
నాజూకు రాణులు సన్నజాజుల్లా ఉండాలట.వాళ్ల బరువు ఏడు మల్లెల ఎత్తు తూగాలట.కానీ... ఇక్కడో అందమైన, ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్ మాట కూడా ఉంది.‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని ఓ వాడుక. అంటే మరి... చిక్కిపోకుండా బొద్దుగా ఉంటేనో? అప్పుడామె ఇంకా మరింత అందంగా ఉందనే కదా అర్థం!అన్నట్టు ఒక్కమాట...సైజ్ జీరో అయితే హెల్త్ కూడా జీరో కావచ్చు.
హెల్త్ జీరో అయితే జీవితమూ జీరో కావచ్చు. హెల్త్ కొరవడిన లైఫ్ హెల్ అనిపించవచ్చు.అందుకే సన్నబడినా, కండపట్టినాఆరోగ్యానికి మించిన అందం లేదని గ్రహించాలి.అటు ఆ ఏడుమల్లెలూ, సన్నజాజులే కాదు...ఇటు ఈ బొండుమల్లెలూ, ముద్దబంతులూ ఇచ్చే‘అందమైన’ సందేశం ఇదే!
‘‘ఆద్యా.. ఏంటమ్మా ఇది? ఏమీ తినకుండానే చేయి కడుక్కుంటున్నావ్?’’ కంచంలో వడ్డించిన భోజనం వడ్డించినట్టే వదిలేసిన ఆరేళ్ల మనవరాలిని మందలించింది అమ్మమ్మ.‘‘అమ్మో.. కర్రీస్‌లో ఎంత ఆయిల్ ఉందో?’’ భయంతో కళ్లింత చేసుకొని జవాబిచ్చింది ఆద్యా.‘‘ఏయ్ వేషాలా? ఎక్కడుందే ఆయిల్?’’ గద్దించింది ఆద్యా పిన్ని.‘‘అంతంత ఆయిల్ తింటే రోడ్డు రోలర్‌లా తయారవుతారు. నేను కంగనా రనౌత్‌లా ఉండాలి’’ .. కళ్లు, చేతులు, నడుము తిప్పుకుంటూ ఆ పిల్ల.అక్కడున్న పెద్దవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంకానయం.. ఆరేళ్ల వయసులో ఆద్యా ఆ మాటలు మాట్లాడుతోంది.ఆ పిల్ల మేనత్త కూతురు.. నాలుగేళ్ల పసికూనకైతే బార్బీడాలే రోల్ మోడల్!విస్మయం చెందాల్సిన విషయమే.
జీరో సైజ్.. ప్రభావం!తెల్లటి ఛాయే అందం అనే భ్రమను ‘నిజం’గా ఎలా నమ్మించారో.. బ్యూటీ అంటే జీరోసైజే అనే పిచ్చినీ అంతే ‘వాస్తవం’గా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మ్యాగజైన్లు, పత్రికలు, టీవీలు, సినిమాల్లో ప్రకటనలు, కథనాలు, కథలు, సీరియళ్లు.. అన్నీ ఆ అతి నాజూకుతనానికే కిరీటం పెట్టాయి. అందం అంటే తెల్లటి రంగుతో.. 36–24–36 శరీర కొలతలు కాదు మొర్రో.. అందం అంటే ఆరోగ్యంతో ఉన్న ఆత్మవిశ్వాసమని ఇవే పత్రికల్లో మానసిక విశ్లేషకులు, వైద్యులు నెత్తీనోరు కొట్టుకొని చెప్తున్నా కమర్షియల్ యాడ్స్ మాయలో.. హోరులో వినట్లేదు.. చూడట్లేదు!శారీరక వ్యాయామం లేకుండా డైట్‌తో ఫలానా రోజుల్లోగా ఫలానా అన్ని కేజీలు తగ్గుతారు.. మేము గ్యారెంటీ అంటూ.. ‘డైట్‌కి ముందు.. తర్వాత’ అని ఫోటోలు వేసి మరీ నిలబెట్టిన హోర్డింగులు చూసి.. క్యూ కడ్తున్నారు. సన్నబడ్డమేమో గానీ.. నీరసించి ఆసుపత్రి పాలైన టీనేజ్ అమ్మాయిలు కళ్లముందే కనిపిస్తున్నా!
సన్నజాజి.. ముద్దబంతి
వెనకట.. ‘‘ఆ అమ్మాయి చూడు.. సన్నజాజి తీగలా ఎంత నాజూగ్గా ఉందో?’’ అని అన్నవాళ్లే కాస్త బొద్దుగా కనిపించిన ఆడపిల్లను చూసి‘‘ముద్దబంతి పువ్వు’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు. అంటే అందం.. మనిషి మనిషికీ మారినట్టే కదా! సన్నజాజి తీగను, ముద్దబంతినీ అభినందించారు అంటే ఆరోగ్యాన్ని.. దానిద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టు కదా! కండ కలవాడే (కలది కూడా) మనిషని గురజాడ కూడా సెలవిచ్చాడు. మనిషి మనిషికీ ఒంటితీరు మారుతుంది. ఎవరి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ల బరువు ఉండాలి. కష్టే ఫలి. చెమటోడ్చే శ్రమే ఆరోగ్య సూత్రం. అందుకే జీరో సైజ్ అబ్సేషన్‌గా మారిన తరాన్ని ఆ వెర్రిలోంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నాలే మొదలయ్యాయిప్పుడు.
ధమ్ లగాకే హైష్షా..!
జీరో సైజ్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వెలిగిందీ.. అందులో ఆరోగ్యం జీరో అని చాటిందీ సినిమా స్టార్సే.. సినిమాలే అయినా ఇప్పడు తూచ్ అంటోందీ అవే.. వాళ్లే! కరీనా కపూర్‌తో ఈ తరహా నాజూకుతనం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. జీరో సైజ్ కొలతల్లో ఇమడడానికి కరీనా తీసుకున్న అతి శ్రద్ధ ఆమెను అనారోగ్యం పాలు చేసింది. దాంతో హెల్త్‌ను మించిన గ్లో, ఫేమ్ లేదని అంతే త్వరగా దాంట్లోంచి బయటకు వచ్చింది కరీనా. పాజిటివ్ దృక్పథం, చేస్తున్న పనిపట్ల నిబద్ధత, ప్లస్ పాయింట్స్.. ప్లస్ సైజ్‌ను బీట్ చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి.
ఇదే అందానికి యూనివర్స్ ఇచ్చే నిర్వచనం. బ్యూటీ పేజెంట్స్‌లో క్రౌన్‌ను డిసైడ్ చేసే లాస్ట్ రౌండ్ కూడా వీటికి సంబంధించే ఉంటుంది. ఈ సత్యానికి సినిమాలు పబ్లిసిటీ ఇస్తున్నాయి. లావుగా ఉన్న భార్యతో బయటకు వెళ్లడానికి సిగ్గుపడే భర్తను రక్షించి ఆత్మవిమర్శలోకి నెట్టిన హీరోయిన్ కథ తెలుగులో ‘కితకితలు’తో ప్రారంభమై.. హిందీలో భూమి ఫడ్నేకర్ కథానాయికగా వచ్చిన ‘ధమ్ లగాకే ౖహె ష్షా’గా కొనసాగుతోంది. ప్లస్ సైజ్ కథానాయికతో తెలుగులో ‘సైజ్ జీరో’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం కోసం అనుష్క శెట్టి బరువు పెరిగి పాత్రకు ప్రాణం పోసింది. అయినా.. ఆమె పట్ల ప్రేక్షకుల అభిమానం గ్రాము కూడా తగ్గలేదు.
తెలుగు, తమిళ భాషల నటి ఆర్. వరలక్ష్మి (ఆర్. శరత్ కుమార్ కూతురు), బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎట్‌సెట్రా.. నటనతోనే అభిమానులను సంపాదించుకున్నారు తప్ప నాజుకుతనంతో కాదు. పాతకాలంలో సంధ్యా, సావిత్రి, దేవిక, రాజశ్రీ తర్వాత జయచిత్ర లాంటి వారు లేరా.. అంటే ఉన్నారు. స్లిమ్‌గా ఉండే ట్రెండ్‌లో కూడా కాన్ఫిడెన్స్ పాత్‌ను ఎంచుకున్న లేటెస్ట్ హీరోయిన్స్ ఉదాహరణగా చూపించింది.. ఈ తరం కనెక్ట్ అవడం కోసమే.
ప్లేబాయ్ టు మాల్స్..!
లావుగా ఉండే వారిలో ఆత్మన్యూనత పోగొట్టడానికి ప్లస్ సైజ్ మోడల్స్ కూడా వచ్చారు. వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ ప్లస్ సైజ్‌లో లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. వరల్డ్ టాప్ బ్రాండ్స్ వాటికి తమ బ్రాండ్‌నేమ్‌నిస్తున్నాయి. మాల్స్‌లో స్పెషల్ స్పేస్ దొరుకుతోంది. ప్లేబాయ్ లాంటి పత్రికలు ప్లస్ సైజ్ మోడల్స్‌ను తమ ముఖచిత్రంగా వేసి స్టీరియో టైప్‌ను బ్రేక్ చేస్తున్నాయి. ఆ పత్రిక ఫోటోగ్రాఫర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్న ఎల్. రామచంద్రన్ ఆ మోడల్స్‌తో ఫోటో షూట్ చేస్తున్నాడు. ‘‘సన్నని మేను, తెల్లటి రంగు అంటూ అందానికి నిర్వచనాలుండవ్. అవి కథల్లో, కవితల్లో మాత్రమే.
ఆత్మసౌందర్యమే అసలైన సౌందర్యం’’ అంటాడు ఎల్. రామచంద్రన్. ఆయన ఫోటో షూట్‌కు మోడల్‌గా పనిచేసిన అక్షయ నవనీతన్.. టాప్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పలు టీవీ షోలకు యాంకర్ కూడా. ఎల్.రామచంద్రన్ ఫోటో షూట్‌లో ఆమె గుండు చేయించుకుని (క్యాన్సర్ మీద అవగాహన, క్యాన్సర్ బాధితలకు సంఘీభావంగా) కూడా పాల్గొన్నారు. ‘‘బాడీ షేమింగ్‌ను బ్రేక్ చేయడానికి విజువల్ ఆర్ట్‌ను మించిన మీడియం లేదు’’ అంటాడాయన.క్లారిటీ, సింప్లిసిటీ, స్ట్రెంత్.. సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌కు గ్రామర్.. గ్లామర్! దీన్ని మించిన అందం ఏం ఉంటుంది? ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తుల జీవితాలను చదివినా.. ఈ సామాన్య లక్షణాలే కనిపిస్తాయి!
– సరస్వతి రమ
అన్‌కండిషనల్‌గా ప్రేమించుకోవాలి
మనమంటే హోల్ ప్యాకేజ్.. దాన్ని మొత్తంగా చూడగలగాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్ కండిషనల్‌గా. ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. చేసుకోవాలి కూడా. అలాగని అప్పియరెన్స్‌కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి.. అదీ ఓ భ్రమ కోసం మనల్ని మనం హింసించుకోవడం తప్పు. మోడల్స్‌ను రోల్ మోడల్స్‌గా తీసుకోకూడదు.
వాళ్ల ఫోటోలు.. షూట్స్‌ను చూసి మనం ఫోలో కావద్దు. కారణం.. అవన్నీ ఎడిట్, గ్రాఫిక్‌ల గిమ్మిక్కులు. ఆరోగ్యం కోసం, ఒబేసిటీతో బాధపడ్తున్న వాళ్లు సన్నబడాలనుకోవడంలో తప్పులేదు. అది అవసరం కూడా. కాని అందం కోసం.. అదీ స్పెసిఫిక్‌గా జీరో సైజ్ ఫ్రేమ్‌లోకి రావాలని తాపయత్రయ పడడం మాత్రం ప్రమాదమే. దీనివల్ల శారీరకంగానే కాదు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఎప్పుడైనా .. ఎక్కడైనా సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ మ్యాటర్ అవుతుంది.
– డాక్టర్ పద్మాపాల్వాయి, సీనియర్ సైకియాట్రస్ట్
Comments
Please login to add a commentAdd a comment