మనసున్న ఆటోవాలా
ఒక చిన్న సాయం ఓ మనిషి ప్రాణాలనే కాదు, ఓ కుటుంబాన్నీ నిలబెడుతుంది. ఈ సత్యం తెలిసిన వ్యక్తి ఎవరైనా సాయం చేయడానికి వెనుకాడడు. అలాంటి మనసున్న ఆటోడ్రైవరే నవీన్‌రెడ్డి. ఆయన చేసిన సాయం అతని మాటల్లోనే.. ‘ఓసారి నేను వెళ్లే దారిలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దానిపై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో చాలామంది పోగయ్యారు. కొందరు 108కి ఫోన్ చేస్తున్నారు. తప్పితే ఎవరూ క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. వాళ్లు చూస్తే రక్తమోడుతూ ఉన్నారు.
నేను వెంటనే నా ఆటోలో క్షతగాత్రుల్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. అక్కడి డ్యూటీ డాక్టర్ వేసిన మొదటి ప్రశ్న... ‘యాక్సిడెంట్ నువ్వు చేశావా?’. ఒక్క క్షణం కంగుతిని.. కాదని చెప్పాను. ‘మరి ఎందుకు జాయిన్ చేశావ’ని ఎదురు ప్రశ్నించాడు. ట్రీట్‌మెంట్ అయ్యే వరకూ అక్కడే ఉండి.. ప్రాణానికి ప్రమాదం లేదని తెలిశాకే అక్కడి నుంచి వెళ్లిపోయాను. డాక్టర్ ఇచ్చిన షాక్‌తో ప్రమాద బాధితులకు సాయం చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ పది రోజుల తర్వాత నా ఫోన్ రింగ్ అయింది. అవతలి వ్యక్తి నుంచి ‘థ్యాంక్స్, ఇవాళే డిశ్చార్జ్ అయ్యాను’ అన్న మాటలు వినిపించాయి. ఆ క్షణం చెప్పలేని ఆనందం కలిగింది. తోటి వారికి చేతనైనంతలో సాయం చేస్తే కలిగే ఆనందం వెలకట్టలేనిది’.