
నెం.1 స్టూడెంట్స్
కాలేజ్ ఏజ్‌లో యంగ్ తరంగ్‌ల ఆలోచనలు రాంగ్ రూట్లో దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంటాయి. కొంటె చూపుల అట్రాక్షన్‌కే.. ప్రేమంటే ఇదేరా..!
రిపోర్టర్- అజయ్
కాలేజ్ ఏజ్‌లో యంగ్ తరంగ్‌ల ఆలోచనలు రాంగ్ రూట్లో దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంటాయి. కొంటె చూపుల అట్రాక్షన్‌కే.. ప్రేమంటే ఇదేరా..! అని ఫిక్సయిపోయి.. లక్ష్యం మరచి గమ్యం వెతికే వెర్రిబాగులోళ్లని అనుకుంటారంతా. కానీ, ఈ యంగిస్థాన్‌లు మాత్రం నిదానమే మా విధానం అంటున్నారు. తప్పు కాని ప్రేమ కోసం తప్పు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. చదువుల్లో మెప్పించి.. పెద్దలను ఒప్పిస్తే.. ప్రేమికులు ప్రేమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితే రాదని ఢంకా బజాయిస్తున్నారు. జెండర్ ఈక్వాలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ స్టుపిడిటీ.. ఇలా అన్ని అంశాలపై వారికంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సాక్షి ‘సిటీప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా సినీ నటుడు అజయ్ విద్యార్థులను పలకరించిన వారంతా తమ అంతరంగాన్ని, తమలోని విలువల కోణాన్నీ ఇలా ఆవిష్కరించారు.
అజయ్: మన దేశంలో ఆడపిల్లల మనుగడ కష్టంగా ఉందంటారా?
మమత:ఉందండి. కాలం ఇంత మారాక కూడా ఉంది.
చేతన్:బిడ్డ పుట్టగానే భవిష్యత్తుని ఊహించుకుని భయపడిపోతున్నారు. అమ్మాయి అయితే అన్నీ మనమే చూడాలి. అదే అబ్బాయి అయితే వాడే మనల్ని చూస్తాడు అనే ఆలోచనలు అసలు కారణం.
అజయ్: ఆర్థిక స్తోమత లేనివారే కాదు.. చాలా డబ్బుండి, చక్కని పొజిషన్‌లో ఉన్న ఫ్రొఫెసర్ల వంటివారు కూడా ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారని విన్నాం. ఆ మధ్య సత్యమేవ జయతే కార్యక్రమంలో ఇదే టాపిక్ వచ్చింది. చాలా వాస్తవాలను చూపించారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుండటం చాలా దురదృష్టకరం. మరి దీనికి పరిష్కారం ఏంటి?
చేతన్: ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి సార్. చిన్నప్పుడు పాఠాల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులతో పాటు హ్యూమన్ వాల్యూస్‌ని తెలిపే ఒక సబ్జెక్ట్‌ని కూడా పెట్టాలి. మిగతా సబ్జెక్ట్‌ల సంగతి ఎలా ఉన్నా.. ముందు ఓ మనిషి సాటివారి పట్ల ఎలా మసులుకోవాలో స్కూల్ డేస్ నుంచే నేర్పించాలి.
అజయ్: ఎగ్జాక్ట్‌లీ. సరే పురిట్లో రక్షణ గురించి అలా ఉంచితే.. పెద్దయ్యాక అమ్మాయికి ఉన్న రక్షణ గురించి మాట్లాడండి.
మమత: రోజురోజుకీ సెక్యూరిటీ తగ్గిపోతోంది. కిడ్నాప్‌లు, రేప్‌లు.. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి.
అజయ్: ఆపద సమయంలో కాంటాక్ట్ అవడం కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ యాప్ తయారుచేసింది కదా!
శృతి: అసలు దాని గురించి ఎంతమందికి తెలుసు సార్.
అజయ్:అకృత్యాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
మమత: సామాజికంగా చైతన్యం తీసుకురావాలి. అప్పుడే వీటికి చెక్ పెట్టగలం.
అజయ్: అవును. నా తర్వాతి ప్రశ్న.. కాలేజీ అనగానే చదువుకంటే ముందుగా గుర్తొచ్చే టాపిక్ ప్రేమ
అయిపోయిందిప్పుడు. మీరుచెప్పండి.. ప్రేమ పెళ్లి మంచిదా? పెద్దవాళ్లు చేసే పెళ్లి బెటరా?
సునీత: నా ఓటు మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్‌కే !
ఏ.. ప్రేమ పెళ్లిళ్లు మంచివి కావంటారా? అజయ్:
మమత: అలా అని కాదు. మా భవిష్యత్తు గురించి, భద్రత గురించి తల్లిదండ్రులకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది!
మనోజ్: ప్రేమించడం తప్పు కాదు సార్. ప్రేమను దాచిపెట్టడం తప్పు. ప్రేమించి వదిలేయడం ఇంకా పెద్ద తప్పు. ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ప్రేమ కోసం ఫ్యామిలీని వదులుకోవడం మాత్రం మంచిది కాదు.
చేతన్: ప్రేమలో పడి కెరీర్‌ను స్పాయిల్ చేసుకోవడం తప్పంటాను. కానీ సార్, సినిమాల పుణ్యమా అని పదో తరగతి పిల్లలు కూడా ప్రేమలో పడిపోతున్నారు.
అజయ్: నిజమే.. సినిమాల ప్రభావం అందరిపై ఉంటుంది. కానీ ఏది మంచో ఏది చెడో తెలుసుకోకుండా తప్పటడుగులు వేయకూడదు. చాలామంది అట్రాక్షన్‌ను ప్రేమగా భావించి జీవితాలు పాడు చేసుకుంటున్నారు.
మనోజ్: ఆ విషయాన్ని చెప్పే సినిమాలు ఎక్కువగా రావాలి సార్.
అజయ్: రీడింగ్ అవర్స్ బాగా పెరిగిపోయాయి. మీరు తల్లిదండ్రులతో ఎంత సమయం గడుపుతున్నారు?
శ్రుతి: చాలా తక్కువే. అయినా ఆ సమయం చాలా అమూల్యమైంది. నేను చంపాపేటలో ఉంటాను. అక్కడికి ఇక్కడికి రావాలంటే పొద్దున ఏడింటికల్లా బయలుదేరాలి. మళ్లీ ఇంటికెళ్లేసరికి రాత్రి ఎనిమిదవుతుంది. హాస్టల్‌లో ఉండమని సజెస్ట్ చేసేవాళ్లూ ఉన్నారు. హాస్టల్‌లో ఉంటే ఆ కాస్త టైం కూడా అమ్మను మిస్ అయిపోతాను. అందుకే ట్రావెల్ చేస్తున్నాను.
అజయ్: గుడ్. ఇప్పుడున్న హడావుడి జీవితంలో అమ్మానాన్నల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునే సమయమే తక్కువ ఉందంటే.. ఈ కాస్త టైం పిల్లలు సెల్‌ఫోన్‌తో గడిపేస్తున్నారు. ఏమంటారు ?
ప్రసాద్: నిజమే.. ఒకే ఇంట్లో ఉన్నవాళ్లూ వాట్సప్‌లో హాయ్.. హలో అంటూ పలకరించుకుంటున్నారు.
అజయ్: నిన్న నేనొక స్టార్ హోటల్‌కి వెళ్లాను. అక్కడికి ఓ ముగ్గురబ్బాయిలు డిన్నర్‌కు వచ్చారు. అక్కడున్నంత సేపూ ఎవరి ఫోన్లలో వారు మాట్లాడుకున్నారు. దాని కోసం కలసి రావడం దేనికనిపించింది.
శ్రీనివాస్: సెల్ ఫోన్ యూజ్ చాలా పెరిగిపోయింది. ఫ్రెండ్స్‌తో నేరుగా మాట్లాడటాన్ని ఎవరూ ఇష్టపడటం లేదు. వాట్సప్, ఫేస్‌బుక్‌లోనే దోస్తీ చేస్తున్నారు.
అజయ్: స్టూడెంట్స్ ఎదుర్కొనే స్ట్రెస్ గురించి చెప్పండి. దాని కారణంగా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
ప్రసాద్: అవును. మొన్నామధ్య మా కజిన్ ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా డబ్బున్న కుటుంబం. ఒక్కగానొక్క కొడుకు. తన బంధువులంతా పెద్ద చదువులతో విదేశాల్లో సెటిల్ అయ్యారు. వారిని అందుకోవాలనే తాపత్రయంలో సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాడు. తన యాంబిషన్ చేరుకోలేనన్న ఒత్తిడిలో సూసైడ్ చేసుకున్నాడు.
అజయ్: ఎదుటివారితో కంపారిజన్, పోటీ.. ఇవే ఇలాంటి పరిస్థితులకు కారణం.
విద్య విషయంలో రెండో ఆలోచనకు చోటు ఇవ్వకపోవడం ఒత్తిడికి దారితీస్తోంది. ఓకే.. మీలో ఎవరైనా పొలిటికల్ లీడర్
అవ్వాలనుకుంటున్నారా?
ప్రసాద్: నో సార్. దానికి రెండు అర్హతలుండాలి. ఒకటి ఎవరేమన్నా పడే ఓపిక. ఎవరినైనా ఏమైనా అనే దమ్ము. అలా ఉన్నప్పుడే లీడర్ కాగలం.
అజయ్: భలే కొటేషన్ చెప్పావ్ (నవ్వుతూ). ఇలా ఉండాలి అనడానికి అది ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ప్రొఫెషన్ కాదు కదా! సొసైటీకి సంబంధించింది.
అజయ్: ఈ మధ్యకాలంలో సామాజిక అంశాలపై అందరూ బాగా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతోంది. మీరు పాల్గొన్నారా?
మమత: అవును సార్.
ప్రసాద్: నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండేది సార్. వారానికోసారి పిల్లలందరం కలసి మా కాలేజీని శుభ్రపరుచుకోవాలని. స్వచ్ఛభారత్ కూడా అలాంటిదే కదా సార్.
అజయ్: అంతేగా...మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రపరుచుకుంటే చాలు. దేశమంతా క్లీన్ అండ్ నీట్‌గా మారిపోతుంది. ఓకే. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ.
అజయ్: అబ్బాయిలూ.. మీలో 500 సీసీ బైక్ ఎవరికి ఉంది?
అశోక్: నాకుంది సార్.
అజయ్: చెప్పు అశోక్.. రోడ్డు ప్రమాదాల గురించి రోజూ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు యాక్సిడెంట్లు. సేఫ్ జర్నీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
అశోక్: మెహిదీపట్నం బిడ్జిపై స్పీడ్ లిమిట్ బోర్డులుంటాయి సార్. దాన్ని క్రాస్ చేస్తే స్పీడ్ లిమిట్ ఫైన్ పడుతుంది. సిటీ అంతటా అలాంటివి ఏర్పాటు చేయాలి.
అజయ్: మీకు ఇంతవరకూ ఎన్ని ఫైన్‌లు పడ్డాయి? (నవ్వుతూ)
అశోక్: అస్సలు పడలేదు.
అజయ్: మామూలుగా ఏ స్పీడ్‌లో వెళతారు? (నిజం చెప్పాలి)
అశోక్: అరవై. అప్పుడప్పుడు డెబ్బయ్.
అజయ్: ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి ఏ స్పీడ్‌లో ఎంత టైం పడుతుంది ?
అశోక్: డెబ్బయ్‌లో వస్తే ఐదు నిమిషాలు.. యాభైలో వస్తే ఏడు నిమిషాలు
అజయ్: రెండు నిమిషాల తేడా అన్నమాట. ఈ టూ మినిట్స్‌పై ఎంతమంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయో ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలి. ఏమంటారు?
అశోక్: అంతే సార్.