
వరుణ్ ధావన్
అతనొచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. వచ్చాక చూడొచ్చేమో అని డౌట్ పడ్డారు. నాలుగైదు సినిమాల తర్వాత చూడాల్సిందే అనుకున్నారు. మరో రెండు హిట్స్ తర్వాత సత్తా చూపించేవాడు అని అంగీకరించారు. ఇప్పుడు అతను చేస్తుంటే పెద్ద పెద్ద హీరోలు కూడా చూస్తూ ఉండిపోతున్నారు. వరుణ్ ధావన్ విజయం అనూహ్యం. అందుకే అతని అభిమానులకు అతడొక దైవం.
సినిమా రంగంలో కొన్ని వింతలు జరుగుతుంటాయి. అమెరికా వెళ్లిపోయి వ్యాపారం చేసుకోవాలనుకున్న కరణ్ జొహర్ అనుకోకుండా మిత్రుడు ఆదిత్య చోప్రా కోరిక మేరకు ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు అసిస్టెంట్‌గా మారాడు. కరణ్ జొహర్ సినిమా ఫీల్డ్ నుంచే వచ్చినా సినిమాలకు పని చేయడం ఇదే కొత్త. సెట్‌లో ఒకటి రెండురోజులు పని చేశాక మనవల్ల కాదులే అనుకుని వెళ్లిపోబోతూ ఉంటే ఇతను చెక్కేసేలా ఉన్నాడని కనిపెట్టిన ఆదిత్యా చోప్రా ‘షారూక్ ఖాన్ కాస్ట్యూమ్స్ చూడు’ అని ఆదేశించాడు. కరణ్ జొహర్ తెచ్చి చూపించిన కాస్ట్యూమ్స్ షారూక్‌కు బాగా నచ్చాయి. ‘నువ్వు నాతో పని చేయి’ అని ఎంకరేజ్ చేశాడు. అంతేకాదు ‘నీ సినిమాకు డేట్స్ ఇస్తాను’ అని కూడా అన్నాడు. అలా కరణ్ జొహర్ ‘కుచ్‌కుచ్ హోతాహై’ సినిమాకు డైరెక్టర్ అయ్యాడు.
అదే కరణ్ జొహర్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ తీస్తున్నప్పుడు వరుణ్ ధావన్ ఆ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశాడు. వరుణ్ ధావన్ మామూలు కుర్రవాడు కాదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి శ్రీమంతుడిగా మారిన దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు. తండ్రిలాగే డైరెక్టర్ కావాలా లేదంటే హీరో కావాలా అని ఆలోచిస్తున్నవాడు. ‘అయితే నా దగ్గర పని సరిగ్గా నేర్చుకోవు. వేరేవాళ్ల దగ్గర నేర్చుకో’ అని తండ్రి కరణ్ జొహర్ దగ్గర పెట్టాడు. వరుణ్ ధావన్ ప్రాధమికంగా డాన్సర్. మిమిక్రీ చాలా బాగా వచ్చు. మిథున్ చక్రవర్తిని బాగా ఇమిటేట్ చేస్తాడు. ఈ టాలెంట్‌నీ సెట్‌లో అతడు కష్టపడి పని చేస్తున్న పద్ధతిని చూసిన షారూక్ ఒకరోజు పిలిచి ‘నీకు డైరెక్షన్ కంటే యాక్టింగే బెటర్’ అని సలహా ఇచ్చాడు. కొన్నాళ్లకు వరుణ్ ధావన్ యాక్టర్ అయ్యాడు. అంతేనా? షారూక్‌ఖాన్ పక్కన ‘దిల్‌వాలే’లో సరిజోడుగా నటించాడు. సినిమాల్లో మనం చూస్తుండగానే స్టూపర్‌స్టార్స్ పక్కన సూపర్‌స్టార్స్ చేరుతారు. వరుణ్ ధావన్ అలా చేరినవాడు.
స్టూడెంట్ నం.1
షారూక్ ఖాన్ భార్య గౌరీఖాన్, కరణ్ జొహర్ కలిసి కొత్తవాళ్లతో చిన్నసినిమాగా ‘స్టూడెంట్ నం.1’ (2012) తీద్దామని అనుకున్నప్పుడు ఆలియాభట్ కాకుండా కరణ్ జొహర్‌కు గుర్తొచ్చిన రెండు పేర్లు వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా. ఇద్దరూ అతని దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసినవారే. నటులుగా మారుదామని ప్రయత్నిస్తున్నవారే. వారిని తీసుకున్నాడు కరణ్‌జొహర్. తండ్రి ప్రేమ కోసం పెనుగులాడుతూ ప్రియురాలి ప్రేమ దక్కుతుందా లేదా అనే అభద్రత పొందుతూ సతమతమయ్యే పాత్రలో వరుణ్ ధావన్ ఈ సినిమాతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. అప్పటికి అతని వయసు 25 సంవత్సరాలే కావడం పూర్తిగా లేతదనం పోకపోవడంతో సినిమా పెద్ద హిట్ అయినా అవకాశాలు రాలేదు. అప్పుడు వరుణ్ ధావన్ తెలుగులో హిట్ అయిన ‘కందిరీగ’ సినిమా రీమేక్ ‘మై తేరా హూ’ (2014)లో నటించాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. అదే సంవత్సరం రిలీజ్ అయిన ‘హప్టీ శర్మాకి దుల్హనియా’ కూడా హిట్ అయ్యింది. కాని అతనికి దేశం మొత్తం గమనించాల్సిన హిట్ అవసరం ఉంది. అది ‘బద్‌లా పూర్’ రూపంలో వచ్చింది.
