కలర్‌పుల్ కపుల్
"when you make the sacrifice in marriage..
you're sacrificing not to each other
but to unity in a relationship...'
జోసెఫ్ కాంప్‌బెల్ అన్న ఈ మాటల్ని ఆచరణలో పెడ్తున్న జంట.. బోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, రోహిణీరెడ్డి. ఇద్దరూ చిత్రకారులే! అందుకే వీళ్ల దృష్టిలో పెళ్లి.. ఓ పెయింటింగ్.. ఈస్తటిక్స్ లాంటి ఎమోషన్స్ బ్యాలెన్స్ అయ్యే కాన్వాస్! వస్తువులన్నిటినీ చుట్టూ పరచుకోవడం ఈ ఫైనార్ట్స్ కాలేజ్ (మాసబ్‌ట్యాంక్) ప్రిన్సిపల్ నైజమైతే... అన్నిటినీ పద్ధతిగా సర్దిపెట్టడం ఆమె సహనం! సాధారణంగా జంటల మధ్య వచ్చే వైరుధ్యాలు టీ కప్పులో తుపాను సృష్టిస్తాయి. వీళ్లకు మాత్రం అటువంటి సందర్భాల్లో కుంచెలు మరింత వర్ణరంజితమవుతాయి. ఆ వైవిధ్యమే తమ బంధాన్ని ్ర్టాంగ్‌గా ఉంచుతుంది అంటారిద్దరూ! వీరి హార్ట్ బీట్ వినాలంటే ఈ ‘యూ అండ్ ఐ’ చదవాల్సిందే.
- బోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, రోహిణీరెడ్డి
బరోడా ఎమ్మెస్ యూనివర్సిటీలో శ్రీనివాస్, రోహిణి ఇద్దరూ క్లాస్‌మేట్స్. చిత్రలేఖనం.. ఇద్దరికీ ఇష్టమైన వ్యాపకం. అదే వృత్తి, ప్రవృత్తీను! ఇది తప్ప ఇంకే సారూప్యత లేకుండానే ఐక్యమైన జంట. ‘తనంటే నాకిష్టం. కలసి బతకాలనుకున్న అంతే. నేను ఆర్టిస్ట్, తనూ ఆర్టిస్ట్.. ఇద్దరం పెళ్లిచేసుకుంటే అండర్‌స్టాండింగ్ ఉంటుంది లాంటి ప్లాన్సేమీ లేకుండె’ అంటారు శ్రీనివాస్. ‘యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరే వర్క్ చేసేదాన్ని. నాకు ఆయన, ఆయన వర్కింగ్ స్టైల్ బాగా నచ్చాయి. కలసి జర్నీ చేస్తే బాగుంటుంది అనిపించి పెళ్లికి ఓకే అన్నాను’ చెప్పారు రోహిణి తనదీ ప్రీప్లాన్డ్‌లేని యాక్సిడెంటల్ డెసిషనే అన్నట్టుగా.
తెలుగు, గుజరాతీ నేపథ్యాలు ఇబ్బందిపెట్టలేదా?
‘అస్సలు పెట్టలేదు’ అంటారు ఏక కంఠంతో. ‘రాష్ట్రాలే కాదు, ఇద్దరి కుటుంబాలూ క్వైట్ డిఫరెంట్. రోహిణీ వాళ్లది కంప్లీట్ ఆర్ట్ ఫ్యామిలీ. వాళ్ల నాన్న నరోత్తమ్‌దాస్ లోహర్ పెద్ద ఆర్టిస్ట్. ఆ లెక్కన ఆమె ఆర్ట్‌ను చూస్తూ కళ్లు తెరిచినట్టు. మా ఫ్యామిలీ దానికి పూర్తిగా భిన్నం’ అని చెప్తారు శ్రీనివాస్. ‘వాళ్లది ఆర్ట్ ఫ్యామిలీ కాకపోయినా నాకేనాడూ ఇబ్బంది కలగలేదు. అత్తగారు, బావగారు వాళ్లు వచ్చినా జీన్స్‌వేసుకొని నాపాటికి నేను బొమ్మలు గీస్తూ ఉండిపోయినా.. నన్ను తప్పుపట్టినవారు లేరు. వాళ్లు నన్ను కేవలం కోడలిగానే కాదు కోడలిలోని కళాకారిణినీ గుర్తించారు.. గౌరవిస్తున్నారు. ఈ అండర్‌స్టాండింగే కదా కోరుకునేది’ చెప్తారు రోహిణి.
కాన్‌సన్‌ట్రేషన్.. కాన్షస్ అంతా ఆర్టే
‘వంటలో ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైందనే కంప్లైంట్స్ ఉండవు నా మీద’ అని రోహిణి అంటుంటే ‘నాకు ఈ చీర కొనలేదు, ఈ నగలు చేయించట్లేదనే డిమాండ్స్ నాకూ ఉండవు’ అంటారు శ్రీనివాస్ పాజిటివ్ కౌంటర్‌గా. మరి ఎలాంటి విషయాల్లో గొడవలుంటాయి అని అడిగితే ‘నాకు సంబంధించిన వస్తువులన్నిటినీ చుట్టూ పరుచుకోవడమే కంఫర్ట్. అన్నీ అట్లా చిందరవందరగా ఉంటేనే నాకు కావల్సినవి కరెక్ట్‌గా దొరుకుతాయి. తనకేమో అన్నీ పర్‌ఫెక్ట్‌గా.. ఏది ఎక్కడుండాలో అక్కడ అందంగా సర్దడం అలవాటు. ఇందులో గొడవుంటుంది’ అని అతను చెప్పేలోపే ‘మేం తయారు చేసిన స్కల్స్ గోడకేసి విసిరికొట్టేంతగా గొడవ’ అంటూ రోహిణి పూర్తిచేశారు. ‘డబ్బు గురించి.. ఇంకా దేని గురించీ ఆలోచించం. మా ఇద్దరి కాన్‌సన్‌ట్రేషన్, కాన్షస్ అంతా మా ఇద్దరి ఆర్ట్ గురించే’అంటారు.
ఈగోలు..కోపాలు.. గట్రా...
‘ఉంటాయి. అవి ఉంటేనే కాపురం’ అని ఠక్కున ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్. ఆ జవాబు వినిపించిన ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే వివరణా ఇస్తారు ఇలా... ‘ఏ ఆర్టిస్ట్‌కైనా ఈగో ఉండాలి. అది ఉంటేనే తన కళకు మెరుగులద్దుకోగలడు. భార్యాభర్తలు అందునా ఆర్టిస్టులు కాబట్టి ఈగో అనివార్యం. అలాగే కోపం కూడా. అవి మా ఇద్దరికీ ఉన్నాయి. తనేదైనా బొమ్మ వేస్తున్నప్పుడు డౌట్ వస్తే అడుగుతుంది. కానీ ఆ సలహాను పాటించదు. తనకు నచ్చిందే చేస్తుంది. తన పట్ల తనకున్న నమ్మకం కావచ్చు. కానీ ఆ సమయంలో నా ఈగో హర్ట్ అవుతుంది. వినని విషయాన్ని అడగడమెందుకు అని’ అంటారు. ‘అప్పుడు హర్ట్ అయిన ఈగోని మళ్లీ నేను డౌట్ వచ్చినప్పుడు అడిగితే చెప్పకుండా శాటిస్‌ఫై చేసుకుంటారు. కానీ నేనిచ్చిన సలహాను మాత్రం ఆయన పాటిస్తారు’ అని చెప్తారు రోహిణి.
అన్నీ కలిస్తేనే కాపురం..
‘మా మధ్య వచ్చే ఈ ఈగో ప్రాబ్లమ్స్, తగాదాలు ఏవైనా మా ఇరవై ఐదేళ్ల అనుబంధాన్ని స్ట్రాంగ్ చేశాయే తప్ప ఏనాడూ బాధపడేలా చేయలేదు. ఒక ఆర్ట్‌కి ఈస్తటిక్స్ ఎంత ప్రాణం పోస్తాయో.. ఒక నాటకానికి నవరసాలు ఎంత ముఖ్యమో.. కాపురానికి ఇవీ అంతే అవసరం’ అని రోహిణి చెప్తుంటే ‘అవి మాకు ఔట్‌లెట్స్‌గా పనిచేసి, మా కంపానియన్‌షిప్‌ను స్ట్రాంగ్ చేశాయి. మా మధ్య అవగాహనను పెంచాయి’ అంటారు శ్రీనివాస్.
వి ఆర్ హ్యాపీ..
‘పెళ్లి.. అనేది మేమిద్దరం కలసి మొదలెట్టిన జర్నీ. ఎన్ని ఒడిదుడుకులున్నా ముందుకు సాగడమే తెలుసుకున్నాం’ శ్రీనివాస్. ‘ఇన్నేళ్ల మా కాపురంలో మా ఇద్దరి లోటుపాట్లనెప్పుడూ మేం ఎంచుకోలేదు. అసలా ఆలోచనే రాదు ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవడం తప్ప’ అంటూ ఈ సంభాషణకు అందమైన ముగింపునిచ్చారు రోహిణి.
- సరస్వతి రమ