వరుణ్ గ్రోవర్ స్క్రీన్ రైటర్, పాటల రచయిత, థింకర్. వీటన్నిటినీ మించి హాస్య రసజ్ఞుడు. వయసు 40 దాకా ఉంటుంది. అయితే ఇప్పుడు హాస్యం కోసం అతడు ఈ పని చేయలేదు. ఏ పని?! వరుణ్ తన చేతి గోళ్లకు రెండు రకాల రంగును వేసుకుని ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దాన్ని చూసిన మగాళ్లంతా అతడిని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ‘పురుషుడివి అయుండీ ఈ వేషాలు ఏంటి?’ అని అతడిపై గత ఇరవై నాలుగు గంటలుగా ఏకబిగిన సెటైర్లు వేస్తూనే ఉన్నారు. కొందరైతే ‘మగజాతికే తలవంపులు తెచ్చావు’ అని దుయ్యబడుతున్నారు.
ఆ మాటలకు వరుణ్ బాధపడ్డాడు. ఆశ్చర్యపోయాడు. ఆవేదన చెందాడు. థింకర్ కదా.. తాత్వికంగా కూడా ఆలోచించే ఉంటాడు. చివరికి ఈ ట్రోలింగ్ చేస్తున్న వాళ్లకు తనూ ఓ ప్రశ్న వేశాడు. ‘‘గోళ్ల రంగు వేసుకుంటే నా చెయ్యి నాకే చూడముచ్చటగా, అందంగా అనిపించింది. అందుకే షేర్ చేసుకున్నాను. దీన్నొక జెండర్ ఇష్యూగా చూస్తారెందుకు?’’ అన్నాడు. ‘నీకు చూడముచ్చటగా ఉంటే సరిపోయిందా..’ అని మళ్లీ ఆయనపై దాడి ప్రారంభమయింది. ఇప్పట్లో అది ముగిసేట్టు లేదు మరి.
పేదరికంలో మరణించిన క్యాబరే క్వీన్
నలుపు, తెలుపు చిత్రాల కాలం నాటి ప్రేక్షకుల్ని రెప్ప వెయ్యనివ్వకుండా చేసిన తొలి బెంగాలీ క్యాబరే డ్యాన్సర్ ఆరితీదాస్ గురువారం కోల్‌కతాలో కన్ను మూశారు. ఆమె వయసు 77 ఏళ్లు. మిస్ షెఫాలీగా ప్రసిద్ధురాలైన ఆరతి.. డ్యాన్సర్ మాత్రమే కాదు. విలక్షణ నటి కూడా. సత్యజిత్ రే ‘ప్రతిధ్వని’, ‘సీమబద్ధ’ చిత్రాలలో ఆమె నటించారు. ఇటీవలే ఆమె ఆత్మకథ ‘సంధ్యా రతేర్ షెఫాలీ’.. పుస్తక రూపంలో విడుదలైంది. తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుంచి శరణార్థులుగా పశ్చిమ బెంగాల్ వచ్చిన కుటుంబంలోని ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఆరతీదాస్ ఆఖరు అమ్మాయి. పన్నెండేళ్ల వయసులోనే ఇల్లు గడవడానికి అప్పట్లో ప్రముఖులు వచ్చిపోతుండే ‘ఫిర్పో’ రెస్టారెంట్‌లో డాన్స్ చేశారు ఆరతి. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. పేదరికంలో జీవితాన్ని ప్రారంభించిన ఆరతి పేదరికంలోనే అంతిమశ్వాస వదిలారు. చివరి రోజుల్లో తన అనారోగ్య సమస్యలకు మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఆమె ఉన్నారని బెంగాలీ పత్రికలు రాశాయి.
Comments
Please login to add a commentAdd a comment