
దోమలకు మనం కనిపించకపోతే!
కొన్ని రకాల రసాయనాల ద్వారా.. అసలు మనుషులే దోమలకు కనిపించకుండా అదృశ్యంగా ఉండే విధానాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
దోమల వల్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. మనిషి కనిపిస్తే చాలు, కుట్టిపెట్టడం, రాత్రిళ్లు నిద్ర పట్టనివ్వకుండా చెవి దగ్గర రొదపెట్టడం, అవి కుడితే లేనిపోని రోగాలు రావడం.. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పలేనన్ని ఇబ్బందులు. వాటి బారి నుంచి తప్పించుకోడానికి మస్కిటో కాయిళ్లు, ఆలౌట్లు, దోమతెరలు, తాజాగా బ్యాట్లు.. ఇలా చాలా ఉపయోగిస్తున్నాం. కానీ, ఇవేమీ అక్కర్లేకుండా సులభంగా దోమల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఒకటుంది తెలుసా? మనిషి చర్మం నుంచి సహజంగానే ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాయనాల ద్వారా.. అసలు మనుషులే దోమలకు కనిపించకుండా అదృశ్యంగా ఉండే విధానాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అసలు దోమలకు మనం కనిపించకపోవడంతో అవి కుట్టే అవకాశమే ఉండదు!!
ఇండియానాపొలిస్లో జరిగిన అమెరికన్ కెమికల్ సొసైటీ సమావేశంలో పరిశోధకులు ఈ విషయాన్ని వివరించారు. కొన్ని రకాల రసాయనాల సమ్మేళనం దోమలకు ఉండే ఆఘ్రాణ శక్తిని (వాసన పసిగట్టే శక్తి) అడ్డుకుంటాయని వారు చెబుతున్నారు. ఇందుకోసం మస్కిటో రిపెల్లెంట్లలో ఉండే రసాయనాలనే వారు ఎంచుకున్నారు. ప్రధానంగా ఎక్కువ దోమల నివారకాలలో ఉపయోగించే డీట్ అనే పదార్థం ఎక్కువ ప్రభావవంతంగా ఉంది. అయితే చాలామందికి దాని వాసన అంతగా పడదని అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన పరిశోధకుడు ఉల్రిచ్ బెర్నియర్ చెప్పారు.
దీనికి పరిష్కారంగా, దోమల ఆఘ్రాణశక్తిని పూర్తిగా అరికట్టే పదార్థాలను ఉపయోగించారు. సాధారణంగా మనుషులను కుట్టిపెట్టేది ఆడదోమలే. ఇవి గుడ్లు పెట్టాలంటే ఒకరకమైన ప్రోటీన్ కావాలి. దానికోసమే ఇవి రక్తం తాగుతాయి. మనుషులు వంద అడుగుల దూరంలో ఉన్నా కూడా.. వాటికి ఇట్టే తెలుస్తుంది. దోమలు, ఈగల గురించి, వాటి 1940ల కాలం నుంచి అమెరికా వ్యవసాయ శాఖలో పరిశోధనలు జరుగుతున్నాయి. మానవుల శరీరం నుంచి వెలువడే రసాయనాలు, లేదా చర్మం మీద ఉండే బ్యాక్టీరియా నుంచి వెలువడే రసాయనాలలో కొన్ని దోమలకు బాగా రుచికరంగా కనిపిస్తాయి. దానివల్ల దోమలు దూరం నుంచే మనుషులను పసిగట్టి, దగ్గరకొచ్చి కుట్టి.. రక్తం పీల్చేస్తాయి. అందువల్ల ఏయే పదార్థాలు దోమలకు బాగా ఇష్టమన్న విషయాన్ని ముందుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే సమయంలో వాటికి ఏవేం రసాయనాలు పడవో కూడా చూశారు. ఒక స్క్రీన్ తీసుకుని, దానికి ఒకవైపు రకరకాల పదార్థాలు స్ప్రే చేశారు. వాటి ప్రభావం దోమలమీద ఎలా ఉంటుందో చూశారు.
మనుషుల చెమటలో సహజంగా ఉండే లాక్టిక్ యాసిడ్ లాంటి వాటికి దోమలు బాగా ఆకర్షితం అవుతున్నాయి. దీంతో 90 శాతం దోమలు అది ఉన్న స్క్రీన్ వైపు వచ్చాయి. అదే వేరే రసాయనాలు చల్లితే మాత్రం అసలు ఎటువైపు వెళ్లాలో కూడా తెలియక అయోమయానికి గురయ్యాయి. అలాంటి రసాయనాలు చేతిమీద చల్లుకుని, ఆ చేతిని దోమలున్న ఒక బోనులో పెట్టినా కూడా అవి అసలు కుడితే ఒట్టు. అక్కడ చెయ్యి ఒకటుందని కూడా అవి గుర్తించలేకపోయాయి. అంటే, ఆ రకం రసాయనాలు ఉంటే దోమలకు మనం కనిపించకుండా.. అదృశ్యంగానే ఉంటామని శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రధానంగా 1-మీథైల్పైపర్జైన్ అనే పదార్థం దోమల ఆఘ్రాణ శక్తిని అడ్డుకుంటోంది. దీని ద్వారా దోమలను సమర్థంగా అడ్డుకోవచ్చని తేలిపోయింది!!