బద్‌లాపూర్
తనకు అన్యాయం చేసినవారు జైలుకు వెళ్లడంతో సాధారణంగా సినిమాలు ముగుస్తుంటాయి. కాని ‘బద్‌లాపూర్’ (2105) అలా కాదు. తన భార్య, కొడుకు చావుకు కారణమైన అందరిపై వరుణ్‌ధావన్ ‘బద్‌లా’ (పగ) తీర్చుకోవాలనుకుంటాడు. వాళ్లలో ఒక నిందితుడు జైలుకు వెళితే అతడు రిలీజై వచ్చే 15 ఏళ్ల వరకు ఎదురు చూస్తాడు. 15 ఏళ్ల తర్వాత అతణ్ణి పట్టుకొని, అతడితోపాటు తన వాళ్ల చావుకు కారణమైన మరో వ్యక్తిని చంపి పగ తీర్చుకునేదాకా నిద్రపోడు. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ 16 కోట్లతో ఈ సినిమా తీస్తే 80 కోట్లు వచ్చాయి. ఈ సినిమాతో హీరోగానే కాదు నటుడిగా కూడా వరుణ్ ధావన్ ఎదిగాడు. ఇతగాడు అల్లరి చిల్లరిగా ఈ ఫీల్డ్‌లోకి రాలేదని గట్టిగా నిలబడటానికే వచ్చాడని ప్రేక్షకులు, బాలీవుడ్ ఒకేసారి అర్థం చేసుకుంది. బద్‌లాపూర్ వరుణ్ ధావన్ కెరీర్‌ని స్థిరపరిచింది.
మంచి సినిమాల వరుస
ఒకసారి నటుడు ఎదిగాక బాలీవుడ్ ఆ ఎదిగిన స్థాయికి కథలు తయారు చేయడం మొదలుపెడుతుంది. వరుణ్ ధావన్ తాను కేవలం డిష్యూం డిష్యూం హీరోగా ఉండిపోదలుచుకోలేదని పెర్‌ఫార్మెన్స్ ఉన్న పాత్రలు చేయదలుచుకున్నానని సంకేతాలు ఇచ్చాక మంచి కథలతో వచ్చింది. ‘బద్‌రీనాథ్ కి దుల్హనియా’ (2017), ‘అక్టోబర్’ (2018), ‘సూయి ధాగా’ (2018) ఇవన్నీ వరుణ్ ధావన్‌కు గట్టి పేరు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు చేసిన ‘జుడ్వా’, ‘ఏబిసిడి2’, ‘డిష్యూం’ అతని కమర్షియల్ ఇమేజ్‌ను కాపాడాయి. భారీ కాస్ట్యూమ్ డ్రామా ‘కళంక్’ నిరాశ పరిచినా తాజాగా విడుదలైన ‘స్ట్రీట్ డాన్సర్’ ట్రైలర్ మరో సక్సెస్‌ను హామీ ఇచ్చేలా ఉంది. తన తండ్రి తీసిన ‘కూలీ నంబర్ 1’ సినిమాను వరుణ్ ధావన్ రీమేక్ చేస్తున్నాడు.
వరుణ్ ధావన్‌కు ప్రేమ వ్యవహారాలు బాగానే ఉన్నాయని బాలీవుడ్ అంటూ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌తో అతని ఎఫైర్ బాహాటంగా కొనసాగింది. అయితే ఆలియా భట్‌తో కూడా ప్రేమ నడుస్తోందనే గాసిప్ ఉంది. మాస్, క్లాస్ రెండూ చేయదగ్గ హీరోగా వరుణ్‌ధావన్ ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకడిగా ఉన్నాడు. గత సంవత్సరం ఫోర్బ్స్ ప్రకటించిన వందమంది ఇండియా సెలబ్రిటీల లిస్ట్‌లో అతడు 15 స్థానంలో ఉన్నాడు. రాబోయే రోజులు అతనివే అనడంలో సందేహం లేదు.
– సాక్షి ఫీచర్స్ డెస్క్