిన క్రుబేరా గుహ 2,197 మీటర్లు అంటే సుమారు 7,208 అడుగుల లోతు వరకు ఉంటుంది. భూమి మీద అత్యంత లోతైన గుహగా పేరొందిన క్రుబేరా పై భాగంలో నీరు ఉంటుంది. భూ పొరలలో వచ్చిన మార్పుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. జార్జియా దేశంలోని అబ్ఖజియా ప్రదేశంలో 1960లో ఈ గుహలను గుర్తించారు.
 
రష్యా నుంచి అబ్ఖజియా ప్రదేశం దగ్గర. అందుకని మాస్కో చేరుకొని అక్కడ నుంచి విమానమార్గం లేదా బస్సుల ద్వారా అబ్ఖజియా ప్రాంతానికి చేరుకోవచ్చు. సెప్టెంబర్-అక్టోబర్ మాసపు రోజులు ఇక్కడ చల్లగానూ, వాతావరణం అనువుగానూ ఉంటుంది.
 
భూగర్భ ప్రయాణం: లండన్

మన దగ్గర చిన్నా పెద్ద సబ్ వే (భూగర్భ దారులు)లలో నుంచి కాలినడకన అటూ ఇటూ వెళ్లే ఉంటారు. వాటికే అబ్బురపడి ఉంటారు. లండన్‌లో భూగర్భ ప్రయాణం చేస్తే మనిషి తెలివికి ‘ఔరా’ అనిపించకమానదు. ఇక్కడి భూగర్భ మెట్రో రైలు సిస్టమ్ ప్రపంచంలోనే అత్యద్భుతమైనదిగా పేరొందింది. లండన్‌లో అతి ప్రాచీన భూగర్భ మెట్రో రైలు వ్యవస్థ 1863లోనే ప్రారంభమైంది. నేటికి లండన్‌లో 270 అండర్‌గ్రౌండ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కి 260 మంది, మొత్తంగా 19,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భూగర్భ మార్గంలో 4,134 స్టేషన్లు, 426 ఎస్కలేటర్లు, 164 లిఫ్ట్‌లు ఉన్నాయి. ట్యూబ్‌లలో రైలు వేగం 33 కి.మీ. అత్యంత రద్దీగల స్టేషన్‌గా ‘వాటర్ లూ’ పేరొందింది. ఇక్కడ ప్రతి మూడు గంటల వ్యవధిలో 57,000 వేల మంది ప్రయాణీకులు తమ తమ గమ్యస్థానాలకు ఈ భూగర్భదారుల గుండానే ప్రయాణమవుతుంటారు.
 
మార్చ్-మే నెలలో వసంత రుతువు చివరి రోజులు. సెప్టెంబర్ - నవంబర్‌లోనూ వాతావరణం అనువుగా ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది.
 
కొండంత ఎత్తు: లేషన్ జెయింట్ బుద్ధ

అమెరికాలోని లిబర్టీ ఆఫ్ స్టాట్యూ మనకు కొట్టిన పిండి. జపాన్‌లోని బుద్ధుని ప్రతిమ, మాస్కోలో పీటర్ స్టాట్యూ ఎత్తును చూసి మనిషి అపారజ్ఞానానికి అబ్బురపడుతూనే ఉన్నాం. సుఖాసనంలో కూర్చున్నట్టుగా ఉన్న ఈ బుద్ధుని ప్రతిమ కోసం ఏకంగా కొండ రూపునే మార్చారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా పేరొందిన ఆ దేశంలోనే ‘ఎమీ’ పర్వత రాయిని క్రీ.శ. 713 వ సంవత్సరంలో ఇలా బుద్ధుని ప్రతిమగా తొలిచారు. ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ రాయిగా పేరొందింది ఇది. ప్రాచీన సంపదకు ఆనవాలుగా నిలిచన ఈ ప్రాంతాన్ని పరిరక్షించడానికి యునెస్కో 1996లో హెరిటేజ్ సైట్‌లో చేర్చింది. బుద్ధుని పాదాల చెంతకు చేరుకోవాలంటే పడవలలో ఇక్కడి క్వింగీ నదిని దాటాలి.
 
వేసవిలో ‘ఎమీ’ పర్వతం మీద వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. చలికాలంలో ఆహ్లాదంగా ఉంటంది. హోటళ్లు, విమానయాన టికెట్లు ఈ కాలంలో ఆఫర్లు ప్రకటిస్తాయి. అక్టోబర్ - డిసెంబర్ వరకు అత్యల్ప ఉష్ణోగతలు నమోదవుతాయి.
 
జలపాతాల పెద్ద: ఇగుఅజు
 
నయాగరా, విక్టోరియా జలపాతాల అద్భుతాన్ని తిలకించకపోయినా వినే ఉంటారు. కానీ ‘ఇగుఅజు’ జలపాతం గురించి విన్నారా? ‘ఇగూజు’ అని కూడా పిలిచే ఈ జలపాతం బ్రెజిల్, అర్జెంటీనా దేశాల మధ్యన ఉంది. రెండు దేశాల ప్రజలకు గర్వకారణంగా నిలిచే ఈ జలపాతం దాదాపు 275 చిన్నా పెద్ద జలపాతాల కలయికతో విస్మయపరుస్తుంటుంది. 82 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వైశాల్యం గల ఈ జలపాతం సెకనుకు 1000 ఘనపు మీటర్ల వేగంతో దుముకుతుంది. పర్యాటకులు బ్రెజిల్ వెళ్లినా, అర్జెంటినా వెళ్లినా ఈ జలపాతాన్ని రెండు విధాలుగా సందర్శించవచ్చు. బ్రెజిల్ వైపు జలపాతానికి చేరువలో వెళ్లేందుకు వంతెనలు, జెట్ బోట్స్, హెలికాఫ్టర్ సదుపాయాలు ఉంటే, అదే అర్జెంటీనా వైపుగా వెళితే బ్రెజిల్ కన్నా మరింత దగ్గరగా వంతెన మార్గాలు ఉన్నాయి. జలపాతం చుట్టుపక్కల దాదాపు రెండు వేల ఔషధ మొక్కలు, 400 రకరకాల పక్షులు, 70 రకాల క్షీరదాలను గుర్తించారు. ఈ అద్భుతానికి గులాము అయిన యునెస్కో 1986లో వారసత్వ సంపద జాబితాలో చేర్చింది.
 
డిసెంబర్-మార్చ్ వరకు ‘ఇగూజు’లో వేసవి సమయం. జూన్ - ఆగస్టు వరకు చలికాలం. అందుకే పర్యాటకులు ఈ సమయంలో జలపాత వీక్షణకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలు ఇక్కడి ఉష్ణోగ్రతలు అత్యంత అనుకూలంగా 28 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటాయి.
 
చారిత్రక వైభవం: అంకోర్ వాట్!

ప్రపంచంలోనే గొప్ప చారిత్రక కట్టడంగా తాజ్‌మహల్ పేరొందింది. దీని తర్వాత ప్రాచీన వైభవాన్ని కళ్లకు కట్టే కట్టడం ‘అంకోర్ వాట్’ దేవాలయం. కాంబోడియా దేశంలో గల ఈ కట్టడం తొమ్మిదవ శతాబ్దంలో మొదలై 15వ శతాబ్దం వరకు ఖెమెర్ రాజుల కాలంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 400 చదరపు కిలోమీటర్లలో దేవాలయ సముదాయాలను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం పూర్తవడానికి దాదాపు 600 ఏళ్లు పట్టడంతో ఆయా కాలాలకు తగ్గ మార్పులతో విభిన్న శైలులతో ఆకట్టుకుంటుంది. ఖెమెర్ రాచ వైభవం ఈ దేవాలయ గోడల మీద అణువణువునా... నాటి సాంస్కృతిక సంప్రదాయ శైలులను అడుగడుగునా చూడవచ్చు.
 
ఆగ్నేయాసియాలో ఉండే కాంబోడియా మన దేశానికి సుమారు మూడు వేల కి.మీ.దూరంలో ఉంది. విమాన ప్రయాణం రాను పోను టిక్కెట్ ధరలు 50 వేల రూపాయలకు పైగా ఉంటుంది. రాబోయే రెండు నెలలలో వర్షాలు తగ్గి, వాతావరణం పొడిగా ఉండే ఈ  నెలలు ఇక్కడి దేవాలయాల సందర్శనకు అనువైనవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement