పెళ్లికి ముందు శృంగారం ముప్పు!
పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొనడం అనేది నేటి కొంతమంది యువతకి పెద్ద ఫ్యాషనైపోయింది. మితిమీరిన స్వేచ్ఛతో కొందరు కలసి తిరగడానికి, మరి కొందరు సహజీవనం చేయడానికి అలవాటుపడిపోయారు. అయితే ఇటువంటి వ్యవహరాలలో ఎక్కువగా మోసపోయేది, నష్టపోయేది యువతులే. యువతులు మోసపోయిన ఘటనలు ప్రతిరోజులో మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయినా పెళ్లికి ముందు విచ్చలవిడిగా తిరగడం, శృంగారంలో పాల్గొనడం మాత్రం తగ్గడంలేదు. ఇంకా పెరుగుతూ ఉంది. మోసపోయిన యువతులు, ఆ తరువాత ఆత్మహత్యలు చేసుకునే యువతుల సంఖ్య కూడా రోజుజోరుకు పెరిగిపోతోంది.
ఆంధ్ర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో కేంద్ర ఆరోగ్య శాఖ వారు గతంలో నిర్వహించిన ఒక సర్వేలో పెళ్లికి ముందు శృంగారంపై ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో 15 -24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను ప్రశ్నించారు. వారిలో 24 శాతం మంది అమ్మాయిలు తాము పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఆ చెప్పినవారు 15 ఏళ్ల వయసువారే. ఇది ఆందోళన కలిగించే అంశమైనా వాస్తవం. అమ్మాయిలతో పోల్చినప్పుడు అబ్బాయిల శాతం తక్కువగా ఉంది. ఏది ఏమైనా వివాహానికి పూర్వం శృంగారం చాలా సాధారణమైపోయిందని తేలింది.
పెళ్లికి ముందు శృంగారాన్ని సమర్ధించేవారు కూడా తక్కువ ఏమీలేరు. ప్రముఖ సినీ నటి ఖుష్బూ పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో కేసులు కూడా నమోదయ్యాయి. తనపై కేసులను కొట్టేయాలని కుష్బూ పెట్టుకున్న పిటిషన్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టు ఆమెపై కేసులను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ప్రతి వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, ఓ వ్యక్తి మాట్లాడే మాటలను భూతద్దంలో చూడటం సరి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని, పైగా ఇలాంటి సంబంధం వల్ల వారిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందని సెక్సీ భామ షెర్లిన్ అంటున్నారు. కామసూత్ర 3డి సినిమా కోసం ఆమె నగ్నంగా ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు శృంగారం పెళ్లి వరకు వచ్చినప్పుడే షెర్లిన్ చెప్పినట్లు బంధం పలపడుతుంది. అలా కాకపోతే ఆ యువతే నష్టపోవలసి వస్తుంది. సెలబ్రిటీలకే ఏమై చెబుతుంటారు. ఇటువంటి విషయాలలో సాంప్రదాయాలు, కట్టుబాట్లు మధ్య జీవించే సామాన్య యువతులే ఎక్కువ బాధలు పడేది.
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొని మోసపోయిన యువతులు చేసే ఫిర్యాదులు కూడా తక్కువేంలేవు. గత జూన్ నెలలోనే రాష్ట్ర మహిళా కమిషన్కు ఇటువంటి ఫిర్యాదులు దాదాపు 150 వరకు వచ్చాయి. ఉన్నత చదువులు చదివి, వివిధ సంస్దలలో ఉద్యోగాలు చేస్తున్న 20-24 సంవత్సరాల మధ్య వయసున్న యువతులే ఎక్కువగా ఉన్నారు. తాము నమ్మిన వారి చేతిలో మోస పోయామని న్యాయం కోసం వారు మహిళా కమిషన్ను ఆశ్రయించారు. ధైర్యం చేసి ఫిర్యాదు చేసినవారు మాత్రమే వీరు. ఇక బయటకు చెప్పుకోలేక లోపలలోపల కుమిలిపోయేవారి సంఖ్య ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. అందువల్ల ఎవరు ఎన్ని చెప్పినా ఈ సంఘటనలు యువతులు తమ జాగ్రత్తలో తాము జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక చేస్తున్నాయి.