బాల్యమిత్ర
నిరాదరణకు పర్యవసానమే అనాథలు! వాళ్లకు మనమున్నాం అని చెప్పడమే కాదు నిలబడి చూపించడమే ఆదరణ!
ఆ బాధ్యతను తాము పంచుకుంటూ పౌర సమాజమూ పాలుపంచుకునేలా చూస్తోంది బాల్యమిత్ర నెట్‌వర్క్! దీనికింద పనిచేస్తున్న స్నేహఘర్, రెయిన్‌బో హోమ్సే కళ్లముందు కనిపిస్తున్న ఉదాహరణలు..
మా పిల్లల బర్త్‌డేస్ అక్కడ..
విమెన్ ఇన్ నెట్‌వర్క్ లాంటి స్వచ్ఛంద సంస్థలో చురుకైన భాగస్వామిగా ఉన్న యాంకర్ ఝాన్సీ రెయిన్‌బో హోమ్స్‌కీ ఆత్మీయ అతిథి. ‘ నేను మా పిల్లలతో సహా ముషీరాబాద్‌లోని రెయిన్‌బో హోమ్‌కి రెగ్యులర్‌గా వెళ్తాను. అన్నధారకూ కంట్రిబ్యూట్ చేస్తున్నాను. మా పిల్లలు వాళ్ల బర్త్‌డేలను అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ హోమ్స్‌లో అమేజింగ్ టాలెంట్ ఉన్న పిల్లలు ఎందరో. వాళ్లను ఎంకరేజ్ చేయాలనేదే మా ప్రయత్నం. ఏ కొంచెం టైమ్ దొరికినా పిల్లలతో రెయిన్‌బో హోమ్‌కి వెళ్లిపోతాను. నేను వెళ్లడమే కాదు నాకు తెలిసినవాళ్లనూ ఇన్‌వాల్వ్ చేస్తున్నాను. తనికెళ్ల భరణిగారు కూడా తనకు వీలు చిక్కినప్పుడల్లా మేడిబావిలోని స్నేహఘర్‌కు వెళ్తుంటారు. ఇప్పుడు మారియట్ హోటల్ తన ఇంపాక్ట్ డేని వీళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాపీగా ఉందని’ అన్నారు ఝాన్సీ.
అమన్ వేదికతోపాటు ఇంకో తొమ్మిది స్వచ్ఛంద సంస్థలు కలసి ఏర్పడిందే బాల్యమిత్ర నెట్‌వర్క్. నిరాదరణ, లైంగిక అఘాయిత్యాలు వంటి రకరకాల దాష్టీకాలకు బలైన పిల్లల కోసం దేశవ్యాప్తంగా స్నేహఘర్, రెయిన్‌బో హోమ్స్ అనే స్కూళ్లను నిర్వహిస్తోంది ఈ నెట్‌వర్క్. అబ్బాయిల కోసం స్నేహఘర్, అమ్మాయిల కోసం రెయిన్‌బో హోమ్స్. మన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఈ హోమ్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాంగణంలో అందరికీ జవాబుదారీగా ఈ హోమ్స్ నడుస్తున్నాయి.
వీటి ప్రధాన లక్ష్యం.. ఈ పిల్లలకు చదువు చెప్పిస్తూ వాళ్లనూ సమాజంలో భాగంగా మార్చడం. అంటే ఆ బాధ్యతను పౌరసమాజం తీసుకోవడం. చదువుల్లో, ఆటపాటల్లో, ఇతర యాక్టివిటీస్‌లో ఈ పిల్లలు నిజంగా రత్నాలే. ఎటొచ్చి వీళ్లకు కావల్సింది మేమున్నామనే భరోసా. మనమంతా ఒక కుటుంబమనే బంధం. ఇలాంటి భావాన్ని ఈ పిల్లల్లో కల్పించడం కోసం ఈ హోమ్స్ చేయని ప్రయత్నం లేదు. అయితే వీటి నిర్వహణకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయమూ లేదు. అందుకే వీరి భోజన ఖర్చు కోసమని ఇటీవలే ఈ హోమ్స్ ‘అన్నధార’ అనే కార్యక్రమం చేపట్టింది. మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన బర్త్‌డే లాంటి వేడుకలను మనం ఈ పిల్లలతో గడపడం.. మన ఆనందాన్ని వాళ్లతో పంచుకోవడమే కాదు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించినవారం అవుతాం.
మారియట్ ఇంపాక్ట్ డే
‘ఈ కార్యక్రమానికి మారియట్ హోటల్ ముందుకొచ్చింది. తన ఇంపాక్ట్ డేని ఈ పిల్లలతో కలసి సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు మారియట్ హోటల్‌లో సెలబ్రిటీలను అతిథులుగా పిలిచి ఈ పిల్లలకు ఆత్మీయులుగా చేయదలిచారు. ఆ రోజు మా పిల్లల ఆటాపాటా, చిత్రలేఖనం వంటి యాక్టివిటీస్ ఉన్నాయ’ని చెప్పారు రెయిన్‌బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కొండెపూడి అనురాధ.
- శరాది