అభిమాని కోసం అడ్రెస్
సినిమాల్లో తారల డ్రెస్‌లు చూసి మనసుపడతాం. అలాంటి ట్రెండీ డిజైన్లు ధరించాలని ముచ్చటపడతాం. కానీ.. సేమ్ టు సేమ్ ఎక్కడ దొరుకుతాయి! అదిగో ఆ హీరో వేసుకున్న డ్రెస్... ఇదిగో ఈ తార కట్టుకున్న చీరలాంటివే కావాలంటే..? షాపులన్నీ తిరిగినా ఆ వెరైటీలు కనిపిస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటివారి అభిరుచిని గమనించి ఆన్‌లైన్‌లో ఓ స్టోర్ ఓపెన్ చేశారు సిటీ కుర్రాళ్లు చిన్మయ్ రాజు, మామిడి రాజా. బీటెక్ చదివిన వీరు మంచి ఉద్యోగాలు వదిలేసి ‘క్లాప్‌వన్.కామ్’ను రూపొందించారు.
చిన్మయ్ చెల్లెలు హీరోయిన్ సమంత అభిమాని. ఈగ సినిమాలో ఆమె వేసుకున్న టాప్‌లాంటిదే కావాలని అన్నయ్యను అడిగింది. సిటీలో ఎక్కడ వెతికినా దొరకలేదు. ఈ అనుభవం ఓ బిజినెస్ ఆలోచనకు దారి తీసింది. స్నేహితుడు రాజాతో కలసి క్లాప్‌వన్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించాడు చిన్మయ్. దీనికి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సాంకేతిక, ఆర్థిక సహకారం అందించింది.వీళ్లు కొంతమంది ఫ్యాషన్ డిజైనర్లను నియమించుకున్నారు. కొత్త సినిమాల్లో తారలు వేసుకున్న డ్రెస్‌లు పరిశీలించి వాటి డిజైనింగ్ వివరాలు, కలర్స్‌ను డిజైనర్లు అందిస్తారు. అలాంటివే సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే పెడతారు. సదరు తారల ఫొటోలనే వెబ్‌సైట్లో పెడతారు. కావల్సినవారు ఆ తారల ఫొటోలు క్లిక్ చేస్తే ఆన్‌లైన్ స్టోర్‌లోకి ఎంటర్ అయ్యి కొనుగోలు చేయవచ్చు. మింత్రా, ఫ్లిప్‌కార్ట్, జబాంగ్, ఫ్యాషనోరా వంటి వెబ్‌సైట్లతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వెబ్‌సైట్‌ను రోజుకు 50 వేల మంది వీక్షిస్తున్నారంటే తారల డ్రెస్‌లను ఫాలో అయ్యేవారు ఎంత మంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
- విజయారెడ్డి