మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫైర్‌ఫాక్స్ దృష్టి
వెబ్ బ్రౌజింగ్‌ను సులభతరం చేసి ఫైర్‌ఫాక్స్ నెటిజన్ల మనసు దోచుకుంది. ఇప్పుడు ఈ సంస్థ సెల్‌ఫోన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో పాతుకుపోయిన ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్లకు పోటీ ఇవ్వాలని ఫైర్‌ఫాక్స్ ఒక ప్రయత్నం చేస్తోంది. ఐదేళ్ల క్రిందట సెల్‌ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)కు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మొబైల్ ఫోన్ల తయారీలో అప్పట్లో కింగ్‌లా ఉన్న నోకియా ఈ ఓఎస్కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించక తీవ్రంగా దెబ్బతింది.
సరిగ్గా అదే సమయంలో గూగుల్ సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. ఓఎస్పై ఆధారపడే భవిష్యత్తులో సెల్‌ఫోన్ అమ్మకాలు జరుగుతాయని గ్రహించింది. ఆ క్రమంలో ఆండ్రాయిడ్ అనే సంస్థను కొనుగోలు చేసింది. తాను సొంతంగా సెల్‌ఫోన్లు తయారు చేయనప్పటికీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా సెల్‌ఫోన్ రంగాన్ని శాసించే స్థితికి చేరుకుంది. 75 శాతం మార్కెట్ వాటాతో నెంబర్‌వన్‌గా నిలిచింది.
యాపిల్ కంప్యూటర్స్ ఐఫోన్ కోసం రూపొందించి ఐఓఎస్ కూడా ఈ క్రమంలో బాగా వెనక్కు వెళ్లిపోయింది. నోకియా తన సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంత ఎగదోసినా లాభం లేకుండా పోయింది. కొత్త గాడ్జెట్లను మెరుపు వేగంతో కాపీ కొట్టే స్యాంసంగ్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో చతికిలబడింది. బడా పేరుతో తీసుకువచ్చిన ఓఎస్ ఫోన్లు ఆదరణ పొందలేదు.
ఇంకా బ్లాక్‌బెర్రీతో పాటు పలు సంస్థలు రూపొందించిన ఓఎస్లు కూడా మార్కెట్లో నిలబడలేదు. మొబైల్ ఫోన్లు చొచ్చుకురావడంతో మైక్రోసాప్ట్ కూడా విండోస్ మొబైల్ ఓఎస్ను రూపొందించింది. అయితే దానికి అంతంతమాత్రంగానే ఆదరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో వెబ్‌బ్రౌజర్‌గా విజయవంతమైన ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద దృష్టి పెట్టింది. లైనెక్స్ ఆధారంగా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఇప్పటికే జెడ్టీఈ, సోనీ కంపెనీలు వినియోగిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఫైర్‌ఫాక్స్ ఫోన్లను కూడా విడుదల చేసింది. మన దేశంలో ఇంటెక్స్, స్పైస్ కంపెనీలు ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. నోకియా, స్యాంసంగ్, బ్లాక్‌బెర్రీ , మైక్రోసాప్ట్ లాంటి దిగ్గజాలు సరైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించలేక చతికిలబడ్డాయి.
ఈ పరిస్థితుల్లో ఫైర్‌ఫాక్స్ రూపొందించిన ఓఎస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్నార్థకమే. అయితే ఈ ఓఎస్ ఓపెన్ సోర్స్ కాబట్టి, సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు తమకు కావాల్సిన రీతిలో మార్చుకోవడానికి వీలవుతుంది. ఈ వెసులుబాటు ఆధారంగా ఫైర్‌ఫాక్స్‌కు కొంత మేర ఆదరణ లభించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.
**