నగరంలో పిట్టలోళ్లు...
హైదరాబాద్ నగరంలో పిట్టలోళ్లుగా గుర్తింపు పొందిన పార్ధీల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పార్ధీల కుటుంబ వ్యవస్థల్లో మహిళలదే ఆధిపత్యం. కుటుంబ వ్యవహారాల్లో వారిదే అంతిమ నిర్ణయం. పండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసే పార్ధీలకు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బస్తీలు ఉన్నాయి. వీటిని పార్ధీవాడాలు అంటారు. పార్ధీలకు ప్రత్యేకంగా భాష ఉన్నా, దానికి లిపి లేదు.
నగరంలో పార్ధీల జనాభా దాదాపు రెండున్నర లక్షల వరకు ఉంటుంది. అయితే, వీరికి ప్రత్యేకమైన అసోసియేషన్లు లేవు. బస్తీల వారీగా పంచాయతీ కమిటీలు ఏర్పాటు చేసుకుని, వీరు తమ బాగోగులు చూసుకుంటుంటారు. కొండజాతి ప్రజలనే పార్ధీలంటారు. పురుషులను పార్ధీ అని, మహిళలను పార్ధన్ అని పిలుస్తారు. కొండ ప్రాంతాలకు చెందిన పార్ధీలు వేట కోసం కుటుంబ సమేతంగా సంచార జీవనం కొనసాగించేవారు. పక్షులను వేటాడటంతో వీరు పిట్టలోళ్లుగా గుర్తింపు పొందారు.
పార్ధీల మొదటి ప్రజాప్రతినిధులు...
పాతబస్తీ పురానాపూల్ డివిజన్‌లో అప్పటి బల్దియా కౌన్సిలర్‌గా మొదటిసారి ఎన్నికైన కె.కాశీరాం 1968-69లో హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా కొనసాగారు. పార్ధీ వర్గానికి చెందిన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. అనంతరం 1986లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఇదే పురానాపూల్ బస్తీ నుంచి పురానాపూల్ డివిజన్ మహిళా కౌన్సిలర్‌గా ఎస్.విజయకుమారి ఎన్నికయ్యారు. పార్ధీ వర్గానికి చెందిన తొలి మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె గుర్తింపు పొందారు.
వినాయక చవితి, హోలీ ప్రధాన పండుగలు...
పార్ధీలకు వినాయక చవితి, హోలీ ప్రధానమైన పండుగలు. ఈ రెండు పండుగలను వీరు ఘనంగా జరుపుకుంటారు. రకరకాల పండ్లతో కూడిన ప్రత్యేక వాహనంపై వినాయకుడిని నిమజ్జనానికి తరలించేటప్పుడు ఆడామగ చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా దారిపొడవునా నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతారు. హోలీ పండుగను మూడురోజులు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ఉన్న పార్ధీలందరూ పాతబస్తీ శివార్లలోని జల్‌పల్లిలో మకాం వేసి, హోలీ వేడుకలను ఘనంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. జల్‌పల్లిలోని గోల్కొండ నవాబు ప్రియురాలు మీరాబాయి సమాధితో పాటు తమ పూర్వీకుల సమాధుల వద్ద శ్రద్ధాంజలి ఘటించడం వీరి ఆనవాయితీ.
గోల్కొండ నవాబు కాలంలో....
గోల్కొండ నవాబుల కాలంలో రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన మీరాబాయి నగరానికి వలస వచ్చింది. అప్పటి గోల్కొండ నవాబు ఆమెపై ప్రేమాభిమానాలను చూపించి 17 గ్రామాలను బహూకరించినట్లు ఇక్కడి పార్ధీలు చెబుతున్నారు. నాలుగు శతాబ్దాల కిందటే నగరానికి వలస వచ్చిన పార్ధీలు తమ సంస్కృతీ సంప్రదాయాలను నేటికీ కాపాడుకుంటున్నారు.
నగరంలో....
పురానాపూల్, ఎస్.వి.నగర్, లక్ష్మీనగర్, విష్ణునగర్, జాలీ హనుమాన్, లాల్‌దర్వాజా, రాజన్నబౌలి, ఎల్‌బీనగర్, చిక్కడపల్లి, మురళీధర్ బాగ్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, ఫతేనగర్, ఎర్రగడ్డ, సీతాఫల్‌మండి, చిలకలగూడ, బాలానగర్, కాచిగూడ చౌరస్తా, మల్కాజిగిరిలోని ఉప్పర్‌గూడ, సికింద్రాబాద్ గ్యాస్ మండి, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో పార్ధీవాడలున్నాయి.
పార్ధీలేమంటున్నారంటే...
పేదరికంలో మగ్గుతున్న తమను ఎస్టీలుగా గుర్తించాలని పార్ధీలు కోరుకుంటున్నారు. ముప్పయ్యేళ్ల కిందట తమను ఎస్టీలుగా గుర్తించినట్లు కేంద్రం ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. పార్ధీవాడల్లో తమ కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని కోరుతున్నారు. జల్‌పల్లిలో పార్ధీలకు చెందిన దాదాపు వంద ఎకరాల స్థలాన్ని రౌడీషీటర్లు కబ్జా చేశారని, ఆ స్థలాన్ని కాపాడాలని, చిరువ్యాపారాలు చేసుకుంటున్న తమకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు.
..:: పిల్లి రాంచందర్