అందమైన అద్దం | Beautiful mirror | Sakshi
Sakshi News home page

అందమైన అద్దం

Published Sat, Jan 31 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

అందమైన అద్దం

అందమైన అద్దం

అద్దంలో అందం చూసుకుని మురిసిపోవడం అందరికీ అనుభవమే. మరి ఇంటిని అద్దంలా మెరిసేట్టు చేయాలంటే..? ఇంట్లో గ్లాస్ డెకరేషన్ ఉంటే సరి. ఇలాంటి వారికోసం ఆవిర్భవించిందే ‘ఇర్షికా హ్యూజ్ డిజైనర్ గ్లాస్’ కంపెనీ. పేపర్ వెయిట్ నుంచి పెరట్లో డెకరేషన్ వరకూ అందమైన పెయింటింగ్ అద్దాలను అమర్చే కల్పనారావ్‌లో చాలా క్రియేటివిటీ ఉంది. అదేమిటో ఆమె మాటల్లోనే...
- భువనేశ్వరి

ఇంట్లో గ్లాస్ డెకరేషన్ కొత్త కళేమీ కాదు. పూర్వమెప్పటి నుంచో ఉన్నదే. ప్రత్యేకంగా ఆ పని మాత్రమే చేసేవారు మార్కెట్‌లో లేకపోవడంతో వాటిపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. నాకు ఇలాంటి ఆలోచన రావడానికి కారణం.. పదిహేనేళ్ల కిందట జరిగిన ఓ సంఘటన. ఒకరోజు మా బంధువుల ఇంట్లో పాతమంచానికి ఉన్న గ్లాస్‌వర్క్ పాడైపోయిందని, ఎవరైనా బాగుచేసేవారుంటే చూడమన్నారు. నేను వెళ్లి చూశాను. ‘నేను చేయలేనా?’ అనుకుని పని మొదలుపెట్టాను. ఆ మంచం ప్రత్యేకత ఏంటంటే.. చుట్టూ గ్లాస్ వర్క్ ఉంటుంది. లోపలి వైపు అరలు కూడా ఉంటాయి. చేయడం సులువే కానీ.. మెటీరియల్ దొరకడం చాలా కష్టమైపోయింది. నానా తిప్పలు పడీ.. మంచి ఆర్టిస్ట్, స్కల్ప్చర్ ఆర్ట్‌లో మంచి అనుభవం ఉన్న మా అమ్మ లావణ్యారావ్ సాయంతో పని పూర్తిచేశాను. చూసినవారంతా చాలా బాగుందన్నారు. వారి ప్రశంసలే నాతో డిజైనింగ్ గ్లాస్‌వర్క్ కంపెనీ పెట్టించాయి. మొదట్లో ఆర్డర్లను బట్టి మెటీరియల్ తెచ్చుకుని ఇంట్లోనే చేశాను. గిరాకీ పెరిగాక ‘ఇర్షికాహ్యూజ్ డిజైనర్ గ్లాస్’ కంపెనీ పెట్టాను.
 
యూనిక్ డిజైన్స్...  

అప్పుడప్పుడే ఇంట్లో డిజైనింగ్ గ్లాస్ ఉండాలని కోరుకుంటున్న రోజులు. కానీ దానికోసం ప్రత్యేకంగా పనిచేసే కంపెనీ లేకపోవడం, గ్లాస్ వర్క్ చేసేవారు ఉన్నా.. ఎక్స్‌క్లూజివ్ డిజైన్లు అందుబాటులో లేకపోవడం నాకు ప్లస్ అయ్యింది. కాకపోతే మెటీరియల్ కోసం నేను గుజరాత్, హర్యానా రాష్ట్రాలకు వెళ్లాల్సివచ్చేది. అందరికీ అద్దాల అందాలను పరిచయం చేయడానికి చాలానే కష్టపడ్డాను. నేను అదే సమయంలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ విభాగంలో మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేయడం కంపెనీ డెవలప్‌మెంట్‌కి కలిసొచ్చింది. అమ్మ ఆర్ట్‌ని జతచేయడంతో యూనిక్ డిజైన్లను పరిచయం చేయగలిగాను.
 
అభిరుచికి తగినట్టు...

పేపర్ వెయిట్ దగ్గర నుంచి అన్ని రకాల గ్లాస్ మెటీరియల్స్ ఉంటాయి. అద్దాల వర్క్ అనగానే సాధారణంగా కిటికీలు ఒక్కటే గుర్తుకొస్తాయి. అలాకాకుండా... పూజగది, వంటిల్లు, డైనింగ్ హాల్స్‌లో చేసే గ్లాస్‌వర్క్‌తో ఇంటి లుక్ మొత్తం మారిపోతుంది. ఉడ్‌వర్క్‌కి బదులు గ్లాస్‌వర్క్, కొన్ని రకాల వాల్ డిజైన్స్ చేస్తాం.  
 
లేడీస్ స్పెషల్...

గ్లాస్ వర్క్ అంటే సాధారణంగా పురుషులే చేస్తారు. కానీ... మా వద్ద గ్లాస్ పెయింటింగ్‌తో పాటు మ్యూరల్స్ వర్క్, పిక్చర్ ఫ్రేమింగ్ తదితర పనులన్నీ మహిళలే చేస్తారు. విమెన్ ఎంపవర్‌మెంట్ కాన్సెప్ట్‌తో 90 శాతం మహిళల్నే ఉద్యోగులుగా నియమించి శిక్షణ ఇస్తున్నాం. కోవెల ఆర్గనైజేషన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తున్నా. ఈ సంస్థ సహకారంతో పల్లెల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, వారే సొంతంగా ఈ పని చేసుకొనేలా సహకారం అందించాలన్నది లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement