వేస్ట్ ఫెలోస్ | Waste Fellows | Sakshi
Sakshi News home page

వేస్ట్ ఫెలోస్

Published Fri, Apr 1 2016 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

వేస్ట్ ఫెలోస్

వేస్ట్ ఫెలోస్

బాధ్యత

 
అవసరం కంటే ఎక్కువ పెట్టుకోవడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ వడ్డించడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ తినడం వేస్ట్ కాదా! ఆ తర్వాత అజీర్తికనీ, షుగర్ అనీ, సకల జబ్బులకు సర్వం ధారపోయడం వేస్ట్ కాదా! రైతు కష్టాన్ని గౌరవించకపోవడం వేస్ట్ కాదా! పేదవాడి కడుపుకొట్టడం వేస్ట్ కాదా! పంచుకోవాల్సింది పారేయడం వేస్ట్ కాదా!  పిల్లలకు వేస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచేవాళ్లు వేస్ట్‌ఫెలోస్ కాదా! కాదా!?

 

అన్నం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ అంటే సృష్టి. సృష్టి అంటే శక్తి. ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే శక్తిని, మన ఉత్పాదకతను వృథా చేస్తున్నామనే అర్థం. ఈ పాఠం రతన్‌టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజానికి జర్మనీకి వెళితే కాని అర్థం కాలేదు. చాలా ఏళ్ల కిందట రతన్ టాటా ఏదో పని మీద జర్మనీ వెళ్లారు. అప్పటి వరకు ఆయన జర్మనీ చాలా ధనిక దేశమని, అక్కడి ప్రజలంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆయన స్నేహితుడితో కలిసి హేమ్‌బర్గ్‌కి వెళ్లాడు. లంచ్ టైమ్ అయింది. ‘ఆకలి దంచేస్తోంది. ముందు ఏదైనా రెస్టారెంట్‌కి వెళదాం.. తర్వాతే ఇంకో పని’ అన్నాడు స్నేహితుడితో. ఆ స్నేహితుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడు. మూలన ఒక యువజంట, ఇంకో చోట యాభైఏళ్లు పైబడిన ఓ మహిళల గుంపు మినహా రెస్టారెంట్ అంతా ఖాళీగానే ఉంది. ‘ఇదేం హోటల్‌రా బాబూ.. అంతా ఖాళీగా ఉంది.. మంచి ఫుడ్ ఉంటుందా?’ సందేహం వెలిబుచ్చుతూ లోపలంతా పరికించి చూడసాగాడు. మూలన కుర్చున్న యువజంట ముందు ఓ రెండు కూరలతో మాత్రమే భోజనం ఉంది. ‘ఇంత సాధారణ భోజనంతో రొమాంటిక్ లంచా? గర్ల్‌ఫ్రెండ్‌కి మంచి లంచ్ కూడా ఆర్డర్ చేయని ఆ పిసినారి బాయ్‌ఫ్రెండ్‌ని ఆ పిల్ల ఎంతోకాలం భరించదు’ అనుకుంటూ నవ్వుకున్నారు రతన్‌టాటా. యాభై పైబడిన ఆడాళ్ల బృందమేమో ఆర్డర్ చేసుకొన్న డిష్‌ను కొసరి కొసరి వడ్డించుకుంటున్నారు. ప్లేట్లలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ మిగల్చకుండా తినేస్తున్నారు. వాళ్లను చూసి అంత కక్కుర్తి ఏమిటా అనుకున్నారాయన.
 

