
షహర్ కీ జిందగీ.. ఏక్ పహేలీ!
రవీంద్రభారతిలో నేడు ‘కవితాక్షరసుమార్చనమ్-వనితాసమ్మేళనం’ జరగనుంది.
షహర్ కీ జిందగీ ఏక్ పహేలీ !
ఎప్పుడు నవ్విస్తుందో.. ఇంకెప్పుడు కవ్విస్తుందో..
మరెప్పుడు ఏడ్పిస్తుందో తెలియదు!
అన్నిటినీ అందుబాటులో ఉంచి.. ఉట్టి కొట్టే ఆటాడిస్తుంటుంది !
అందుకే చేతికందేవెన్నో చెయ్యిజారేవీ అన్నే!
హైదరాబాద్‌లో జీవితమంటే పజిల్‌లాంటిదే మరి!!
రవీంద్రభారతిలో నేడు ‘కవితాక్షరసుమార్చనమ్-వనితాసమ్మేళనం’ జరగనుంది. ఈ సందర్భంగా అందులో పాల్గొననున్న కవయిత్రులు లక్కరాజు నిర్మల, డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి, శైలజామిత్ర, గిరిజారాణిలను ‘సిటీప్లస్ ’పలకరించింది. సిటీ అందాల వర్ణనతో మొదలైన ఈ మహిళామణుల కవితా ప్రస్థానం.. మానవసంబంధాలు, రోడ్లు, ట్రాఫిక్ మీదుగా సాగి హైదరాబాద్ సౌకర్యాల దగ్గర ఆగిపోయింది.
‘హైదరాబాద్ అందాల రాణి.. గోల్కొండకోట ఆమె కిరీటమైతే.. చార్మినార్ చూడామణి.. మూసీ (ఆనాటి స్వచ్ఛమైనది) వాలుజడ.. పచ్చిక మైదానాలు కంఠాభరణాలు.. హుస్సేన్‌సాగర్ (నాటి మంచినీటి సరస్సు) మెరిసే వడ్డాణం.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆ సుందరి కాళ్లపట్టీలు.. ఇన్ని అందాల కలబోత అయిన నా భాగ్యనగరం బంగారుకాంత..’ అంటూ రాగం అందుకున్నారు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి. ‘ఈ అందాల వెనుక అసలైన జీవితమూ ఉంది సుమా.. అది కనిపించనివ్వకుండా ఈ నగరం ఈ మధ్య హైటెక్ అట్టవేసుకుంది. ఊపిరాడని బూరుగు దూదిపై చలికాచుకుంటోందా డాంబికం. ఆ అట్ట తొలగి చూద్దుమా.. కదిలించే కథలు.. వ్యథలు’ అని సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసింది శైలజామిత్ర.
జెట్ స్పీడ్ జవ్వనులు
నగరంలో మహిళా పాత్ర.. అమోఘమంటూ ‘ఇంట్లో, ఆఫీసుల్లో.. బాధ్యతల్లో.. జెట్ స్పీడ్‌తో వెళ్లిపోతుంది. మల్టీటాస్క్‌కి స్టాండర్డ్ నిర్వచనాన్నిస్తోంది’ అని లక్కరాజు నిర్మల నేటి మహిళా రూపాన్ని వర్ణించారు. ‘ఇందులో స్త్రీ గొప్పదనం ఉంది.. అలా బతకడం నేర్పిస్తున్న సిటీ
విశేషణమూ ఉంది. నగర జీవనంలో మగాడే సంపాదిస్తే గడవని పరిస్థితి.. అందుకే ఆమె విల్లుపట్టక తప్పట్లేదు. ఈ జీవనపోరులో విజయానికి ఈ నగరం రకరకాల అవకాశాలను చూపిస్తోంద’ని గిరిజారాణి వివరించారు. ‘వంట తప్ప ఇంకోటి తెలియని వనితలకూ సిటీ బతుకుదెరువు చూపిస్తోంది. అమృతంలాంటి చేతివంటతో ధనభాగ్యాన్నిఅందుకుంటోంది.. శుచి శుభ్రమైన కర్రీపాయింట్లతో రుచికరమైన పదార్థాలు వడ్డిస్తూ.. మెరిట్‌పాయింట్లు కొట్టేస్తోంది’ అని ముక్తాయింపునిచ్చారు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి.
గతుకుల ప్రయాణం..
చెడులో మంచిని చూసుకోవడం.. విషాదంలో ఆనందాన్ని వెతుక్కోవడం.. నగరవాసులకే తెలిసిన విద్యేమో. ఇక్కడి పరిస్థితులు ఆ సర్దుబాటును నేర్పుతాయంటారు ఈ మహిళామణులు. నల్లతాచులా మెరిసే నున్నటి రోడ్లు .. హైదరాబాదీలను ఊరించే కల. అతుకులగతుకుల సిటీ దారులు.. ఎందరి డాక్టర్లకు కాసులు పండించాయో.. ఎందరు ఎముకల వైద్యులను నిపుణులుగా మార్చాయో..! ఎంతమంది తల్లులకు పురిటి ఖర్చులు మిగిల్చాయో..! అందుకే ‘నగరంరోడ్లు తల్లిలాంటివి.. ఆమెకు పురుడు పోస్తున్నాయి’ అని వ్యంగ్యంగా సెలవిచ్చారు శైలజామిత్ర. ‘సిటీల సిత్రాలు సూడవోయి గతుకుల రోడ్లమీద సిటుక్కున కూలవడితి’అని చెప్పి నవ్వించారు నిర్మల. ‘రోడ్డుపై స్పీడుబ్రేకర్లు.. నీకొచ్చే కష్టాలు! ఆగి సాగమని చెప్తాయ్!’ అంటూ కొనసాగించారామె. ‘ఇదేం హైదరాబాదో అర్థంకాదు.. రాత్రి పనిజేయాల.. పగలు నిద్రపోవాల’ అని సాఫ్ట్‌వేర్ మీద సెటైర్లు వేశారు.
అనుబంధాల వేదిక..
అనుబంధాలు.. ‘నాణానికి అటూఇటూ లాంటివి. పక్కన ఎవరున్నారో పట్టించుకోకుండా మూసిన తలుపుల వెనుకే జీవితాలను వెళ్లదీసే తత్వం ఎంత ఉందో.. చిన్న కష్టమొచ్చినా పెద్దమనసుతో చెంతచేర్చుకునే ఆత్మీయతా అంతే ఉంది. ఇలాంటి ఆప్యాయతకు
మల్కాజిగిరిలో ఉంటున్న మా ఫ్లాట్లే ఉదాహరణ’ అని ప్రమీలాదేవి అంటే ‘అసలేమీ పట్టించుకోనితనానికి గాంధీనగర్‌లోని మా వాడ నిదర్శనం’ అని మరోకోణాన్ని ముందుంచింది శైలజామిత్ర. ‘ఎక్కడైనా రెండూ ఉంటాయి. హిందూముస్లిం ఐక్యతకే ఐకాన్ అయిన హైదరాబాద్‌లో అనుబంధాలకు కొదువలేదు. కాస్మొపాలిటన్ కల్చర్‌కి నిదర్శనం సిటీయేనని.. మన దగ్గర జరిగే వినాయకచవితి, రంజాన్, క్రిస్మస్, ఓనం వంటి పండుగలు రుజువు చేయట్లేదా! వీటన్నింటినీ హైదరాబాద్ సెలబ్రేట్ చేసుకుంటది ఆనందంగా. ఇంతకు మించిన ఆప్యాయత, ఐక్యతలు ఎక్కడుంటాయి’ అని ముగించింది లక్కరాజు నిర్మల. ఆమె మాటను మిగిలినవాళ్లూ అంగీకరించారు.
..:: సరస్వతి రమ