
ఇంగ్లండ్ క్రీడాకారిణి లూసీ బ్రాంజ్ ‘బి.బి.సి. ఉమెన్స్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గెలుచుకున్నారు. ‘మీ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఎవరు?’ అని బి.బి.సి. పెట్టిన అంతర్జాతీయ ఓటింగ్‌లో ఎక్కువ మంది లూసీ బ్రాంజ్ పేరును సూచించారని తెలిసినపుపడు లూసీ నమ్మశక్యం కాని ఆనందంతో కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 26 ఏళ్ల లూసీ మొదట్లో ‘మాంచెస్టర్ సిటీ’ జట్టుకు ఆడేవారు. అక్కడి నుంచి ఫ్రెంచి టీమ్ ‘ఒలింపిక్ నియోనైస్’ జట్టుకు మారారు. అంతమాత్రాన పూర్తిగా ఆమె ఇంగ్లండ్‌ను వదిలేశారని అనుకోకండి.
ఇంగ్లండ్ నేషనల్ ఉమెన్స్ ఫుట్‌బాల్ టీమ్ ‘లయెనెసెస్’కు కూడా ఆడుతున్నారు. అవార్డు అందుకుంటున్నప్పుడు ‘ఇట్స్ రియల్లీ స్పెషల్’ అనే పదాలు లూసీ పెదవుల్ని ఒణికించాయి. అంతా చప్పట్లు కొడుతుండడం ఆమెను మరింతగా ఉద్వేగంతో కూడిన తత్తరపాటుకు లోను చేసింది. అవార్డుకు నామినేట్ అవడమే గొప్ప సంగతి అని ఆమె భావిస్తున్న తరుణంలో ఏకంగా అవార్డే అమెను వరించి వచ్చింది. ‘నాతో పాటు నామినేట్ అయిన వాళ్లందరూ కూడా అవార్డు అర్హులే’ అని లూసీ అన్నారు. ఇలా అనడం ద్వారా ఆమె తనకు అవార్డును ఇచ్చినవారిని కూడా గౌరవించారు.