ఇప్పుడు ఆర్డర్ చేయడం వీళ్ల వంతైంది. ఉన్నది ఇద్దరే అయినా చాలా రకరాల వెరైటీలను ఆర్డర్ చేశారు రతన్‌టాటా. తినగలిగినంత తిని మిగిలినది ప్లేట్లలో వదిలేశారు. అది చూసి పక్కనే ఉన్న బృందంలోని మహిళ... ‘మిస్టర్.. భోజనాన్ని అలా వదిలేశారెందుకు?’ అంటూ కోప్పడింది. ఆ మాటకు రతన్‌టాటా స్నేహితుడికి చిర్రెత్తింది. ‘మా డబ్బు.. మా భోజనం.. మా ఇష్టం. తింటాం.. వదిలేస్తాం.. మీకెందుకు?’ అంతే కోపంగా సమాధానమిచ్చాడు. ఆ జవాబుకి కనుబొమలు ముడివేసిన ఆ మహిళ వెంటనే రిసెప్షన్‌లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి వచ్చింది. కొద్ది క్షణాల్లోనే అక్కడి సోషల్ సెక్యురిటీ యూనిఫామ్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. ఈ మిత్రుల టేబుల్ దగ్గరకు వచ్చి ‘ప్లేట్లలో వదిలేసిన ఆహారానికి యాభై యూరోలు ఫైన్ కట్టండి’ అంటూ ఓ రిసీట్ ఇచ్చారు. తెల్లబోయారిద్దరూ. ‘అదేంటి? ఈ ఫుడ్ మేం డబ్బుకట్టి ఆర్డర్ చేసిందే’ అన్నాడు రతన్‌టాటా స్నేహితుడు. ‘డబ్బు మీదే కాని వనరులు మీవి కావు. మీవి కాని రీసోసెర్సెస్‌ను వేస్ట్ చేసే హక్కు మీకు లేదు. దానికే ఈ ఫైన్’ అని వాళ్ల దగ్గర యాభై యూరోలు తీసుకొని వెళ్లిపోయారు. అప్పటిదాకా ఆ ధనిక దేశమ్మీద రతన్‌టాటాకు ఉన్న అపోహలు తొలగిపోయాయి. అంత సంపద ఉన్న దేశమే ప్రకృతి సంపదను ఎంతో జాగ్రత్తగా వాడుకుంటుంటే అతి తక్కువ వనరులన్న మన దేశం ఎంతెంత ఆహారాన్ని వృథా చేస్తోంది ...అని చింత పడ్డారు. అప్పటినుంచి ఒక్క ఆహారపు గింజను కూడా వృథా చేయనని ఒట్టేసుకోవడమే కాదు, చిత్తశుద్ధితో ఆచరించడమూ మొదలెట్టారట.

 

మన ఇళ్లల్లో..

ఇలాంటి సంఘటనలు మన ఇళ్లల్లో, మన హోటళ్లల్లో కనిపించవు. కానీ తిన్నంత తిని వదిలేసినంత వదిలేసే అలవాట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇద్దరున్న ఇంట్లో నలుగురి వంట; నలుగురు ఉన్న ఇంట్లో ఆరుగురి వంట; ఇక పదిమంది ఉన్న ఇంట్లో పదిహేను మంది వంట చెత్తకుండీల్లోకి చేరుతుంది. అదే చెత్తకుండీ పక్కన అన్నమో రామచంద్రా అంటూ డొక్కలు అతుక్కుపోయిన అన్నార్తులూ కనిపిస్తుంటారు. ఒక ఇంట్లో అతివృష్టి... ఒకడి ఒంట్లో అనావృష్టి. అయినా ఆహారం విలువ తెలియదు. దానికి ఉదాహరణ మన దగ్గర జరిగే అట్టహాసపు ఆర్భాటపు పెళ్లిళ్లు, పెరంటాళ్లే! ఈ వేడుకల్లో టన్నుల కొద్దీ ఆహారం వృథాపాలవుతోంది. ఇలా వృథా చేస్తున్న ఏ ఒక్కరికైనా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు గుర్తొస్తున్నాయా? చెత్తలో కలుపుతున్న ఈ ఆహారధాన్యాలను పండించడానికి రైతు తన సర్వస్వం ధారపోస్తున్నాడు. తాను నమ్ముకున్న నేల కోసం ఇంటినీ, భార్య ఒంటి మీది నగలను తాకట్టు పెట్టి పంటకు పెట్టుబడి తెస్తున్నాడు. అయినా అనుకున్న రాబడి రాక అప్పులు మిగిలి తన ప్రాణాల్నే తీసుకుంటున్నాడు. అతని కుటుంబం ఈ గింజలే కరువై రోడ్డున పడుతోంది. మన ఒక్క ఇంట్లో ఒక ముద్దే కదా వృథా అవుతోంది అనుకుంటాం... అలా కొన్ని వందల ఇళ్లల్లో వందల ముద్దలు వృథా అయి కొన్ని వందల మంది నోటి దగ్గరి ముద్దలను లాక్కున్న వాళ్లమవుతున్నాం. అంటే అన్ని వందలమంది అన్నార్తులను సృష్టించిన నేరస్తులమవుతున్నాం. ఎంతోమంది రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాం. వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేసిన పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. బహుశా ఇలాంటి బాధను అనుభవించే కావచ్చు.. లేదా రతన్‌టాటాకు ఎదురైన అనుభవాన్ని తెలుసుకొని కావచ్చు..

 

దుబాయ్‌లో..

బర్‌దుబాయ్‌లోని అల్ కరామా ప్రాంతంలో అజంతా అనే హోటల్ ఉంది. ఆ హోటల్ యజమాని తన దగ్గరకి వచ్చే కస్టమర్స్‌కి 20 ధిరహామ్‌లకు కావల్సినంత భోజనం పెడ్తాడు. మళ్లీ మళ్లీ పెట్టించుకుంటూ కడుపునిండా తినొచ్చు. కానీ ప్లేట్‌లో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. మిగిలిందో, 13 ధిరహామ్స్ ఫైన్ కట్టి వెళ్లాలి. అంటే కావల్సినదానికల్లా ఎక్కువ పెట్టుకొని వదిలేస్తే భోజనం ఖరీదు 20 ధిర్‌హామ్స్‌తో పాటు అదనంగా 13 ధిర్‌హామ్స్ మొత్తం ముప్పైమూడు ధిర్‌హామ్స్ చెల్లించి వెళ్లాలి. ఒక్క ధిర్‌హామ్ విలువ 20 రూపాయలు. 33 ధిర్‌హామ్స్ ఇండియన్ కరెన్సీలో 660 రూపాయలు. ఎందుకీ ప్రాక్టీస్ అంటే ‘పాతికేళ్ల కిందట ఒకసారి నా హోటల్‌కి ఓ నలుగురు యువకులు వచ్చి నచ్చినవాటిని నచ్చినంత ఆర్డర్ చేశారు. కనీసం అందులో పావు భాగమైనా తినకుండా పారేసి వెళ్లిపోయారు. అప్పట్లో నేను రోజుకి యాభై మందికి మీల్స్ సర్వ్ చేసేవాడిని. ఈ నలుగురు వచ్చి వెళ్లాక వారిలో ఏడుగురికి భోజనం పెట్టలేకపోయాను. అంటే ఈ నలుగురు ఏడుగురి భోజనాన్ని వృథా చేసి వెళ్లారు. పాపం ఆ ఏడుగురూ లేబర్స్. నా రెగ్యులర్ కస్టమర్స్. ఆకలితో వెనుదిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో అల్‌కరామాలో ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఇదే. వాళ్లకు ఆ పూటకు తిండే దొరకలేదు. నీకు పట్టినంత నువ్ తిను.. కాని ఇతరులు తినాల్సినదాన్ని నువ్వు వృథా చేసే హక్కు నీకు లేదు అని చెప్పడానికే ఈ రూల్ పెట్టాను ’ అని చెప్పాడు.
 

 ఇదీ కథ.. కథలాంటి నిజం. ఆహారాన్ని వృథా చేయడం ఎంత నేరమో చెప్పే గొప్ప అనుభవం. నోటి దగ్గరకు ముద్ద వెళ్లినప్పుడల్లా ప్రతి ఒక్కరికీ గుర్తుకు రావాల్సిన పాఠం.

 - సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement