ఎగ్జిమా
ఆయుర్వేద శాస్త్రానుసారం ఎగ్జిమా వ్యాధిని విచర్చికా వ్యాధిగా పిలుస్తారు. ఇది ఒక చర్మవ్యాధి. ఈ వ్యాధి మన శరీరంలో రోగ నిరోధక శక్తి హెచుతగ్గుల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. పెద్దవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
అకాల ఆహార విహారాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అజిన్‌ల వలన జీర్ణశక్తి తగ్గి పిత్తదోషం ప్రకోపించిదీనివలన ఆమము అనే విషపదార్థాలు శరీర కణాల్లో ఏర్పడి చర్మ భాగాన్ని దూషింప జేస్తాయి. ఈ కారణాల వలన విచర్చికా వ్యాధి ప్రారంభమవుతుంది. ఇది 3 రకాలుగా వర్ణిస్తారు.
1. వాత దోష విచర్చికా: చర్మం పొడి బారినట్లు ఉండి, నొప్పి, దురద ఉంటుంది.
2. కఫ దోష విచర్చికా: చర్మం దళసరిగా ఉండి దురద, తేమ కలిగి ఉంటుంది.
3. పిత్త రోష విచర్చికా: మంట, జ్వరం మొదలైన లక్షణాలతో చర్మం చిట్లినట్లు ఉంటుంది.
వ్యాధి కారణాలు..
శీతల పదార్థాలు, ఉప్పు, కారం, మసాలాలు, అధిక మోతాదులో కలిగిన పదార్థాలు తీసుకోవటం వలన, నిల్వ ఆహారం తీసుకోవటం, నూనెతో చేసిన పదార్థాలు వాడటం వలన, నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయటం, ఆల్కహాల్, టీ, కాఫీలు అధికంగా సేవించటం, మలబద్ధకం, అజీర్తి, ఒత్తిడి ఈ వ్యాధికి ముఖ్య కారణాలు.
లక్షణాలు:
దురద, చర్మం ఎర్రగా ఉండటం, ఎండిన చర్మం, చర్మంపై పొలుసులుగా ఏర్పడటం, వాపు, దురద, చర్మం మందబారటం, పొక్కులుగా ఏర్పడటం మొదలైన లక్షణాలు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. నూనె వస్తువులు, మసాలా, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
2. ఔషధ గుణాలు కల సబ్బులు వాడాలి.
3. రోగి దుస్తులు వేరొకరు వేసుకోరాదు.
4. వేళకు భోజనం చేయాలి. రాత్రి పూట ఎక్కువగా మేల్కొనరాదు.
5. ఒత్తిడి, ఆలోచనలు మానుకోవాలి.
6. చల్లిని గాలిలో, అతి ఎండలో తిరగరాదు.
ఆయుర్వేద వైద్యంలో చక్కని ఔషధాలు విచర్చికా వ్యాధికి అందుబాటులో ఉన్నాయి. అనుభవం కలిగిన వైద్యుల సమక్షంలో వ్యాధి నిర్థారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే శాశ్వతంగా ఎగ్జిమా వ్యాధిని నివారించుకోవచ్చు.