
కునుకుతో నాజుకుదనం
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? శరీరాన్ని నాజూగ్గా ఉంచుకుని మెరుపు తీగలా మారిపోవాలని ఉందా? బొద్దుగుమ్మలాంటి మీరు... జీరో సైజుకు రావాలనుకుంటున్నారా? అయితే ఎంచక్క... ఎక్కువ సేపు కునుకు తీయండి. మీ ప్రోబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ విషయం అతివలపై జరిపిన పరిశోధనలలో తేలింది.
మారుతున్న పరిస్థితుల్లో నేటి తరం యువత... ముఖ్యంగా మహిళల్ని అమితంగా వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ఉరుకుల పరుగుల జీవితం, వేళాపాళా లేని ఉద్యోగాలు, మారుతున్న ఆహార అలవాట్లు... తగ్గుతున్న శారీరక శ్రమ, నిద్రలేమి ఇవన్నీ ఊబకాయానికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని అదుపులో ఉంచుకుని ఆకృతి చెడిపోకుండా నాజూగ్గా కనిపించేందుకు జిమ్‌ల చుట్టూ తిరిగేవారు కోకొల్లలు.
దీనిపై అమెరికాకు చెందిన రెండు పెద్ద యూనివర్సిటీలకు చెందిన సుమారు 300మంది మహిళలపై... బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూస్ బైలీ నిర్వహించిన పరిశీలనలో ఓ విషయం తేలింది. ఎవరైతే చక్కగా నిద్రపోతారో వారిలో ఊబకాయం లేదని గుర్తించారు. నిద్ర విషయంలో కచ్చితమైన సమయాన్ని పాటిస్తే ఊబకాయం దరిచేరదని ఆ అధ్యయం తేల్చింది. 17 నుంచి 26 ఏళ్ల వయసున్న యువతులపై జరిపిన పరిశోధనల్లో ముందుగా వారి శరీర ఆకృతి, నిద్రపోయే సమయాలపై దృష్టిసారించారు.
వారంపాటు పరిశోధనలు సాగించారు. ఈ అధ్యయనంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయం, ఉదయం నిద్రలేచే సమయానికి ...శరీర బరువుకు సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి... దాదాపు అంతా ఒకే సమయానికి నిద్రలేచేవారి శరీర బరువులో మార్పులేమీ లేవని గుర్తించారు. గంటన్నర ఆలస్యంగా పడుకుని, నిద్రలేచిన యువతుల్లో శరీరంలో కొవ్వు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది.
ముఖ్యంగా నిద్రలేచే సమయం శరీరాకృతిని ప్రభావితం చేస్తోంది. తరచూ ఒకే సమయానికి నిద్రలేచేవారిలో ఎలాంటి ఒబెసిటీ లక్షణాలు కనిపించలేదని ఈ అధ్యయన బృందం గుర్తించింది. చక్కటి ఆకృతి కోసం నిద్రపోవాల్సిన సమయం 8 నుంచి ఎనిమిదిన్నర గంటలని పరిశోధన బృందం గుర్తించింది. 8 గంటలు నిద్రపోతే కొవ్వు తగ్గుతుందంటూనే...అతి నిద్ర పనికిరాదని ఫ్రొఫెసర్ బెయిలీ హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలూ చూశారుగా ఇక నుంచి హాయిగా నిద్రపోండి, మీరు కోరుకునే స్లిమ్ అన్ ఫిట్ బాడీని సొంతం చేసుకోండి.