దట్టించిన మందుగుండు | Uri Actor Vicky Kaushal To Star In Anees Bazmee Film | Sakshi
Sakshi News home page

దట్టించిన మందుగుండు

Published Sat, Oct 26 2019 2:23 AM | Last Updated on Sat, Oct 26 2019 2:23 AM

Uri Actor Vicky Kaushal To Star In Anees Bazmee Film - Sakshi

నటనలో ప్రతిభ ఉంటే రూపం రెండవస్థానంలోకి నెట్టబడుతుంది. ఓంపురి, నసిరుద్దీన్‌షా వంటి వారు ప్రతిభతో రాణించారు. రూపంతో కాదు. విక్కీకౌశల్‌ చూడ్డానికి ‘గ్లామరస్‌’గా కనిపించడు. కాని అతడు ఏ పాత్ర వేసినా ఆ పాత్రలా మారిపోతాడు. కెమెరా ముందు అతడు దట్టించిన మందు గుండులా పేలతాడు. గురి తాకుతాడు.

2016 సెప్టెంబర్‌ 18న ‘ఉరి అటాక్స్‌’ జరిగాయి. బారాముల్లా జిల్లాలో వాస్తవాధీన రేఖకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ‘ఉరి’ అనే ప్రదేశంలోని భారతీయ సైనిక బలగాల మీద ఉగ్రదాడి జరిగింది. నలుగురు ఉగ్రవాదులు మూడు నిమిషాల వ్యవధిలో 17 గ్రెనేడ్‌లను సైనిక గుడారాల మీద విసరడంతో 17 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 30 మంది సైనికులు గాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా భారత్‌ చేతులు ముడుచుకుని కూచోదలుచుకోలేదు.

ఇందుకు కారణమైన ఉగ్ర శిబిరాల మీద ప్రతీకారం తీర్చుకోదలిచింది. దానికి మార్గంగా ‘సర్జికల్‌ స్ట్రయిక్‌’ను ఎంచుకుంది. ఉరి దాడి జరిగిన పదకొండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్‌ 29న భారతదళాలు రహస్యంగా పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి అక్కడి ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టాయి. ఇదంతా మిలట్రీ కార్యక్రమం. సామాన్య ప్రజలకు ఇది ఎలా జరిగి ఉంటుందో ఊహకు అందే విషయం కాదు. కాని జరిగింది దేశ ప్రజలకు చూపాలనే ఉద్దేశ్యంతో ‘ఉరి: ద సర్జికల్‌ స్ట్రయిక్‌’ పేరుతో సినిమా నిర్మితమైంది.

జనవరి 2019న విడుదలైంది. 25 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్టయ్యి 342 కోట్లు సంపాదించింది. ఇంత ముఖ్యమైన సినిమాకు వెన్నముకలా నిలిచి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన నటుడు విక్కీ కౌశల్‌. సినిమాలో మేజర్‌ విహాన్‌ సింగ్‌ షేర్‌గిల్‌గా నటించి అతడు దేశంలోని కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న విక్కీ ప్రయాణం కూడా ఒక సైనికుడి పోరాటంలాంటిదని చెప్పక తప్పదు.

స్టంట్‌మెన్‌ కుమారుడు
విక్కీ కౌశల్‌ తాత తండ్రులది హర్యాణ. విక్కీ వాళ్ల తాత హర్యాణలో ఒక చిన్న కిరాణాషాపు నడిపేవాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక విక్కీ తండ్రి శ్యామ్‌ కౌశల్‌ ముంబై వచ్చి సినీ పరిశ్రమలో స్టంట్‌మెన్‌గా చేరాడు. ఆ తర్వాత స్టంట్‌ కోఆర్డనేనటర్‌గా ఎదిగాడు. తండ్రి సినిమా రంగంలో ఉన్నా ఇంటికి ఆ వాతావరణాన్ని తెచ్చేవాడు కాదు. ఉన్న ఇద్దరు కొడుకులు బాగా చదువుకోవాలని అనుకునేవాడు. పెద్ద కొడుకు విక్కీ చదువులో బాగున్నాడు కనుక ఏదైనా కాలేజ్‌లో ప్రొఫెసర్‌ అయితే నెలనెలా దిగుల్లేని జీతం అందుతుందని అతని ఆలోచన.

కాని ముంబై రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బి.టెక్‌ చేరాక ఈ చదువు తనకు పనికి రాదని అనిపించింది. చదువుతూనే ఒకసారి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి వెళ్లి చూసి ఇలాంటి ఉద్యోగం కూడా తనకు పనికి రాదని అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి స్టేజ్‌ మీద నాటకాలు వేయడం, పాటలు పాడటం, గెంతడం చేసేవాడు కనుక నటుడు కావాలని అనిపించింది. బి.టెక్‌ను పూర్తి చేసి తండ్రికి ఈ విషయం చెప్తే వారించలేదుకానీ నీ ఇష్టం అన్నాడు.

శిక్షణ తీసుకొని...
నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నాక విక్కీ చేసిన మొదటి పని ముంబైలోని ఒక శిక్షణాలయంలో నటన తర్ఫీదు కోసం చేరడం. ‘ఆ శిక్షణా సమయంలో నేను అందుకు పనికి వస్తానో రానో తేలిపోతుంది. ఆ తర్వాత కావాలంటే ఉద్యోగం చేసుకోవచ్చు’   అనుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ శిక్షణ పని చేసింది. అది అతణ్ణి నటనకు మరింత ఆకర్షితుణ్ణి చేసింది. ఆ శిక్షణాలయం నుంచి బయటకు వచ్చాక దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ దగ్గర ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సినిమాలో మనోజ్‌ బాజ్‌పాయ్, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, పీయుష్‌ మిశ్రా లాంటి గొప్ప నటులు పని చేశారు. అయితే వారంతా థియేటర్‌ నుంచి వచ్చినవారు. మంచి నటులు కావాలంటే నాటకానుభవం అవసరం అని విక్కీకి అనిపించింది.

ఆ సినిమా అయ్యాక అతడు థియేటర్‌ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించాడు. దాదాపు నాలుగేళ్లు అతడికి ఏ అవకాశమూ రాలేదు. కాని ప్రతిభకు వైఫల్యం ఉండదు. అపజయమూ ఉండదు. కాకపోతే విజయం రాకడ కాస్త ఆలస్యం కావచ్చు అంతే. ‘మసాన్‌’తో... ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసెపూర్‌’కు మరో సహాయ దర్శకుడిగా పని చేసిన మన హైదరాబాద్‌ కుర్రాడు నీరజ్‌ ఘేవన్‌ వారణాసి ఘాట్‌లలో పని చేసే కాటికాపరుల జీవితాలపై సినిమా తీయదలిచాడు. ఆ సినిమా పేరు ‘మసాన్‌’. అందులో హీరోగా విక్కీని ఎంచుకోవడంతో విక్కీ కౌశల దశ తిరిగింది. చదువుకున్న కాటికాపరిగా నటించేందుకు విక్కీ మూడు వారాల ముందే వారణాసి చేరుకుని అక్కడి జీవితాలను అధ్యయనం చేశాడు.

‘మసాన్‌’ (శ్మశానం) విడుదలయ్యాక అతడికి విపరీతమైన పేరు వచ్చింది. అవార్డులు వచ్చాయి. ‘నటనను’ సీరియస్‌గా పరిగణించే చాలామంది నటులు అతడిని గుర్తించారు. సంజు... సంజయ్‌ దత్‌ ఆటోబయోగ్రఫీగా వచ్చిన ‘సంజు’లో సంజయ్‌ దత్‌ స్నేహితుడు ‘కమ్లేష్‌’గా నటించి విక్కీ కౌశల్‌ పాపులర్‌ సినిమాలలో కూడా తన ముద్ర వేయగలడని నిరూపించాడు. సంజు విజయంలో రణ్‌బీర్‌ కపూర్‌కు ఎంత పేరు వచ్చిందో విక్కీకి కూడా అంతే పేరు వచ్చింది. ఆ తర్వాత ఉరితో అతడి కెరీర్‌ ఒక పదేళ్ల వరకూ ఢోకా లేనట్టుగా స్థిరపడింది.

వినమ్ర ప్రయాణం... విక్కీ కౌశల్‌ తన సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయడం కంటే దానినొక బాధ్యతగా తీసుకుంటున్నాడు. మంచి మంచి పాత్రలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాడు. కరణ్‌ జోహర్‌ నిర్మాణంలో వస్తున్న ‘భూత్‌’ అతని రాబోయే సినిమా. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ‘సర్దార్‌ ఉధమ్‌సింగ్‌’ బయోపిక్‌లో కూడా అతడు నటించబోతున్నాడు. విక్కీ నుంచి మనం మరిన్ని మంచి సినిమాలు ఆశించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement