కంప్లీట్‌మ్యాన్..ఆమిర్‌ఖాన్
చక్కటి సూట్ వేసుకొని మీటింగ్ నిర్వహిస్తుంటాడు కంపెనీ యజమాని. ఆ ఠీవికి అందరూ ముగ్ధులవుతుంటారు. పురుషుడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నట్టుగా ఉంటుంది ఆ యాడ్! ఇది డెబ్భైల నాటి రేమండ్స్ కంపెనీ యాడ్.
భార్యాభర్తలు ఆఫీస్‌కి రెడీ అయి వెహికల్ ఎక్కేస్తారు. భర్త డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అంతలో ఒక్క నిమిషం అంటూ కారు దిగి ఇంట్లోకి వెళ్తుంది భార్య. ఐదు నిమిషాల తరువాత వచ్చి, కారెక్కి.. మళ్లీ ఒక్క నిమిషం అని కారు దిగి లోపలకు వెళ్తుంది. భర్త కారు దిగి భార్య వచ్చే వరకు పేపరు తిరగేస్తుంటాడు. ఆమె వచ్చాక ఇద్దరూ కార్లో కూర్చుంటారు. ఆమె అన్యమనస్కంగా ఉండటాన్ని అతను గమనిస్తాడు. ఈసారి ఇద్దరూ కారు దిగి ఇంట్లోకి వెళ్తారు.
కాసేపటికి భర్త నెలల పసికందును భుజాన వేసుకొని బయటకు వస్తాడు భార్యను ఆఫీస్‌కి పంపడానికి బై చెప్తూ. డ్రైవింగ్ సీట్లో ఉన్న భార్య బిడ్డను వదల్లేనన్నట్టు చూస్తుంటే ‘మరేం పర్లేదు’ అన్నట్లు కళ్లతోనే భరోసా ఇస్తాడు. ఇది రేమండ్స్ ప్రెజెంట్ చేస్తున్న ఇప్పటి కంప్లీట్ మ్యాన్! డెబ్భైల నాటి యాడ్‌కి నేటి యాడ్‌కి ఎంత తేడా! ఇది కాలం మగవాడిలో తెచ్చిన మార్పు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ ఇలాంటి ఆధునిక తండ్రే. దర్శకురాలైన తన భార్య కిరణ్‌రావు పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటే అప్పటికి నెలల వయసున్న తమ కొడుకు ‘ఆజాద్’ బాధ్యతను ఆమిరే చూసుకున్నాడట. అంతేకాదు ఆజాద్‌ను బడిలో దింప డం, తీసుకురావ డం... రాత్రి కథలు చెప్తూ నిద్రపుచ్చడంకూడా ఇష్టంగా చేస్తాడట.