స్త్రీలోక సంచారం | Woman's Wandering | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Sun, Sep 16 2018 1:46 AM | Last Updated on Sun, Sep 16 2018 1:46 AM

Woman's Wandering - Sakshi

లెగ్గింగ్స్, యోగా ప్యాంట్‌ ధరించి పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థినులను యు.ఎస్‌. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని కెనోషాలో అనేక పాఠశాలల యాజమాన్యాలు కటువుగా శిక్షించడంపై అమెరికాలోని పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిమ్‌కు, వర్కవుట్‌లకు అనువుగా ఉండే ‘అథ్లెష్యూర్‌’ ఫ్యాషన్‌ ట్రెండ్‌ దుస్తులను ధరించి పాఠశాలకు రాకూడదని గత మార్చిలోనే ఆంక్షలు విధించినప్పటికీ, కొంతమంది విద్యార్థినులు వాటిని లక్ష్యపెట్టకుండా అవే దుస్తులను ధరించి పాఠశాలకు వస్తున్నందున వారిపై చర్య తీసుకోవడం తప్పడం లేదని పాఠశాలలు చెబుతుండగా.. కొందరి విషయంలో మాత్రమే స్కూళ్లు ఈ విధమైన వివక్షను పాటిస్తున్నాయని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
  98 ఏళ్ల ‘మిస్‌ అమెరికా’ అందాల పోటీల చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది స్విమ్‌ సూట్‌ రౌండ్‌ లేకుండానే పోటీలను నడిపించిన ఘనత నిర్వాహకులకు దక్కినప్పటికీ.. ఆ పోటీలను టీవీలో చూసే వీక్షకుల సంఖ్య గత ఏడాదితో పోల్చి చూస్తే 19 శాతం తగ్గినట్లు ప్రముఖ సర్వే కంపెనీ ‘నీల్సన్‌’ వెల్లడించడంతో వచ్చే ఏడాది మళ్లీ స్విమ్‌ సూట్‌ రౌండ్‌ పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి! సాధారణ పరిస్థితుల్లోనే టీవీలో అందాల పోటీలను చేసేవారి సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండగా.. ఈసారి స్విమ్‌ సూట్‌ రౌడ్‌ను తొలగించడంతో.. గత ఏడాది 50 లక్షల 35 వేలుగా ఉన్న టీవీ వీక్షకులు ఈ ఏడాది 40 లక్షల 34 వేలకు పడిపోయారని నీల్సన్‌ తన సర్వే ఫలితాల్లో తెలిపింది.
  లెబనాన్‌ (పశ్చిమాసియా) రాజధాని బీరుట్‌కు రోడ్డు మార్గంలో 20 నిముషాల ప్రయాణ దూరంలో ఉన్న జియాలోని ఓన్లీ ఉమెన్‌  ‘బెలెవ్యూ బీచ్‌ క్లబ్‌’లో ఏ ఆంక్షలూ లేకుండా మహిళలకు ఇప్పటి వరకు కల్పిస్తున్న ప్రవేశానికి ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇచ్చారు. అసలు మగ దృష్టే పడని, స్త్రీలకు మాత్రమే అయిన, అది కూడా లెబనాన్‌ దేశ మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ క్లబ్బులోకి మహిళలు బికినీ సహా, ఏ విధమైన వస్త్రధారణతోనైనా వచ్చి, ఆహ్లాదంగా విహరించే అవకాశం ఉండగా ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఎండపూట ఇసుకలో బేర్‌ బ్యాక్స్‌తో, బేర్‌ ఫ్రంట్స్‌తో సూర్యస్నానాలు చేసే వీలు కల్పించారు.
  వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వాటికన్‌ సిటీలో జాతీయ క్యాథలిక్‌ బిషప్‌ల సదస్సును నిర్వహిస్తున్నట్లు వాటికన్‌ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. యు.ఎస్‌., చిలి, ఆస్ట్రేలియా, జర్మనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని క్యాథిలిక్‌ చర్చి బిషప్‌లు.. పిల్లలపై, నన్‌లపై అత్యాచారం జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికన్‌ ప్రతిష్టను తిరిగి నిలుపుకోవడం కోసం పోప్‌ ఫ్రాన్సిస్‌ స్వయంగా పూనుకుని ఈ సదస్సును తలపెట్టారు.
 గత ఏడాది మొహర్రం రోజు దుర్గాపూజ విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఆదేశాలు జారీ చేసి, ముస్లింల మెప్పు కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఈ ఏడాది కోల్‌కతాలోని 3,000 దుర్గాపూజ కమిటీలతో సహా, రాష్ట్రంలోని 28,000 కమిటీలకు.. ఒక్కో కమిటీకి 10,000 రూపాయలు చొప్పున నిధులను మంజూరు చేసింది. అయితే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విధమైన హిందూ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు తప్ప, వారిపై ఆమె ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement