పదహారు రోజుల ఉద్యమ ప్రణాళిక | United Nations November 25 is the Day To End Violence Against Women | Sakshi
Sakshi News home page

పదహారు రోజుల ఉద్యమ ప్రణాళిక

Published Mon, Nov 25 2019 3:33 AM | Last Updated on Mon, Nov 25 2019 3:33 AM

 United Nations November 25 is the Day To End Violence Against Women - Sakshi

ఐక్యరాజ్య సమితి నవంబర్‌ 25ని ‘మహిళలపై హింసను నిర్మూలించే దినం’ గా పాటిస్తోంది. ఈ రోజు మొదలు.. ప్రపంచ మానవహక్కుల దినమైన డిసెంబర్‌ 10 వరకు 16 రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏటా పిలుపునిస్తోంది.

ఆధునిక చైతన్యాన్ని అందిపుచ్చుకొన్న మహిళాప్రపంచం ‘మీ టూ’ లాంటి ఉద్యమాలతో గొంతుపెకిలించుకొని తమపై జరుగుతున్న అత్యాచారాలనూ, లైంగిక వేధింపులను సవాల్‌ చేస్తూ బాహ్యప్రపంచంలోకి దూసుకొచ్చారు. అయితే మీటూ లాంటి పోరాటాలు సముద్రంలో నీటి బొట్టులాంటివేనన్నది గ్రహించాలి. ఈ సాంకేతిక ప్రపంచాన్ని చేరుకోవడానికి అవకాశమేలేని అట్టడుగు వర్గాల్లో లక్షలాది మంది స్త్రీలు అనేక రకాల లైంగిక వేధింపులకూ, హింసకూ గురవుతూనే ఉన్నారు.

పనిలో, గనిలో, కార్ఖానాల్లో పరిశ్రమించే స్త్రీలు మొదలుకొని ధనిక, పేద, కుల, మత, ప్రాంత తారతమ్యాలకు అతీతంగా స్త్రీజాతి ఎదుర్కొంటోన్న పురుషాధిపత్య హింస నుంచి బయటపడాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని ప్రపంచదేశాలకు తొలిసారి 1993లో పిలుపును ఇచ్చింది. ఆ క్రమంలోనే మహిళలపై హింసను నిర్మూలించే పదహారు రోజుల మహిళా ఉద్యమ ప్రణాళికను రూపొందించింది.

బాధితులెవరు?
ఇప్పటికింకా సాధారణ సమాజంలో  మానవహక్కుల్లో భాగంగా గుర్తింపునకు నోచుకోని వర్గాలు ట్రాన్స్‌జెండర్, లెస్బియన్లు, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్, వలసవెళ్లిన స్త్రీలు, మహిళా శరణార్థులు, మైనారిటీలు, హెచ్‌ఐవీ బాధితులైన బాలికలు, స్త్రీలూ, శారీరక వైకల్యం కలిగిన స్పెషల్లీ చాలెంజ్డ్‌ చిన్నారులు అత్యధికంగా లైంగిక వేధింపులకు గురవుతున్న వర్గాలుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.  

‘ఆరెంజ్‌ ద వరల్డ్‌’ థీమ్‌
అంతర్జాతీయంగా మహిళలపై హింసా వ్యతిరేక దినం నవంబర్‌ 25ని ప్రతి యేటా ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తారు. ఈ యేడాది 2019ని ‘‘ఆరెంజ్‌ ద వరల్డ్‌: జెనరేషన్‌ ఈక్వాలిటీ స్టాండ్స్‌ ఎగెనెస్ట్‌ వుమన్‌’ జరుపుకుంటున్నారు. నవతరం.. అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తోందనీ, సమానత్వాన్ని కాంక్షిస్తోందనీ దీని ఉద్దేశం. మహిళా విముక్తి సంకేతానికి గుర్తుగా  ‘ఆరెంజ్‌ ద వరల్‌’్డ అని జగమంతా ప్రతిధ్వనించేలా ఆ రోజు మహిళా శక్తి నినదిస్తుంది. ఈ గొప్ప కార్యానికి నారింజరంగుని ఎంపిక చేసుకోవడానికి కారణం ఆ రంగు ఉజ్వల భవిష్యత్తుకి, హింసారహిత సమాజానికీ ప్రతీక. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసల నుంచి విముక్తికి ఈ రంగు సంఘీభావ చిహ్నం.
– అరుణ అత్తలూరి

యూఎన్‌ డిక్లరేషన్‌
శారీరకంగా, లైంగికంగా, మానసికంగా మహిళలపై జరుగుతోన్న లింగ వివక్షతో కూడిన అన్ని రకాల హింసను అరికట్టాల్సిందిగా 1993లో తొలిసారి ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ప్రకటన చేసింది. అందులో భాగంగానే ప్రతి యేటా నవంబర్‌ 25ని ప్రపంచ దేశాల్లోని మహిళలు హింసా నిర్మూలనా దినంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడా చర్చకు కూడా నోచుకోని స్త్రీల పునరుత్పత్తి హక్కులు మొదలుకొని, విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమానావకాశాలూ, శ్రామిక మహిళలు, వివక్షలపై పదహారు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రమాద ఘంటికలు
►ప్రతి ముగ్గురు మహిళలు లేదా బాలికలు ఒకరు తమ జీవితకాలంలో అత్యంత దగ్గరిగా ఉన్న సహచర పురుషుల కారణంగా భౌతిక, లైంగిక దాడులకు గురవుతున్నారు.
►వివాహిత, లేదా సహజీవనం చేస్తోన్న వారిలో  కేవలం 52 శాతం మంది మహిళలు మాత్రమే లైంగిక సంబంధాల విషయంలోనూ, గర్భధారణ, ఆరోగ్య విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు.
►ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75 కోట్ల మంది మహిళలు, బాలికలు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరిగాయి. 20 కోట్ల మంది మహిళలు, బాలికలు లైంగిక కోర్కెలను అణచివేసే క్రమంలో భాగంగా ‘జెనిటల్‌ మ్యుటిలేషన్‌’కు  గురయ్యారు.
►2017లో ప్రపంచవ్యాప్తంగా హత్యకుగురైన ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరు తన స్వంత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే.
► ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా బాధితుల్లో 71 శాతం మంది మహిళలు బాలికలే ఉన్నారు. వీరిలో ప్రతి నలుగురిలో ముగ్గురు బాధితులు లైంగికంగా హింసకు గురయ్యారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement