దిగంబర యోగికి ఆడంబర నివాళి
నేనొక పెద్ద హీరోకి అభిమానిని. నా హీరో కామెడీ చేయకూడదు - యాక్షనే చెయ్యాలి. నా హీరో కంట తడి పెట్టకూడదు - కొట్టాలి. నా హీరో సినిమాలో వేరే ఆర్టిస్టులు ఏం చెయ్యకూడదు, అన్ని డైలాగులూ హీరోనే మాట్లాడాలి. అందరి మాటలూ హీరోనే చెప్పాలి. నా హీరో సిక్స్‌ప్యాక్ బాడీ చూపించకూడదు. ఎప్పుడూ నిండుగా బట్టలేసుకునే కనిపించాలి. నా హీరో టీవీల్లో కనపడ కూడదు. ఆలస్యమైనా వెండితెర మీదే కనిపించాలి. నా హీరో నాకు నచ్చే సినిమాలే చెయ్యాలి. ఆయనకిష్టమైనవి చేయకూడదు.
నేను హీరోకి అభిమానినా? దురభిమానినా? వేరే హీరోకి కోవర్టునా? నా అభిమానంతో నా హీరో చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేసేవాడినా?
నా చిన్నప్పట్నుంచి ఘంటసాల, ఎస్పీబీ పాటల కన్నా నేనెక్కువ సార్లు పాడుకున్న పద్యాలు నా సాంస్కృతిక, సారస్వత హీరో వేమన గారివే. ఆయనకి బట్టల్లేవన్న సంగతి నిన్నే ఎవరో రీసెర్చ్ చేసి టీవీ చానళ్లలో గొడవ చేస్తే తెలిసింది. నలభై రెండేళ్ళుగా నా కళ్లు మూసుకుని పోయాయని చాలా బాధపడ్డా. ఇది ఉపోద్ఘాతం.
అసలు ఘాతం ఏంటంటే-
వేమన జీవితచరిత్ర. పద్యాల సారాంశం. అవి సమాజానికి బోధించే నైతిక విలువల ప్రస్తావన అన్నీ అందరూ ఏళ్ల తరబడి చెప్పేశాక, ఇంక చెప్పడానికి ఏమీలేదని, ఏమీ మిగల్లేదని కొందరు ఆయనకి బట్టలు తొడగాలని తీర్మానించడం... అందుకు చర్యగా ఆయన విగ్రహం మీదున్న ఆయన పేరుని చెరిపేయడం... ఆయన విగ్రహాన్ని స్త్రీలు చూడలేక అసభ్యంగా భావిస్తున్నారని బాధపడడం... జోక్ ఆఫ్ ది మిలీనియమ్. సారీ టు సే. పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ. ఇదొక చర్చ- దీనికింత రచ్చ. బాగా బతికిన జమీందారు పెదకోమటి వేమారెడ్డి స్త్రీలోలుడై ఆస్తిపాస్తులు పోగొట్టుకుని ప్రేమంటే మైకమనీ, జనన మరణాల మధ్య మానవ సంబంధాలు భ్రమలనీ తెలుసుకుని, లుంబిని మహర్షి శుశ్రూషలో యోగ సిద్ధుడైన వ్యక్తి యోగి వేమనగా అవతరించారు. ఆ యోగసిద్ధిలో ఆయన గ్రహించిన జ్ఞానం - బట్టలు, బాహ్యవేషధారణ మనిషి ఆత్మ సౌందర్యాన్ని కప్పిపుచ్చుతోందని! ఆయన పద్యాల సారాంశం కూడా అదే.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా - అని వేమన ఎప్పుడో చెప్పాడు. లైనిన్ కాటన్ వేసుకున్న పెద్ద మనుషులంతా చూడ్డానికి ఒకేలా ఉంటారు. కానీ లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు నిజంగా ప్రజాసేవకులో, ఎవరు ప్రజాధన భోక్తలో, ఎవరు ప్రజల ముందు వక్తలో..! ఆత్మ సౌందర్యానికి ఆయన్ని ఆయన చిహ్నంగా మార్చుకున్నారనే తప్ప అది సభ్యతకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఎవరికీ అనిపించలేదు. అలా అనిపిస్తే ఆ మహానుభావుణ్ణి కూడా మనం మెటీరియలిస్టిక్‌గా చూస్తున్నామని అర్థం.
నగ్నమైన మానవ జీవిత నిజాలకి దర్పణంగా దిగంబరంగా మారిన యోగి. రమణమహర్షి, వేమన, మహాత్మాగాంధీ అందరికీ బట్టలు కప్పేద్దాం. లేదా వీరి పేర్లు చెరిపే ద్దాం. ఆరున్నరవేల సంవత్సరాల భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన వారి చరిత్రలని పట్టు బట్టలతో కప్పేసి మనలా మామూలు మనుషుల్ని చేసేద్దాం. వారు ఆంధ్రా వారా, తెలంగాణా వారా అని కొట్టుకుందాం. ఇలాంటి విపరీత ధోరణులున్న వారందరినీ సంఘాలుగా ఏర్పరచి సమాజాన్ని ఎడ్యుకేట్ చేద్దాం.
2015కు ముందు వేమన, 2015 తర్వాత వేమన అని పిల్లలకు రెండు ఫొటోలు చూపిద్దాం. అన్నేళ్లు బట్టల్లేకుండా ఎందుకుంచారు? అని ఏ పిల్లలైనా అమాయకంగా అడిగితే, సిగ్గుతో చచ్చిపోదాం. ఇదీ వేమన నుండి మనం నేర్చు కున్నది. ఆయనకి మనమిచ్చే నివాళి. ఆయన్ని మనం మననం చేసుకునే విధానం.
సారీ వేమనగారూ- మీకు బట్టలు తొడగడానికి ఎవరో ముందుకొస్తే అడ్డుపడడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని దిగం బరంగానే చూడాలన్న కోరికా నాకు లేదు. మీ నుంచి నేను నేర్చుకున్న జీవిత సత్యాలకి నాగరికత ముసుగు తొడిగి మరుగున పడేస్తారేమోనని బాధతోనే ఈ వ్యాసం. తప్పయితే క్షమించండి. కాదనుకుంటే కార్యాచరణకి దారి చూపండి. ఈ విషయం మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధమ్.
- వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ సినీ దర్శకుడు