మెదడు చురుగ్గా పనిచేయాలని అందరూ కోరుకుంటారు. అది పది కాలాల పాటు హాయిగా పనిచేయాలన్నా, చాలాకాలం పాటు మెదడు ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి. తీసుకోండి. మీ మెదడును చురుగ్గా ఉంచుకోండి.
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ : మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదా: దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్ కార్బోహేడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి.
ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ (అత్యవసరమైన కొవ్వులు) : కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచిది కాదుగానీ... మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు మాంసాహారం (ప్రధానంగా కోడి మాంసం), గుడ్లు, చేపలు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి.
అయితే ట్రాన్స్‌ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన మంచి కొవ్వులను అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమంగా తయారు చేసే డాల్డా వంటి పదార్థాలో ఉంటాయి. వీటి ద్వారా తయారు చేసే కేక్‌లు, బిస్కెట్‌లు మెదడును చురుగ్గా ఉంచవు.
అమైనో ఆసిడ్స్ : మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే వాటిని న్యూరోట్రాన్స్‌మిటర్స్ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు దోహదపడేవే ‘అమైనో ఆసిడ్స్’. ఈ అమైనో ఆసిడ్స్ అన్నవి ప్రోటీన్స్‌నుంచి లభ్యమవుతాయి. ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే మన ధోరణులు (మూడ్స్) కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో ఆసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు ‘ఓట్స్’లో కూడా ట్రిప్టొఫాన్ ఎక్కువే.
విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు) : మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో ఆసిడ్స్‌ను న్యూరోట్రాన్స్‌మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌లో మార్చడంలోనూ బాగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్‌లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమైవుతాయి. ఇవి ప్రధానంగా తాజా కూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి.
నీళ్లు : మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 70 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. అయితే మనం మన మూత్రం ద్వారా, ఉచ్ఛాసనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తుంటాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక ఎంతగా తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం రెండు లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంది.
ఒకరు తాము రోజువారీ తీసుకునే నీళ్లు రెండు లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మీ మూడ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకోవాలి. టీ, కాఫీ అనే ద్రవాహారం చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) ఉంటే పరవాలేదు. అంతకు మించితే అది మెదడును తొలుత చురుగ్గా చేసినా, దాంతో వేగంగా అలసిపోయేలా చేస్తుంది. కూల్‌డ్రింక్స్‌తో కూడా అదే అనర్థం చేకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment