దిలీప్ రెడ్డి
సమకాలీనం
మీడియా ప్రశ్నించలేని సందర్భాల్లో కూడా ప్రభుత్వాన్ని, బడా పారిశ్రామికవేత్తలను నిలదీసే అవకాశాన్ని సామాజిక మాధ్యమం కల్పిస్తోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది నరేంద్ర మోదీకి అనుకూలంగానూ నిలిచింది. నిన్నటి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం తీరునూ ప్రశ్నించింది. సామాజిక మాధ్యమం ఇరువైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ నేరాల నియంత్రణకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఆ సాకుతో సామాజిక మాధ్యమాల్ని కట్టడి చేసి, పౌరుల ప్రాథమిక హక్కులను హరించే ఏ ప్రక్రియనూ ప్రజాస్వామ్యవాదులు హర్షించరు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం మామూలే! ప్రజాతీర్పునకు అనుగుణంగా పార్టీలు అధికారాన్ని చేపడతాయి. కానీ అధికారంతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలకూ తమవైన విధానాలు ఉంటాయి.. ఉండాలి కూడా. కానీ, వివాదాస్పద ఐటీ (సమాచార సాంకేతిక పరిజ్ఞానం) చట్టం-2008, సెక్షన్ 66ఏ విషయంలో బీజేపీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారంలోకి వచ్చాక మరోలా స్పందించింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఐటీ చట్టంలోకి ‘సెక్షన్-66ఏ’ను చేర్చిన యూపీఏ సర్కారు బాటలోనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నడవటం విస్మయాన్ని కలిగిస్తోంది. 2008లో ‘ఐటీచట్టం-2000’కు నాటి ఐటీ మంత్రి కపిల్ సిబల్ సవరణల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. సైబర్ నేరాల నియంత్రణ పేరిట పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే 66ఏను వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. నేడు సీన్ మారింది. పూర్తిస్థాయి చర్చలేకుండానే కొత్త ఐటీ చట్టం-2008ను తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రస్తుత లోక్‌సభలో దక్కలేదు. బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రతిపక్ష స్థానం నుంచి పాలకపక్షంగా మారింది. ప్రతి పక్షంగా పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నదన్న సెక్షన్- 66ఏ విషయంలో కాంగ్రెస్ విధానాన్నే అదీ అనుసరిస్తోంది. ఇదే విషయాన్ని గత వారం సుప్రీంకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. ఇది ప్రజాతీర్పును వంచించినట్టు కాదా? అని ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. అసలు 66ఏ లో ఏముందంటే... ‘‘ప్రమాదకరమైన, భయంకరమైన, ఇతరులకు కోపాన్ని, అస హనాన్ని, లేదా అవమానాన్ని కలిగించే ఎలాంటి సమాచారాన్నయినా కంప్యూటర్/అలాంటి ఏదైనా డివైస్ ద్వారా పంపిస్తే (వ్యక్తం చేస్తే) నేరంగా పరిగణించాలి. దానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.’’ అటువంటి సమాచారాన్ని ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు అడ్డగించవచ్చు, జోక్యం చేసుకోవచ్చు, నిలువరించవచ్చు, తొలగించవచ్చు... ఇలా విసృ్తతాధికారాలను ఈ చట్ట సవరణతో కట్టబెట్టారు. సైబర్‌క్రైమ్‌ను నియంత్రించడం అవసరమే, కానీ అది రాజ్యాంగం హామీ ఇచ్చిన భావప్రక టనా స్వేచ్ఛను పణంగా పెట్టి కాకూడదు. ఇది, రాజ్యాంగం అధికరణం 19(1)ఎ కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు పూర్తి విరుద్ధమని దేశంలోని మేధావివర్గం, పౌర హక్కుల సంఘాలు గొంతెత్తి ఘోషించాయి. మరోవైపు అంతర్జాతీయ సైబర్ నేర వ్యవస్థ రోజురోజుకు రాటుదేలుతూ పెనుసవాలు విసురుతున్న తరుణంలో మనం దాన్ని ఎదుర్కొనే విషయంలో దుర్బల స్థితిలో ఉన్నాం. మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచార సాంకేతిక (ఐటీ) వ్యవస్థ తెలివైన ప్రత్యర్థులు ‘ఉఫ్’ అంటే కూలిపోయే పేకమేడ అని హెచ్చరికలు వస్తున్నాయి. కీలకమైన ఈ అంశంపై ఏ మాత్రం శ్రద్ధపెట్టని మన పాలకులు సైబర్ నేరాల నియంత్రణ సాకుతో పౌరుల ప్రాథమిక హక్కు ల్ని కొల్లగొట్టడం ఏ మేరకు సమంజసమన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ముంబై బంద్‌ను ప్రశ్నించినందుకు అరెస్టు
శివసేన అధినేత బాల్‌ఠాక్రే చనిపోయినప్పుడు ముంబైలో బంద్ పాటించ డాన్ని షహీన్ ధద అనే యువతి ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. రేణు శ్రీనివాసన్ అనే మరో యువతి ఆ కామెంట్‌కు ‘లైక్’ కొట్టింది. దాన్ని నేరంగా పరిగణించి ఆ ఇద్దరు యువతులను పోలీసులు 2012లో అరెస్టు చేశారు. సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగించిన బంద్‌ను ప్రశ్నించడం కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని, అయితే విస్తృత అర్థాన్నిచ్చే విధంగా ఐటీ చట్టం 66ఏను అన్వయించి వారిని అరెస్టు చేయడమంటే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేననీ, ఐటీ చట్టంలోని ఆ సెక్షన్‌ను తొలగిం చాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రేయా సింఘాల్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజం(పిల్) వేశారు. ఈ కేసు గత వారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. ఐటీ చట్టం లోని సెక్షన్-66ఏను సమర్థిస్తూ ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తన వాదనను సమర్పించారు. కేవలం వాట్సాప్‌లో సమాచారం వ్యాప్తి చేసినందుకు, ఫేస్‌బుక్‌లో భావ వ్యక్తీకరణ చేసినందుకు నేరాభియో గంతో అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు ఇటీవలే ఒక కేసులో స్పష్టం చేసింది. సైబర్ నేరాల నియంత్రణకు చట్ట సవరణ చేయడం వెనుక ఉద్దేశం మంచిదే కావచ్చు. కానీ, దాన్ని ఆధారంగా చేసుకొని నియంత్రణ వ్యవస్థలు, ప్రభుత్వాలు, పాలకులు అడ్డగోలుగా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడానికి ఆస్కారం కల్పించకూ డదు. చట్టాల్ని, చట్టాల్లోని అంశాల్ని ఇలా దుర్వినియోగపరచడానికి తావిచ్చేలా రూపొందించవద్దనేదే ప్రజస్వామ్యవాదుల ప్రగాఢ వాంఛ.
మీడియా ప్రశ్నించలేని సందర్బాల్లోనూ...
2013లో సంజయ్ చౌధురిని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌పై కార్టూన్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్టూన్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేసినందుకు ప్రొఫెసర్ అభికేష్ మహాపాత్రని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలు పత్రికల్లో ప్రచురిస్తే నేరం కానప్పుడు, సామాజిక మాధ్యమాల్లో వినియోగిస్తే నేరం ఎలా అవుతుందనే ప్రశ్నకు ప్రభుత్వాల వద్ద సమాధానం లేదు.
మీడియా ప్రశ్నించని సందర్భాల్లో కూడా ప్రభుత్వాన్ని, అధికారులను, బడా పారిశ్రామికవేత్తలను నిగ్గదీసి అడిగే అవకాశాన్ని ప్రజలకు సామాజిక మాధ్యమం కల్పిస్తోంది. పలు అగ్రగామి మీడియా సంస్థలు ప్రభుత్వ ప్రకట నల మీద, వారి అండదండల మీద ఆధారపడినవే. ప్రభుత్వ పెద్దలకు ఆగ్ర హం కలిగించే వార్తల ప్రచురణ, ప్రసారాలు వాటికి సాధ్యం కాకపోవచ్చు.. కొందరు బడా పారిశ్రామికవేత్తలు మీడియా సంస్థలను శాసించే స్థితిలో ఉన్నారు. వారి వెనుక కూడా పాలకపక్షాలు, ప్రభుత్వాధినేతలూ ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో అన్యాయాన్నీ, అక్రమాలనూ, అవినీతినీ, అసమర్థతను ప్రశ్నించడానికి సామాజిక మాధ్యమం ఒక మార్గం. ఇంగ్లీషులో ‘కామన్స్’ అని చెప్పే సమాజ సంపదలైన సహజవనరుల్ని కొల్లగొట్టేలా ప్రభుత్వాలు అనుసరించే నయా పారిశ్రామిక అనుకూల విధానాన్ని నిగ్గదీయడానికి సామాన్యునికి ఉన్న గొప్పవేదిక..సామాజిక మాధ్యమం. మొన్నటి సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గాలి వీయడంలో సామాజిక మాధ్యమం కీలక పాత్ర పోషించింది. అదే సామాజిక మాధ్యమం నిన్నటి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం తీరునూ ప్రశ్నించింది. సామాజిక మాధ్యమం ఇరువైపులా పదునున్న కత్తిలాంటిది. ప్రభుత్వాలను కదిలించే దిశగా ప్రజాభిప్రాయాన్ని మలిచే సత్తా దీనికుంది. సైబర్ నేరాల నియంత్రణకు ఎవరూ వ్యతిరేకం కాదు. నియంత్రించే తీరు పట్లే అభ్యంతరం. ఆ సాకుతో సామాజిక మాధ్య మాల్ని కట్టడి చేసి, పౌరుల ప్రాథమిక హక్కులను హరించే ఏ ప్రక్రియనూ ప్రజాస్వామ్యవాదులు హర్షించరు. ప్రభుత్వాలు నిస్సిగ్గుగా తెచ్చిన, తేదల చిన నల్లచట్టాలను లోగడ జరిగిన అనేక ప్రజా ఉద్యమాలు తిప్పికొట్టాయి కూడా.
రాజ్యాంగమిచ్చిన భరోసాకి భద్రత లేదా?
రాజ్యాంగంలోని 19(1)ఏ అధికరణం పౌరులకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించే విధంగా మరే చట్టమూ ఉండరాదనే నిబంధన కూడా ఉంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ దేశంలో ఎంతగా పెరిగితే.. ప్రజాస్వామ్య పటిష్టతకు అంత మంచిందనే విషయాన్ని అధికారంలో ఉన్న వారు కావాలనే మరిచిపోతున్నారు. మన రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అన్న పదబంధం లేదు. కానీ ప్రపంచంలోని ఏ ఇతర ప్రజాస్వామ్య దేశాలకూ తీసిపోని రీతిలో మనమూ ఆ హక్కును పొందుతూ వస్తున్నాం. మన పాలకులు, రాజనీతిజ్ఞుల దూరదృష్టివల్ల అది ఈ మధ్య వరకూ సాధ్యపడింది. కానీ, ఇటీవలి కాలంలో ఆ స్ఫూర్తికి భంగం కలిగించే ధోరణులు పాలకుల్లో పెచ్చుమీరుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే పత్రికా స్వేచ్ఛలో మనం ఇప్పుడు మరీ వెనుకబడి ఉన్నాం. ‘రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్’ అనే ఎన్జీవో ఏటా వెల్లడించే ‘ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్’లో 2002లో 80వ స్థానంలో ఉన్న మన దేశం 2014లో 140వ స్థానానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ అభిప్రాయాలు, ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచే వేదికగా ఉన్న సామాజిక మాధ్యమాన్ని దెబ్బతీయడం మరింత పతనానికి దారితీస్తుంది. ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్న ఈ మాధ్యమం మరింత స్వేచ్ఛగా నడిచేలా పాలకులు ప్రోత్సహించాలి. భావ ప్రకటనా స్వేచ్ఛను ఏ రూపంలోనూ హరించకుండానే సైబర్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి.
మన రక్షణ వ్యవస్థ భద్రత అంతంత మాత్రమే
సైబర్ దాడులతో శత్రుదేశాలు మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన సకల సమాచారాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదముందని వివిధ ఐటీ విశ్లేషణ సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి. మన పదాతి, జల, వాయు సేనలకు సంబంధిం చిన అంతర్గత, ఉమ్మడి, సమీకృత సమాచారాలు శత్రు దుర్బేధ్యమైనవిగా ఉండాలి. మన రక్షణ రంగంలో సైబర్ భద్రత వ్యవస్థ అంతంత మాత్రమే! సైబర్ ఘాతుకాల విషయంలో చైనా, కొరియా వంటి దేశాలపై నిర్దిష్టమైన ఆరోపణలున్నాయి. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొని నిలువాలంటే, పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి సైబర్ రంగంలో, ముఖ్యంగా భద్రత విష యంలో విసృ్తతమైన పరిశోధన, అభివృద్ధి చర్యలు చేపట్టడం తక్షణావసరం. శత్రుదేశాల ఆటలు సాగని రీతిలో పటిష్టమైన సైబర్ భద్రత దిశగా తగు చర్యలు తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. అదే సమయంలో పౌరుల వాక్ స్వాతంత్య్రాన్ని భంగపరిచే రీతిలో చట్టాలు చేయడం మానాలి.
ఈమెయిల్: dileepreddy@sakshi.com